హైదరాబాద్ : కూకట్పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, టిడిపి సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి, శేరిలింగంపల్లి టిడిపి అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్ తదితరులతో కలిసి ఆమె మూసాపేటలోని కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సుహాసిని మహాప్రస్థానంలోని తండ్రి హరికృష్ణ సమాధి వద్ద నివాళులర్పించారు. నామినేషన్ పత్రాలను సమాధి వద్ద ఉంచి సంతకాలు చేశారు. అంతకుముందు ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద సుహాసిని నివాళులు అర్పించారు. మరోవైపు సుహాసిని సోదరులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఆమెకు మద్దతు తెలిపారు. మా సోదరికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఎపి మంత్రి నారా లోకేష్ ‘ఈరోజు ఎన్టీఆర్, హరికృష్ణల వారసురాలు నందమూరి సుహాసిని.. తాతగారి ఆశయాలతో, తండ్రి ఆకాంక్షలతో, మామయ్య చంద్రబాబు గారి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చారు. ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించి.. ఎన్టీఆర్, హరికృష్ణలకు అసలైన నివాళి అందించాలని కూకట్పల్లి వర్గ ప్రజలను కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.