ఖమ్మం బ్యూరో : ఇటీవల కాలంలో బహిరంగ సభలకు స్వచ్ఛందంగా జనం కదిలి రావడం లేదు. ఎన్నికల ప్రచారానికి సైతం కూలీలను మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు దాపురించింది. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన అపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ సభకు గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాల్లో కూలీలను తరలించారు. అయితే మధిర పట్టణం ఆంధ్రాకు సరిహద్దున ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల నుంచి ప్రజలను కెసిఆర్ బహిరంగ సభకు తరలించారు. ఆంధ్రా ఆంధ్రా అంటూ పదే పదే విమర్శించే కెసిఆర్ సభ చివరికి ఆంధ్రులు లేకుంటే నడవని పరిస్థితి వచ్చిందని మధిరలో కొందరు వ్యంగ్యాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. కెసిఆర్ సభకు ఆంధ్రా గ్రామాలైన తునికిపాడు, రాజవరం, దుందిరాలపాడు, తాళ్లూరు, శివాపురం, జొన్నలగడ్డ, జయంతి, వీరులపాడు, పెద్దాపురం తదితర గ్రామాల నుంచి కూలీలను తరలించారు. మధిర నియోజక వర్గంలో ఇలా సభలు ఆంధ్రా జనంతో జరగడం రెండవసారి గతంలో జరిగిన టిఆర్ఎస్ సభకు సైతం ఇదే పద్ధతిన ప్రజలను సమీకరించారు.
తాటి వెంకటేశ్వర్లుకు చేదు అనుభం
అశ్వారావుపేట టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాటి వెంకటేశ్వర్లుకు ఈ దఫా అన్నీ చేదు అనుభవాలే. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొన్నారు. మా గ్రామంలోకి రావద్దంటూ పొలి మేరల వద్దనే అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి. చివరకు ప్రజల నుంచి తిరస్కారం భావం ఎదుర్కొంటున్న తాటి వెంకటేశ్వర్లుకు అపధర్మ ముఖ్యమంత్రి సభలోనూ అదే పరిస్థితి ఎదురైంది. సత్తుపల్లిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు హెలీప్యాడ్ వద్దకు ఎదురెళ్లి నేతలు స్వాగతం పలికారు. అందులో తాటి వెంకటేశ్వర్లు ఉన్నారు. అక్కడి నుంచి వేదిక వద్దకు వచ్చి అపధర్మ ముఖ్యమంత్రితో పాటు వేదికను ఎక్కుతుండగా స్వయంగా అపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ తాటిని వారించారు. మరోసారి తాటి వెంకటేశ్వర్లు ఎక్కే ప్రయత్నం జరిగినా పోలీసులు అడ్డు చెప్పడంతో వెనుదిరగక తప్పలేదు. వాస్తవంగా సత్తుపల్లిలో జరిగిన కెసిఆర్ సభకు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు కూడా హాజరయ్యారు.