హైదరాబాద్ : మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులలో కెసిఆర్, కెటిఆర్ 6% కమీషన్లు పొందారా.. లేదా? సమాధానం చెప్పాలని టిపిసిసి అధ్యక్షులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు. రాష్టంలో రూ.80 వేల కోట్లకు పైగా నీటిపారుదల, మిషన్ భగీరథ, ఇతర రంగాల్లో ఖర్చు చేసిన విషయం పాఠకులకు విదితమే. 6% కమిషన్ అంటే రూ. 4800 కోట్ల ముడుపులు అందినట్లుగా చెప్పవ చ్చు. ప్రధాని పదవిని తిరస్కరించిన, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి సూట్ కేసులు అంద లేదని బాధపడుతుందా అని కెసిఆర్ అంటాడా? ఆయన తాగి మాట్లాడుతుండా? సోయిలేకుండా మాట్లాడుతుండా? అని ఉత్తమ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్ ఒక బ్రోకర్ అని, దొంగ పాస్ పోర్టులు అమ్ముకున్న వ్యక్తి అని, ఢిల్లీలో అరెస్టయితే కాంగ్రెస్ నేత ఎం.సత్యనారాయణరావు విడిపించారని, సూట్‌కేసుల అలవాటు ఆయనకే ఉన్నదని మండిపడ్డారు. ఈ దుర్మార్గుడు మరోసారి అందలం ఎక్కితే సామాన్యుడు మాములుగా బతకడం కష్టమన్నారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో సోమవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టియుడబ్లుజె) ఆధ్వర్యంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో “మీట్ ది ప్రెస్” నిర్వహించారు. దీనికి ‘ప్రజాపక్షం’ దిన పత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించగా, యూనియన్ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ ప్రారంభోపన్యాసం చేశారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఉత్తమ్ సమాధానమిస్తూ కెసిఆర్ జీవితమంతా అవినీతిమయమని, ఆయన వ్యక్తి త్వం లేని వ్యక్తి అని తూర్పారబట్టారు. అలాంటి వ్యక్తికి సోనియాగాంధీని విమర్శించే స్థాయి లేదన్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కాళ్ళు మొక్కిన కెసిఆర్, తెలంగాణకు కాపలా కుక్క లా ఉంటానని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాటతప్పిన అబద్ధాలు కోరు అని అన్నారు. కెసిఆర్ తెలంగాణకు సిఎం కావడం తెలంగాణ దురదృష్టకరమని, ఆయనకు రాజ్యాంగ పదవిలో ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణలో ఏ అభివృద్ధి పనులకు చంద్రబాబు అడ్డుపడ్డారని,డబుల్ బెడ్‌రూమ్, దళితులకు మూడు ఎకరాల భూమి, మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల పెంపులలో దేనిని అడ్డుకున్నారో కెసిఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా కూటమిలో ఉన్న కోదండరామ్,ఎల్.రమణ,చాడ వెంకట్‌రెడ్డి ఆంధ్రానా.. ? తెలంగాణనా అని సూటిగా ప్రశ్నించారు. దగుల్బాజి మాటలతో కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ రాజకీయ విలువలను, రాజకీయాలను కెసిఆర్ భ్రష్టు పట్టించారని, రాజకీయాలను దిగజార్చారని ద్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ ముసుగులో కెసిఆర్, కెటిఆర్‌లు కమీషన్లు,అధికార దహం కోసమే పని చేస్తున్నారన్నారు.
ప్రాణత్యాగానికి సిద్ధమయ్యా.. ప్రజలే మా పిల్లలు…
తాను 17 ఏళ్ళ వయస్సులోనే దేశ సేవ కోసం మిలిటరీలో చేరానని ఉత్తమ్ అన్నారు. తాను ప్రాణత్యాగానికి సిద్ధమై భారత్-చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో దేశ రక్షణకు పోరాటం చేసిన సమయంలో కెసిఆర్ దొంగపాస్‌పోర్టు లు, వీసాలను అమ్ముకున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో రవాణ శాఖమంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ బదిలీల అంశంలో కూడా డబ్బులు తీసుకున్నారన్నారు. తండ్రి కొడుకులు(కెసిఆర్, కెటిఆర్) సన్నాసులు, దద్దమ్మలేనని వ్యాఖ్యానించారు. తనకు అవినీతి పాల్పడాల్సిన అవసరం లేదని, తాను, తన భార్య తప్ప తమకు పిల్లలు లేరని, తెలంగాణ ప్రజలనే కుటుంబం అనుకుంటున్నామని చెప్పారు.తెలంగాణను దోచుకున్న ఆ డబ్బుతోనే ఎన్నికల్లో గెలువాలనే తా పత్ర యపడుతున్నారని,అయినా ఓటమి తప్పదనే భయంతో కెసిఆర్ సోయిలేకుండా మాట్లాడుతున్నారన్నారు.
టిఆర్‌ఎస్‌కు ఎంఐఎం ఎందుకు మద్దతిస్తోంది?
సిఎంల విషయంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి వ్యాఖ్యలు ఆహాంకారానికి నిదర్శనమని ఉత్తమ్ అన్నా రు. టిఆర్‌ఎస్‌కు ఎంఐఎం ఎందుకు మద్దతునిస్తుందని, ఆలేరులో ఆరుగురు ముస్లింలను ఎన్‌కౌంటర్ చేసిందుకా.?, బిజెపికి మద్దతు పలుకుతున్నందుకా అని ఉత్త మ్ ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం ఇప్పుడు కెసిఆర్‌కు స్నేహితులయ్యారని, అదే రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను కెసిఆర్ ఆరోపిస్తున్నారని చెప్పారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లపై అంశంలో ఢిల్లీలో భూకం పం సృష్టిస్తానని కెసిఆర్ ముస్లిం, గిరిజనులను మోసం చేశారని, వారిని ఓటు అడిగే హక్కు కెసిఆర్‌కు లేదన్నారు. విద్యుత్ విషయంలో టిఆర్‌ఎస్ చేసింది సున్నా అని, ఒక్క యూనిట్ కొత్తగా ఉత్పత్తి చేయలేదని, దేశవ్యాప్తంగా అధిక విద్యుత్ ఉత్పత్తి ఉండడంతోనే నిరంతర విద్యుత్ సాధ్యమైందన్నారు.
ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఉత్తమ్ హామీనిచ్చారు. ప్రజా రవాణ వ్యవస్థ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, దీని లాభ నష్టాలను పరిగణలోకి తీసుకోవద్దన్నారు.
టియుడబ్లుజెకు ప్రశంసలు
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులనే కెసిఆర్ మొదట మోసం చేశాడని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఉత్తమ్ అన్నారు. జర్నలిస్టులు, పత్రికా స్వేచ్ఛ కు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(టియుడబ్లుజె) పోరాడిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ యూనియన్‌కు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.జర్నలిస్టుల గృహవసతికి, సుప్రీం కోర్టు తీర్పునకు సంబంధమే లేదన్నారు. ప్రగతిభవన్‌లోని 9 ఎకరాలు స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయిస్తే తాము సంతోషించే వారిమని చెప్పా రు. తాము మండలస్థాయి విలేకర్ల నుంచి రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల వరకు 18వేల మందికి గృహవసతికల్పిస్తామని,విద్య, వైద్యసౌకర్యాన్ని కల్పిస్తామని హామీనిచ్చారు.
మిషన్ భగీరథలో కెసిఆర్, కెటిఆర్‌లకు కమీషన్ 6%
RELATED ARTICLES