నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసిన అఖిలపక్ష నేతలు
కార్మికులకు అండగా తెలంగాణ సమాజం
ప్రభుత్వం మొండిపట్టు వీడక పోతే ఉద్యమం మరింత తీవ్రం
అఖిలపక్ష నేతల హెచ్చరిక
హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికుల సమ్మెను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిరవధిక దీక్షను విరమించారు. నిమ్స్ ఆసుపత్రిలో గురువారం సాయంత్రం ఆయనకు అఖిలపక్ష నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. కూనంనేని దీక్ష ఆరవ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించసాగిం ది. ప్రభుత్వం సమ్మె పరిష్కారం దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మొండిగా వ్యవహరిస్తుండడంతో కూనంనేని దీక్షను విరమింపజేసి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించేందుకు ఆయన సేవలను తీసుకోవాలని ఆర్‌టిసి జెఎసి సకల జనుల సమరభేరి సభలో ప్రస్తావించడం, కూనంనేని దీక్షను విరమించాలని ఈ సభలో అఖిలపక్షం ఏకగ్రీవంగా తీర్మానించిన దరిమిలా ఆర్‌టిసి జెఎసి, అఖిలపక్షం, సిపిఐ రాష్ట్ర నాయకత్వం విజ్ఞప్తి మేరకు కూనంనేని దీక్షను విరమించడానికి ముం దుకు వచ్చారు. కూనంనేని దీక్ష విరమించినందుకు అఖిలపక్ష నేతలు ఆయన్ను అభినందించా రు. ఉద్యమానికి ఆయన సేవలు అవసరమని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ నేపథ్యంలో గురువారం సాయత్రం నిమ్స్ ఆసుపత్రికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి డా. నారాయణ,
రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, వినోద్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ నాయకులు డిజి నరసింహరావు, వెంకట్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి, పోటు రంగారావు, గోవర్ధన్ (సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ), విమలక్క (టిపిఎఫ్), ఎంఎల్‌సి రాములు నాయక్ , ఆర్‌టిసి జెఎసి నాయకులు బాబు, అశ్వద్ధామరెడ్డి, జాజుల శ్రీనివాస్ గౌడ్ (బిసి సంక్షేమ సంఘం), రమేష్ కుమార్ (ఎంఆర్‌పిఎస్), కృష్ణ (మాలమహానాడు), సిపిఐ నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు. పశ్య పద్మ, బాలమల్లేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సుధాకర్, విఎస్ బోస్, పుస్తకాల నర్సింగరావు, రాష్ట్ర సమితి సభ్యులు ఛాయాదేవి, హైదరాబాద్ కార్యదర్శి ఇటి నరసింహ, మేడ్చల్ కార్యదర్శి ఎల్లయ్య గౌడ్, రంగారెడ్డి కార్యదర్శి పి.జంగయ్యతో పాటు వందలాది మంది వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కూనంనేని సాంబశివరావును అభినందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడని, ఆయనకు రాజకీయ సలహాలు ఇచ్చే వారు ఆ పార్టీలో లేరన్నారు. విద్య, వైద్యం, ప్రజా రవాణాను వ్యాపార దృక్పథంతో చూడవద్దన్నారు. ఆర్‌టిసి 15 రా్రష్ట్రాల్లో నష్టాల్లో ఉందన్నారు. ఆర్‌టిసిని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఆర్‌టిసి కార్మికుల పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ప్రభు త్వం మొండిగా వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో గట్టిగా నిలబడి పోరాటాలు ముందుకు తీసుకుపోవాల్సి న అవసరం ఉందన్నారు. నారాయణ మాట్లాడుతూ ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్‌ను అభినందించారు. ఒక్క సంతకంతో 7 వేల ప్రైవేటు బస్సులు వస్తాయని కెసిఆర్ చెప్పడాన్ని తప్పుపట్టారు. ప్రైవేటు బస్సు లు వచ్చినా తెలంగాణలో తిరగలేవని, ఆ ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒక వేళ హింస జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలని, చర్చల ద్వారా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే 17 మంది చనిపోయారని ఇంకెంత మంది ప్రాణాలు తీసుకుంటారని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఎపిలో ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేశారని కెసిఆర్ జగన్‌ను చూసైనా నేర్చుకోవాలన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ కోర్టు మొట్టికాయలు వేసినా కెసిఆర్ వినడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. టిఆర్‌ఎస్ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అంతకంటే పట్టుదలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అంతిమ విజయం కార్మికులదేనన్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో ఆలోచించాలన్నారు. ఆర్‌టిసికి బోర్డు లేనప్పుడు ఎలా ప్రైవేటు పరం చేస్తారని ప్రశ్నించారు. ఎల్. రమణ మాట్లాడుతూ పేదల రవాణ సంస్థ అయిన ఆర్‌టిసిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆర్‌టిసి కార్మికులకు అఖిలపక్షం వెన్నంటు ఉందన్నారు.అశ్వథ్థామరెడ్డి మాట్లాడుతూ ప్రజారవాణాను కాపాడాలని సమ్మెకు మద్దతుగా కూనంనేని సాంబశివరావు నిరవధిక దీక్ష చేపట్టడాన్ని అభినందించారు.
కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అంతిమ విజయం మనదేనన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే కార్మికుల గుండెలు ఆగి చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని హితువు చెప్పారు. రాములు నాయక్, విమలక్క, ఆర్‌టిసి జెఎసి నాయకులు బాబు, చెరుకు సుధాకర్, తదితరులు మాట్లాడారు.
కూనంనేని దీక్ష విరమణ
RELATED ARTICLES