HomeNewsTelanganaకూలీలు, కార్మికులకు ప్రతినెలా పెన్షన్‌

కూలీలు, కార్మికులకు ప్రతినెలా పెన్షన్‌

రూ.10 వేలు వచ్చేలా ఇన్సూరెన్స్‌ కంపెనీలతో కలిసి కొత్త స్కీమ్‌ ప్రవేశపెట్టాలి
రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు సూచన
ల్యాండ్‌ సీలింగ్‌ చట్టానికి అర్థమే మారిపోయిందని విమర్శ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
ప్రభుత్వ ఉద్యోగి తరహా కింది స్థాయి కూలీలు, కార్మికులకు కూడా ప్రతినెలా రూ.10 నుండి రూ. 15వేల పెన్షన్‌ వచ్చేలా ఇన్సూరెన్స్‌ కంపెనీలతో కలిసి కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు సూచించారు. హైదరాబాద్‌ నగరంలో అక్రమంగా భూములను ఆక్రమించుకున్న వారిపై తగిన చర్యలు తీసుకుని, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. భూమికి సం బంధించి ల్యాండ్‌ సీలింగ్‌ చట్టానికి అర్థమే మారిపోయిందని విమర్శించారు. శాసనసభలో గురువారం జరిగిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చకు డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన సమాధానంపై కూనంనేని సాంబశివరావు పలు వివరణలు కోరారు. సంఘటిత ఉద్యోగుల తరహా ఇన్‌సెంటివ్‌, ప్రావిడెంట్‌ ఫండ్స్‌ ద్వారా విరమణ వయసు వచ్చేసరికి ప్రైవేటు కార్మికులకు ఒక ఇళ్లు, రూ.10 వేల నుండి రూ. 15 వేలు నెలకు వచ్చేలా మార్గాన్ని చూపాలని, ఉచిత విద్య, వైద్యం అందించాలని, అప్పడే బడ్జెట్‌ ఫలితాలు అందుతాయన్నారు. వ్యవసాయం చేయని, పడావు పడిన సుమారు 45 లక్షల ఎకరాలకు రైతుబంధు వృథాగా ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకునేందుకు దృష్టి పెట్టాలని, బడ్జెట్‌లో ఐదారు శాతం అంతరం ఉంటే ప్రజల కూడా నమ్ముతారని, లేదంటే ఎన్నికల ముందు పెట్టే బడ్జెట్‌గా చూస్తారన్నారు. బడ్జెట్‌ రూపకల్పనలో మార్పు రావాలని, బడ్జెట్‌ ఫలితాలు చివరి మనిషికి అందాలని సూచించారు. రాష్ట్రంలో పేదవారు ఎంత మంది ఉన్నారు?, సెంటు, గుంట భూమి, సొంత భూమి లేనివారు ఎంతమందో లెక్కలు తీయాలన్నారు. బడ్జెట్‌ స్వరూపాన్నిమార్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. క్యాపిటల్‌ ఖర్చులు పెరగడం రాష్ట్రానికి ఆరోగ్యకరమన్నారు. సంపన పన్ను విధానాన్ని పెట్టకపోతే అంతరాలు పెరుగుతాయని, ఏదో ఒక విధానంలో బాగా ఆస్తులు ఉన్నవారి పైన ప్రభుత్వానికి ఆధాయం వచ్చేలా పరిశీలించాలన్నారు.
