రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ స్పిన్నర్
న్యూఢిల్లీ: భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్సహా, అన్ని రకాల టోర్నీల నుంచి వైదొలగుతున్నట్టు 41 ఏళ్ల భజ్జీ శుక్రవారం ప్రకటించాడు. తన 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అన్ని విధా లా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెట్ నుంచి వీడ్కోలు సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యాడు. ‘మంచి రోజులు ముగిశాయి. నా జీవితంలో నాకు అన్నింటినీ అందించిన ఆట కు వీడ్కోలు పలుకుతున్నా’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అత్యుత్తమ స్పిన్నర్లలో తనదైన శైలీతో గుర్తింపు తెచ్చుకున్న హర్భజన్‌ను అభిమానులు ‘భజ్జీ’, ‘టర్బనేటర్’ అని పిలుచుకుంటారు. హర్భజన్‌కు క్రికెట్ లో తొలి గురువు చరణ్ జిత్ సింగ్. ఆరంభంలో ఆయన దగ్గర భజ్జీ బ్యాటర్‌గా శిక్షణ తీసుకున్నాడు. కానీ, చరణ్ జిత్ సింగ్ అకాల మరణం తర్వా త అతను తన కొత్త కోచ్ దేవిందర్ అరోరా దగ్గర స్పిన్ బౌలింగ్ నేర్చుకున్నాడు. క్రమంగా ఆఫ్ స్పిన్నర్‌గానే స్థిరపడ్డాడు. 2003లో అర్జున, 2009లో పద్మశ్రీ అవార్డులను అందుకున్న భజ్జీ తన కెరీర్లో 103 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాపై బెంగళూరులో, 1998 మార్చి 3న అతని టెస్టు జీవితం ప్రారంభమైంది. గాలేలో శ్రీలంకపై 2015 ఆగస్టు 12న ప్రారంభమైన టెస్టు అతనికి ఈ ఫార్మెట్ కెరీర్లో చివరి మ్యాచ్. మొత్తం 28,580 బంతులు వేసిన అతను 13,537 పరుగులిచ్చి 417 వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్లలో అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), రవిచంద్రన్ అశ్విన్ (427) తర్వాత, నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. బ్యాటింగ్‌లోనూ రాణించిన భజ్జీ మొత్తం 2,224 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 115 పరుగులు. టెస్టుల్లో అతను రెండు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం న్యూజిలాండ్‌పై 1998 ఏప్రిల్ 17న జరిగింది. ఈ ఫార్మాట్లో చివరి మ్యాచ్‌ని అతను ముంబయిలో దక్షిణాఫ్రికాపై 2015 అక్టోబర్ 25న ఆడాడు. ఈ విభాగంలో 12,479 బంతలు వేసిన అతను 8,973 పరుగులిచ్చి, 269 వికెట్లు కూల్చాడు. 1,237 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 49 పరుగులు. కెరీర్లో అతను కేవలం 28 టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి, 612 బంతులు వేశాడు. 633 పరుగులిచ్చి 25 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 108 పరుగులు చేసిన భజ్జీకి టి20 ఇంటర్నేషనల్స్ల అత్యధిక స్కోరు 21 పరుగులు.
సహచరుడు నయన్ మోంగియా హర్భజన్ పేరు పలకడం కష్టంగా తోచింది. అందుకే అతనిని భజ్జీ అని పిలిచేవాడు. ఆ తర్వాత భజ్జీ అనే పేరు చాలా పాపులర్ అయింది. ఆ పేరుతోనే హర్భజన్ 2009లో పేటెంట్ హక్కులు పొందాడు. భజ్జీ అనే పేరుతో స్పోరట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్‌ను స్థాపించాడు. హర్భజన్ మూడు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రలు పోషించాడు. ముజ్ సే షాదీ కరోగి (2004), భాజీ ఇన్ ప్రాబ్లమ్ (2013), సెకండ్ హ్యాండ్ హస్బెండ్ (2015) సహా ఫ్రెండ్షిప్ అనే మూవీలో లీడ్ రోల్ పోషించాడు. ఫ్రెండ్షిప్ అనే చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.
వివాదాలతో చెట్టపట్టాలు..
హర్భజన్ బౌలర్‌గా ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో, అదే స్థాయిలో వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. ‘మంకీగేట్’ ఉదంతం అతని కెరీర్లోనే అత్యంత వివాదాస్పద ఘటన. 2008లో ఆస్ట్రేలియాతో సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన టెస్టులో భారత్ 122 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తనను ‘మంకీ’ (కోతి) అంటూ సంబోధించి, జాతి వివక్షను ప్రదర్శించాడంటూ భజ్జీపై ఆసీస్ బ్యాట్స్‌మన్ అండ్రూ సైమండ్స్ తీవ్ర ఆరోపణలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కూడా ఈ విషయాన్ని చాలా సీనియస్‌గా తీసుకోవడంతో హర్భజన్ కెరీర్ ప్రమాదంలో పడింది. అయితే, అజాతశత్రువుగా పేరుపొందిన సచిన్ తెండూల్కర్ జోక్యం చేసుకొని, భజ్జీ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని వివరణ ఇవ్వడంతో సమస్యనుంచి భజ్జీ బయటపడ్డాడు. ఐపిఎల్‌లో అప్పటి ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ను భజ్జీ చెంపదెబ్బ కొట్టిన ఉదంతం సంచలనం రేపింది. 2008 ఐపిఎల్ మ్యాచ్‌లో శ్రీశాంత్ మైదానంలో ఏడుస్తూ కనిపించడాన్ని లక్షలాది మంది ప్రత్యక్షంగానో, టీవీల్లోనూ వీక్షించారు. హర్భజన్ కెరీర్లో మాయని మచ్చగా ఆ ఘటన మిగిలిపోయింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో వాగ్వాదం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సిఎ) నుంచి గెంటివేతకు గురకావడం, 2002లో పోలీసులతో ఘర్షణపడి, అరెస్టు వరకూ సమస్యను పెంచుకోవడం, 2005లో అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శపాలు కావడం.. ఇలా భజ్జీ జీవితంలో ఎన్నో వివాదాలు. అయితే క్రికెట్ ప్రపంచానికి దేశం అందించిన గొప్ప స్పిన్నర్లలో ఒకడిగా భజ్జీ పేరు ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.
క్రికెట్‌కు భజ్జీ గుడ్‌బై
RELATED ARTICLES