గిరిజనుల ఇండ్లను తొలగించిన అధికారులు ప్రజాపక్షం/ మంచిర్యాల మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయషోశగూడెంలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని కోర్ ఏరియాలో ఆదివాసీ, గిరిజనులు గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. అప్పటికే వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు, ఆదివాసీ గిరిజనులు ఎదురుతిరిగారు. అటవీ శాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులతో కలిసి గుడిసెలను
తొలగించడానికి యత్నించడంతో అధికారులకు, ఆదివాసీలకు మధ్య వాగ్వాదం, తోపులాట ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజనులు మాట్లాడుతూ తన భూమలుల్లో తాము గుడిసెలు వేసుకుంటే అధికారులు దౌర్జన్యంగా తొలగించారని, దశాబ్దాల కాలంగా భూముల్లో తాము సాగు చేసుకుంటూ నివాసం ఉంటున్నామని, తమకు చెందిన భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. పోడు భూములను నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటున్న తమపై అన్యాయంగా కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని, జైలుకు పంపుతున్నారని, ప్రభుత్వం, అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో అధికారులు అన్యాయంగా 12 మంది మహిళలను జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగాగత నెల చివరి వారంలో ఆదివాసీ గిరిజనులకు, అధికారులకు మధ్య జరిగిన పోరులో పోలీసులు ఆదివాసీ గిరిజన మహిళలను 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపగా స్థానిక కాంగ్రెస్ నాయకురాలు డిసిసి జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గిరిజనుల పక్షాన నిలబడి వారికి బెయిల్ మంజూరు చేయించి వారిని విడుదల చేయించారు. జైలుకు వెళ్ళి వచ్చిన ఆదివాసీ కుటుంబాలు వారు సాగు చేసుకుంటున్న భూముల్లో, నివాస ప్రాంతాల్లో తిరిగి గుడిసెలు నిర్మించడానికి యత్నించడంతో సమాచారం అందుకున్న అధికారులు వాటిని తొలగించేందుకు ప్రత్నించగా స్థానికంగా పెద్దఎత్తున ఘర్షణకు దారితీసింది. గ్రామంలోని గుడిసెలను పోలీసుల సహకారంతో తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై గ్రామస్తులు తిరగబడడంతో గ్రామంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కోయపోశగూడెం ఉద్రిక్తం
RELATED ARTICLES