కూలుతున్న చరిత్ర

వ్యక్తిగత ఘనత కోసం 132 ఏళ్ల ఘన చరిత్రకు మాయని మచ్చ
ప్రజాపక్షం/హైదరాబాద్‌  పాత సచివాలయ కూల్చివేతల పర్వం ఆరంభమైంది. సోమవారం అర్ధరాత్రి నుండే ఆగమేఘాల మీద కూల్చివేతల పనులను ప్రారంభించారు. పాత సచివాలయాన్ని కూల్చివేసి అదే స్థలంలో ఆధునిక హంగులతో నూతన సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. నూతన సచివాలయ పనులకు సుమారు ఏడాది కింద భూమి పూజ చేశారు. కాగా దీనిపై హైకోర్టులో కేసు విచారణలో ఉండడంతో పెండింగ్‌లో పడింది. ఇటీవల నూతన సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రభుత్వం ఇక పాత సచివాలయ కూల్చివేతలను చేపట్టింది. కూల్చివేతల్లో భాగంగా సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించా రు. పాత సచివాలయానికి వెళ్లే రోడ్లన్నీ మూసివేశారు. ఇప్పటికే సచివాలయంలోని కొన్ని భవనాలను నేలమట్టం చేశారు. మరో వైపు బిఆర్‌కెలోని తాత్కాలిక సచివాలయంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. నూతన సచివాలయాన్ని ఒక ఏడాదిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రావణమాసంలో సమీకృత కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
132 ఏళ్ల ఘన చరిత్ర
ప్రస్తుత పాత సచివాలయానికి దాదాపు 132 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నది. నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్‌ ప్యాలస్‌ పేరుతో ప్రసిద్ధి చెందింది. 25 ఎకరాల విస్తీర్ణంలో 10 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయాన్ని నిర్మించారు. 132 ఏళ్ల్ల కాలంలో అంచెలంచెలుగా 10 బ్లాకులను ప్రభుత్వాలు నిర్మించాయి. అతి పురాతనమైన ‘జి’ బ్లాక్‌ను 1888లో 6వ నిజాం నవాబు కాలంలో నిర్మించారు. 2003లో ‘డి’ బ్లాక్‌, 2012లో నార్త్‌, సౌత్‌ బ్లాక్‌లను ప్రారంభించారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ముఖ్యమంత్రులు ఇదే సచివాలయ కేంద్రంగా పాలనను కొనసాగించారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఇదే సచివాలయం తొలి పాలన కేంద్రంగా నిలిచింది. దీనికి తోడు పాత సచివాలయం కేంద్రంగానే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు పాలన కొనసాగించారు. సచివాలయంలోని ‘ఎ’ బ్లాక్‌ భవన సముదాయాన్ని 1981లో నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య, ‘సి’ బ్లాక్‌ను 1978లో నాటి సిఎం మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంతస్తులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత కాలం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ఇక్కడి నుంచే పాలన కొనసాగించారు. ఆ తర్వాత ప్రగతిభవన్‌ వేదికగా ప్రస్తుతం పాలన కొనసాగుతోంది. ‘ఎ’ బ్లాక్‌ ఫేజ్‌-2ను 1998 ఆగస్టు 10న నాటి సిఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అలాగే ‘డి’ బ్లాక్‌ను 2003లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయగా 2004లో ఈ బ్లాక్‌ను నాటి సిఎం వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఇది వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధీనంలో ఉన్న జె, ఎల్‌ బ్లాక్‌లను అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి 1990 నవంబర్‌ 12న ప్రారంభిచారు. మొత్తం సచివాలయంలోనే ‘జె’ బ్లాక్‌ అతిపెద్ద బ్లాక్‌గా ఉన్నది.
ఆధునిక హంగులతో కొత్త సచివాలయం
పాత సచివాలయం స్థానంలో ఆధునిక హంగులతో నూతన సచివాలయాన్ని నిర్మించనున్నారు. సుమారు రూ. 500కోట్ల వ్యవయంతో దాదాపు 6 లక్షల చదరపు అడుగుల్లో సమీకృత సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమావేశాల కోసం అధునాతన హాల్స్‌ను నిర్మించనుండగా, మంత్రుల పేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్‌ ఆఫీస్‌లను ఏర్పాటు చేయబోతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?