బాలలందరినీ ఈ దిశగా ఉద్యుక్తుల్ని చేయాలి
పివి సింధు విజయాలు అద్భుతం
ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు సోమవారంనాడు ఉప రాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును కలిశారు. సింధుతోపాటు ఆమె తండ్రి కూడా ఆమెతోపాటు వున్నారు. బిడబ్ల్యుఎఫ్ వరల్డ్‌టూర్ ఫైనల్స్ టైటిల్‌ను గెల్చుకున్న తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధు ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆమె ఉపరాష్ర్టపతిని కలిశారు. వెంకయ్యనాయుడు ఆమె విజయాన్ని అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, క్రీడల పట్ల మరింత ప్రోత్సాహం పెరగాలని అన్నారు. ప్రతి ఒక్క బాలుడ్ని, బాలికను ఈ దిశగా ప్రోత్సాహం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడలనేవి విద్యలో భాగంగా, ప్రధానాంశంగా ఉండి తీరాలని వెంకయ్యనాయుడు చెప్పారు. పి.వి.సింధు విజయాలు ఈ దేశానికే గర్వకారణమని ప్రశంసించారు. సింధు నిలకడగా ఆడుతూ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారని, ఆమె విజయాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. సింధు నేటి యువతకు ఒక రోల్ మోడల్‌గా వున్నారన్నారు. సింధు అంకితభావం, కష్టపడే మనస్తత్వం, ఓపిక, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. క్రీడల ప్రాధాన్యత గురించి వెంకయ్యనాయుడు ప్రస్తావిస్తూ, మనిషి ఓవరాల్‌గా వ్యక్తిత్వం మెరుగుపడాలంటే శారీరక వ్యాయామం కచ్చితంగా వుండాలని అభిప్రాయపడ్డారు. పిల్లలు చిన్నప్పటి నుంచే క్రీడల్లో ఆరితేరాలని, ఇందుకోసం వారిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆ దిశగా సాగేలా కృషి చేయాలన్నారు. క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి పెరుగుతాయని, అది అత్యుత్తమ పౌరులుగా పిల్లలు మారడానికి దోహదం చేస్తాయన్నారు. ఆరోగ్య భారతం ఆవిష్కరణ జరగాలన్నా, సంపంద్వంతమైన జాతి వుండాలన్నా పిల్లలకు ఇప్పటి నుంచే ఆటల్లో ప్రమేయం వుండాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. శారీరక వ్యాయామం ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడటానికి ఉపయోగపడుతుందన్నారు. సింధు కోచ్ అయిన పుల్లెల గోపీచంద్‌ను కూడా ఆయన అభినందించారు. గోపీచంద్ ఎంతోమంది క్రీడా నిపుణులను తయారు చేశారన్నారు. అలాగే పి.వి.సింధునును ఈ స్థాయికి తీసుకువచ్చిన ఆమె తల్లిదండ్రులను కూడా వెంకయ్యనాయుడు అభినందించారు.