HomeNewsBreaking Newsకొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి

కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి

కాంగ్రెస్‌ సర్కార్‌ను విమర్శించడం బిఆర్‌ఎస్‌ అసహనానికి నిదర్శనం
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి మారడాన్ని బిఆర్‌ఎస్‌ జీర్ణించుకోలేకపోతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. ప్రజాప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వకపోవడం అసహానం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని, విరుద్ధమని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోనికి వచ్చి నెల రోజులు కాకముందే బిఆర్‌ఎస్‌ హడావుడి చేయడం మంచి పద్ధతి కాదని, కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని హితువు పలికారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్‌, పెద్దపల్లి, నల్లగొండ, భువనగిరి స్థానాలపైన దృష్టి సారించామని, మొత్తంగా 17 లోక్‌సభ స్థానాలకు కమిటీలను నియమించి మరింత క్రీయశీలకంగా వ్యవహారించాలని నిర్ణయించినట్టు వివరించారు. లోక్‌సభ పరిధిలోని ప్రతి చోటా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ, సమితి సమావేశాల వివరాలను సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ,సయ్యద్‌ అజీజ్‌ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని ముగ్ధూంభవన్‌లో ఏర్పాటు చేసిన
మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు గురువారం వెల్లడించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలపై విశ్లేషణ జరిగిందని, ఎన్నికల అవగాహన ఒప్పందంతో సంతృప్తికరం చెందలేదని వివరించారు. ఎఐటియుసితో పాటు ప్రతి ప్రజా సంఘం ప్రధాన సంఘమేనన్నారు. సింగరేణి, బ్యాంకులు, ఆర్‌టిసి , మెడికల్‌ , విశాఖపట్నం పోర్ట్‌ ఇలా అనేక రంగాల్లో ఎఐటియుసి దశాబ్ధాల కాలంగా పని చేస్తోందని వివరించారు. ఎఐటియుసిలో లక్షలాధికంటే అత్యధిక సంఖ్యలో సభ్యులు ఉన్నప్పటికీ వారిని ఓటు రూపంలో మల్చుకోవడంలో విఫలమయ్యామని, తమ బలానికి తగిన భాగస్వామ్యం, ఇక నుండి ప్రజా సంఘాల బలాన్ని రాజకీయం వైపు మళ్లించేందుకు, పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. తమ బలానికి తగిన భాగస్వామ్యం పొందేలా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అవుతామన్నారు. బాగా పనిచేస్తారనే ఉద్దేశంతోనే ప్రజలు గతంలో టిఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించారని, బాగా చేయకపోవడంతోనే కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, వారూ చేయకపోతే ప్రజలే తీర్పునిస్తారని బిఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు. ప్రజాస్వామ్యంలో వాస్తవాలను బిఆర్‌ఎస్‌ అంగీకరించలేకపోతుందన్నారు. అధికారంలోనికి వచ్చి నెల రోజులు కాకముందే హడావుడి చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలలో సానుకూలం వ్యక్తమై, బిఆర్‌ఎస్‌ తొందరపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతాయని సూచించారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చాలా చేశామని అనుకుంటున్నారని,కానీ వారిదంతా కాగితాలకే పరిమితమని, ఒక్క సెక్షన్‌ కూడా గత ప్రభుత్వ పనితీరు పట్ల సంతోషంగా లేదన్నారు. బిఆర్‌ఎస్‌ కోడి ముందే కుస్తోందని కూనంనేని ఎద్దేవా చేశారు.

కొత్త సర్కార్‌కు కొంత సమయమిస్తాం: కూనంనేని
రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వానికి కొంత సమయమిస్తామని కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్మిక, జెన్‌కో, సింగరేణి, ఆర్‌టిసి, రైతాంగ, స్కీమ్‌ వర్కర్లు, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ జీతాల పెంపు, ఎక్కడా చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని, కొత్త రేషన్‌ కార్డులు, పెన్షన్‌ , క్షేత్ర స్థాయిలో ఎవ్వరూ సంతోషంగా లేరని వివరించారు. ఈ సమస్యలతో పాటు ఆరు గ్యారంటీల అమలు, పాతవి కవర్‌ చేసుకూంటూ వెళ్లాల్సి ఉంటుందని అందుకే కొంత సమయమిస్తామని, ఆ తర్వాతే ప్రజల పక్షాన సమస్యలను పరిష్కరించే పద్ధతిలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజా గొంతును వినిపిస్తామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలనూ పరిష్కరించాలన్నారు.

