పెర్త్ : ఆస్ట్రేలియా జట్టుతో ఎవరైనా మాటల యుద్ధం చేయాల్సిందే. ప్రపంచంలోని ఇతర క్రికెట్ జట్లన్నింటికీ ఇది అనుభవమే. తాజాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధ్దం మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌లో వివాదాస్పద రీతిలో ఔటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో తన నోటికి పనిచెప్పాడు. మూడో రోజు ఆటలో భాగంగా ఆసీస్ కెప్టెన్ టీమ్ పెయిన్‌పై మాటలను విసిరాడు. పలుమార్లు ఔటవ్వకుండా తప్పించుకున్న పెయిన్ దగ్గరకు వెళ్లి.. ‘మీరు ఇలా ఆడితే సిరీస్ 2-0గా మారుతుంది’ అని హెచ్చరించాడు. దీనికి పెయిన్ సైతం అదే రీతిలో బదులిచ్చాడు. ‘మీరు ముందు బ్యాటింగ్ చేయాల్సింది కదా బిగ్‌హెడ్’ అని కోహ్లి మాటలను తిప్పికొట్టాడు. ఇవి స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది మూడో రోజు ఆట చివరి ఓవర్లో చోటు చేసుకుంది. మాములుగా ఆసీస్ అంటే ఊగిపోయే కోహ్లి.. ఈ సారి కూడా అలానే రెచ్చిపోయాడు. అటు బ్యాట్‌తోను రాణించాడు. శతకం బాది ఆసీస్‌కు తన సత్తా ఏంటో చూపించాడు. కానీ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైన కోహ్లి.. అసహనం వ్యక్తం చేస్తూనే మైదానం వీడాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగుల ఆధిక్యం సాధించిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
కోహ్లీ, పెయిన్ల మాటల యుద్ధ్దం!

RELATED ARTICLES