కేర‌ళ‌లో లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు

కొట్టాయం (కేరళ) : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పుకార్లు సృష్టిస్తున్నవారు, వారిని ప్రోత్సహిస్తున్న వారిపై కేరళ పోలీసులు విరుచుకుపడ్డారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ పాయిప్పాడ్‌ గ్రామంలో ఆదివారం వలస కార్మికులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన తర్వాత కొట్టాయం జిల్లాలో ప్రజలు గుమికూడకుండా సిఆర్‌పిసి సెక్షన్‌-144 కింద నిషేధం విధిస్తూ కొట్టాయం జిల్లా కలెక్టర్‌ పి.కె.సుధీర్‌ బాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు ప్రకటించిన తరువాత కూడా జిల్లాలో బహిరంగ సభలు జరిగాయని పేర్కొంటూ జిల్లా పోలీసు చీఫ్‌, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ సమర్పించిన నివేదికల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా లాక్‌డౌన్‌ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు గుర్తించిన కొంతమందిపై కేసులు నమోదయ్యాయని జిల్లా పోలీసు చీఫ్‌ జి. జయదేవ్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వలస కార్మికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన చెప్పారు. కార్మికులను ప్రేరేపించిన వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. కాగా కరోనావైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సమాజంలో అశాంతిని సష్టించడానికి ప్రయత్ని స్తున్న ”శక్తులు” కార్మికవర్గాన్ని రెచ్చగొట్టడానికి కుట్ర పన్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?