కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో పోలింగ్‌ నేడే

ఒకే రోజుతో పరిసమాప్తం
అసోంలో ఆఖరి దశ
బెంగాల్‌లో మూడవ దశ
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా, కేరళ, తమిళనాడు, అసోం, పశ్చిమ బెం గాల్‌ రాష్ట్రాల్లో మంగళవారంనాడు పోలింగ్‌ జరుగుతుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే ఒక్క దశలో మంగళవారనాడు పోలింగ్‌ జరుగుతుండగా, అసోంలో మూడో విడత, -తుది దశ పోలింగ్‌, పశ్చిమ బెం గాల్‌లో మూడో దశ పోలింగ్‌ రేపు జరుగుతున్నది. వామపక్ష ప్రజాస్వామ్య సంఘటన (ఎల్‌డిఎఫ్‌)కు ప్రతిష్టాత్మకమైన కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్‌ జరుగుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధర్మదామ్‌ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా కనీసం 71 స్థానాలు గెలుచుకోవాలి. ఎల్‌డిఎఫ్‌ 77 కుపైగా స్థానాలు గెలుచుకుంటుందని ఇప్పటికే ప్రీ పోల్‌ సర్వేలు వెల్లడించాయి. ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌, బిజెపి నాయకత్వానగల ఎన్‌డిఎ కూటమిలు రాష్ట్రంలో పోటీ చేస్తున్నాయి. కేరళలో మొత్తం 2.74 కోట్మంది ఓటర్లలో కోటీ 32 లక్షల 83 వేల 724 మంది పురుషులు, కోటీ 41 లక్షల 62 వేల 25 మంది మహిళా ఓటర్లు, 290 ట్రాన్స్‌ జండర్లు ఉన్నారు. 140 స్థానాలకుగాను 957 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ముఖ్యమంత్రి విజయన్‌తోపాటు ఆరోగ్యమంత్రి కె.కె.శైలజ, దేవాదాయశాఖామంత్రి కడకంపల్లి సురేంద్రన్‌, విద్యుత్‌మంత్రి ఎంఎంమణి, ఉన్నతవిద్యాశాఖామంత్రి కెకె జలీల్‌ రంగంలో ఉన్నారు. ప్రతిపక్షం నుండి రమేష్‌ చెన్నితల, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ, సీనియర్‌ నాయకులు కె.మురళీధరన్‌, పి.టి.థామస్‌, తిరువంకోర్‌ రాధాకృష్ణన్‌లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి తరపున మిజోరాం మాజీ గవర్నర్‌ కుమ్మనమ్‌ రాజశేఖరన్‌, మెట్రో మ్యాన్‌ ఇ.శ్రీధరన్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌, సీనియర్‌ నాయకులు శోభా సురేంద్రన్‌, రాజ్యసభ సభ్యులు సురేష్‌ గోపి, కె.జె.ఆల్ఫోన్స్‌ తదితరులున్నారు. ఇక తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకేఒక్క విడతలో రేపు పోలింగ్‌ జరుగుతుంది. తమిళనాడులో 3,998 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంతి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం, డిఎంకె నేత స్టాలిన్‌, ఎఎంఎంకె వ్యవస్థాపకుడు టిటివి ధినకరన్‌, నటుడు, మక్కల్‌ నీధి మియామ్‌ పార్టీ నేత కమల్‌హాసన్‌ నామ్‌ తమిఝకశ్చి నాయకులు సీమన్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ తదితరులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం ఆరు కోట్ల 28 లక్షల మంది అర్హులైన ఓటర్లు రేపు ఓటింగ్‌లో పాల్గొంటారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలో ఉన్న 30 సీట్లకూ కూడా పోలింగ్‌ రేపే జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి మూడోవిడత 31 అసెంబ్లీ సీట్లకు పోలింగ్‌ జరుగుతుంది. 78 లక్షల 50 వేల మంది అర్హులైన ఓటర్లు ఈ విడత పోలింగ్‌లో పాల్గొని, 205 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేలుస్తారు. ఇక అసోంలో తుది దశ లేదా మూడో దశ పోలింగ్‌కు 337 మంది అభ్యర్థులు 12 జిల్లాలో ఉన్న 40 నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. ఈ విడత పోలింగ్‌లో 25 మంది మహిళలు కూడా రంగంలో ఉన్నారు. 20 మంది సిట్టింగ్‌ ఎమెల్యేలు పోటీలో ఉన్నారు. సీనియర్‌ మంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన ఐదుగురు మంత్రివర్గ సహచరులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్‌ కుమార్‌ దాస్‌ పోటీలో ఉన్నారు. ఈ తుదిదశలో 125 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?