‘ప్రీ ప్లాన్‌’ చర్యలకు పాల్పడుతున్న బిజెపి: నారాయణ
దేశంలో ‘ఇండియా కూటమి’ బలపడుతున్న నేపథ్యంలోనే బిజెపి ప్రీప్లాన్‌ చర్యలకు పాల్పడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని, ప్రతిపక్షాల ఇండియా కూటమి బలడపతోందన్నారు. అయోధ్యను అడ్డంపెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఏ తేదీలలో ఏం చేయాలన్న అంశంపైన బిజెపి ఆయోధ్య ప్రారంభోత్సవం లాంటి అనేక కార్యక్రమాలతో కేలండర్‌ను రూపొందించుకున్నదని విమర్శించారు. కార్మిక రంగంలో తాము బలంగా ఉన్నామని, దీనిని ఓటింగ్‌లో మార్చుకునేందుకు సమయం పడుతుందన్నారు. తిట్టబోతే అక్క కూతురు, కొట్టబొతే కడుపుతో ఉన్న చందంగా తమ పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్‌ ప్రభత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో భాగమే జగన్‌, కెసిఆర్‌ భేటీ
ఎపి సిఎం జగన్‌, మాజీ సిఎం కెసిఆర్‌ భేటీ రాజకీయాల్లో భాగమేనని నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలింగ్‌ రోజే నాగార్జున సాగర్‌ వివాదం తెరపైకి తెచ్చి రెండు రాష్ట్రాల మధ్య గొడవ సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. సెంటిమెంట్‌ రెచ్చగొట్టే కెసిఆర్‌నుమళ్లీ గెలిపించాలని జగన ప్రయత్నించారని, ఇప్పడు తనను గెలిపించేందుకు ఏదైనా చేయాలని కోరేందుకే కెసిఆర్‌ను జగన్‌ కలిశారన్నారు. జగన్‌కు తన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా అందరూ దూరమయ్యారన్నారు. వై.ఎస్‌.షర్మిల ను ఎపి కాంగ్రెఎస్‌లోకి తీసుకుని జగన్‌ను భయటపెట్టారని, తెలంగాణలో కెసిఆర్‌ సర్కార్‌ పోయినట్టే ఎపిలో జగన్‌ ప్రభుత్వం పోవాలని అక్కడి ప్రజలు భావిస్తున్నారన్నారు.

గతంలో ఒక కుటుంబమే రాష్ట్రాన్ని పాలించింది: అజీజ్‌ పాషా
సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ ప్రజా నాడి, వారి డిమాండ్లు, ప్రజల స్పందనపైన సిఎంరేవంత్‌ రెడ్డి దృష్టిపెట్టారన్నారు. గత ప్రభుత్వంలో కేవలం ఒక కుటుంబమే రాష్ట్రాన్ని పాలించిందని విమర్వించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొంత విశాలదృక్ఫథంతో ఉన్నదన్నారు. కేంద్ర పార్లమెంట్‌ నుండి ప్రతిపక్షాలు బయట ఉన్న సమయంలో బిజెపి ప్రభుత్వం మూడు క్రీమినల్‌ చట్టాలను ప్రవేశపెట్టడం అన్యాయమని విమర్శించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌ రా్రష్ట్రాలలో బిజెపి గెలిచిన తర్వాత కేంద్రంలో తామే గెలుస్తామని ధీమాతో చెబుతున్నారని, వారు ఇవిఎంలపైనే ఆశలు పెట్టుకున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా కూటమి’ తప్పనిసరిగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments