కోరలు చాస్తున్న విద్యుత్‌ కంచెలు

రైతుల ప్రాణాలను కబలిస్తున్న కరెంట్‌ తీగలు చేను రక్షణకు వేసిన విద్యుత్‌ తీగ తాకి రైతు మృతి

ప్రజాపక్షం/హత్నూర : వన్య ప్రాణుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ కంచెలే రైతుల పాలిట యమపాశాల్లా మారుతున్నాయి. పుడమిని నమ్ముకొని జీవించే కర్షకులు కరెంట్‌ కాటుకు బలై నేలతల్లి ఒడిలో శాశ్వతంగా నిద్రపోతున్నారు. విద్యుత్‌ కంచె రూపంలో పొంచి ఉన్న మృత్యువు రైతుల ప్రణాలను కబలించి వేస్తుంది. చేను చుట్టు బిగించిన విద్యుత్‌ తీగలను తాకి అమాయక రైతులు అసువులు బాస్తున్నా రు. తరుచూ ఇలాంటి ప్రాణాంతకమైన ఘటనలు జరుగుతున్నా విద్యుత్‌ కంచెను ఏర్పాటు చేస్తున్న రైతుల్లో కనువిప్పు కలగడం లేదు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని కొన్యాల గ్రామానికి చెందిన పత్తి నర్సమ్మ, పత్తి మల్లేశం సెప్టెంబర్‌ 25న మొక్కజొన్న చేను చుట్టూ పెట్టిన విద్యుత్‌ కంచెను తాకి మృత్యువాత పడిన ఘటన మరవకముందే తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని కాసాల గ్రామానికి చెందిన నాయికోటి జాన్‌ (47) అనే రైతు ఆదివారం అర్ధరాత్రి విద్యుత్‌ కంచెకు తాకి మృత్యువాత పడ్డాడు. బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాయికోటి జాన్‌ది నిరుపేద రైతు కుటంబం. అతనికి భార్య మాణెమ్మ, కుమారులు రమేస్‌, సామెల్‌, మోషే లు ఉన్నారు. తమకున్న కొద్ది పాటి పొలంతో పాటు గ్రామానికి కొద్ది దూరంలో మంజీరా నది సమీపంలో గల కొంత పొలాన్ని కౌలుకు తీసుకొ ని అందులో వరి పంట సాగు చేస్తున్నారు. జాన్‌ సాగు చేస్తున్న పొలం పక్కనే అదే గ్రామానికి చెందిన రైతు పాతూరి మల్లేశం పొలం ఉంది. ఆయన కూడా వరి పంట సాగు చేశారు. మంజీర పరివాహాక ప్రాంతానికి ఆనుకోని ఉండడంతో అడవి పందుల బెడద తీవ్రంగా ఉంది. దీంతో పంట రక్షణకు మల్లేశం పొలం చుట్టూ విద్యుత్‌ తీగను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం జాన్‌, కుమారుడు సామెల్‌ వారి పక్క పొలం రైతు పాతూరి మల్లేశంతో పాటు మరో రైతు కలిసి పొలం వద్దకు వెళ్లారు. పంట పొలాన్ని కలియ తిరిగారు. ఆ తరువాత భారీ వర్షం రావడంతో అందరూ ఇంటికి తిరుగు ముఖం పట్టారు. కొద్ది దూరం వచ్చాక నాయికోటి జాన్‌ ఇప్పుడే వస్తానంటూ చెప్పి తిరిగి పొలం వద్దకు వెళ్లాడు.

DO YOU LIKE THIS ARTICLE?