ల్యాండ్‌ సీలింగ్‌ పదమే మారింది ఫామ్‌హౌస్‌, రియల్‌ ఎస్టేట్‌ పేరుతో రాష్ట్రంలో అనేక పట్టణాల్లో భూమికి సంబంధించిన ల్యాండ్‌ సీలింగ్‌ పదమే మారిపోయిందన్నారు. కోటీ 63 లక్షల వ్యవసాయ భూములు ఉంటే, లెక్క లేదని, కబ్జా చేసే భూముల లెక్కలు తీయాలని కోరారు. హైదరాబాద్‌ నగరంలో వేల కోట్ల విలువగల భూములను ఆక్రమించుకున్నారని, దీనిపై సీరియస్‌గా ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు. దేవాదాయ, భూదాన్‌ భూములు ఇలా భూములను కబ్జా చేశారని, ఆ భూములలో పేద వాళ్ల ఉంటే న్యాయం చేయాలని, వ్యక్తుల పేరుతో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. గతంలో పట్టణంలో రెండువేల గజాల వరకే సీలింగ్‌ ఉండేదని, రెండు పంటలు ఉండి, ఎనిమిది మాసాల నీరు అవకాశం ఉండి, పది ఎకరాల వరకు సీలింగ్‌ అని, ఒక పంట నాలుగు మాసాల వరకు 27 ఎకరాలకు వరకు, మెట్ల 53 ఎకరాలకు సీలింగ్‌ ఉన్నదని కూనంనేని వివరించారు. చిన్నప్పుడు ల్యాండ్‌ సీలింగ్‌ పరిధిలో రాకుండా ఉండేందుకు భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారని, ఒకే దగ్గర ఉంటూ భూములను వేర్వేరు పేర్లు, అలాగే ఇతరాత్ర పేర్లతో భూములు ఉండేవని, ఇప్పడు అధికారియుతంగా సొసైటీ పేరుతో ఎన్నిక ఎకరాలు పెట్టుకునే విధాన ఉన్నదని, దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సంవత్సరం సయమిద్దాం
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఒక సంవత్సరం వరకు అవకాశం ఇవ్వాలని, అప్పటి వరకు ఆరోగ్యదాయకమైన సలహాలు ఇవ్వాలని, ప్రభుత్వం నడవాలని కోరుకుందామని ప్రతిపక్ష పార్టీలకు కూనంనేని సాంబశివ రావు సూచించారు. అప్పటికీ ఒక సంవత్సరంలో ప్రభుత్వం వైఫల్యం చెందితే, ఆ అడుగుదామని సూచించారు .ఇప్పటి నుండే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అడిగితే, ఇంత తొందర ఏముందని, ఇంకా కొత్త ప్రభుత్వం సర్ధుకోలేదని ప్రజలు అనుకుంటున్నారని కూనంనేని చెప్పారు. కేంద్రానికి సంబంధించిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ను విడుదలచేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ ఫండ్స్‌ నిధులు రావడం లేదని, వీటిని వెంటనే ఉపయోగించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు.
పెన్షన్‌ స్కీమ్‌ను పరిశీలిస్తాం: భట్టి
సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రస్తావించిన కూలి, నాలి చేసుకునేవారికి కూడా ప్రతి నెలా పెన్షన్‌ వచ్చే స్కీము గురించి ఆలోచిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హామీ ఇచ్చారు. జీవితం మొత్తం కూలి, నాలి చేసి ఆధారం లేకుండా ఇబ్బందిపడే బదులు, మొదటి నుండే ప్రభుత్వం, సామాజిక బాధ్యత ఉన్నవారు. ఇన్సూరెన్స్‌ సంస్థల ద్వారా ఒక స్కీమ్‌ను ఏర్పాటు చేసే అంశంపై ఆలోచిస్తామని భట్టి సమాధానమిచ్చారు. గతంలో మహిళలకు అభయ హస్తం పేరుతో పెన్షన్‌ పథకం ఉండేదని, ఇప్పుడు సాంబశివరావు చెప్పిన సూచన ప్రకారం ఆలోచన చేస్తామని, అలాంటిది ఇప్పుడు అవసరం కూడా అని అన్నారు. హైదరబాద్‌ నగరంలో భూ కబ్జాల అంశాన్ని పేదవాడికి బడ్జెట్‌ ఫలితాలు అందాలన్న సిపిఐ వంటి ప్రగతిశీల పార్టీ ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటామని హామీనిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను కలిసి సమష్టిగా అమలు చేసేందుకు ప్రయత్నిద్దామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments