నిర్మాణంలోనే కుప్పకూలిన డబుల్ ఇండ్లు
నాణ్యతా లోపమే కారణమా?
ప్రజాపక్షం/పాల్వంచ రూరల్ : పేదలకు ఇండ్లు కట్టించాలనే ప్రభుత్వ ఆశయం కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల నిర్లక్ష్యం ఆదిలోనే హంసపాదంలా మారుతోంది. నిర్మాణంలోనే ఇండ్లు కుప్పకూలుతున్నాయి. ఇక ఇండ్లలోకి వచ్చాక కూలితే పరిస్థితి ఏమిటని పేదలు భయాందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ మండల పరిధి దంతెలబోర ఎస్సి కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి సోమవారం నాడు 3 ఇండ్లు కుప్పకూలాయి. ఎడతెరిపి లేని వర్షాలతో గోడలు పూర్తిగా నానిపోయి కుప్పకూలిపోయాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, కాం ట్రాక్టర్ల అలసత్వంతో డబుల్ బెడ్ రూం ఇండ్లు అధ్వాన్న స్థితికి చేరాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు సంవత్సరాల నుండి నిర్మాణ దశలో ఉంటున్న డబుల్ ఇండ్లలో ప్రమాణాలు తక్కువ పాటించి పూర్తిగా నాణ్యతా లోపంతో లోప భూయిష్టంగా సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు నాణ్యత లేకుండా నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్ ఇండ్లు ఇదే తరహా నాణ్యతే కొనసాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకుని డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై పర్యవేక్షించి నాణ్యమైన నిర్మాణాలు చేయాలని పేద ప్రజలు వేడుకుంటున్నారు.