ముగ్గురితోనే వేలం…
తక్కువ ధరకే టిఆర్‌ఎస్ కార్పొరేటర్‌కు
కట్టబెట్టారని ఆరోపణలు
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టేషన్ జంక్షన్లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కమర్షియల్ కాంప్లెక్స్ కేటాయింపు వివాదం సద్దుమణగడం లేదు. గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంప్లెక్స్ లీజు వ్యవహారం అక్రమ పద్ధతిలో జరిగిందని విపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తుండగా, అంతా పద్దతి ప్రకారమే జరిగిందని అధికార పార్టీ నాయకులు చెపుతూ వస్తున్నారు.నిజానికి 2018నుంచే కాంప్లెక్స్ను లీజుకు ఇచ్చేందుకు ‘కుడా’యత్నాలు జరిపింది. అయితే ప్రభుత్వ నిబంధనలు, పరిమిత కాలం లీజు కట్టుబాట్లు అడ్డంకిగా మారడంతో పలు సంస్థలు లీజు వచ్చినట్లే వచ్చి వెనకడుగు వేశాయి. ఇలా నాలుగేళ్లు సాగడంతో ఎవరూ ముందుకు రాని వైనాన్ని ‘కుడా’ పాలకవర్గం, అధికారగణం రెండూ కలిసి లీజు వ్యవహారాన్ని తమదైన పద్ధతిలో నిర్వహించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కమర్షియల్ కాంప్లెక్స్ వేలం నిర్వహణ తీరు అనుమానాస్పదంగాఉండడంతో లీజులో మతలబు ఉందనే వాదనలు సర్వ త్రా వ్యక్తమయ్యాయి. చివరకు రాజకీయ రచ్చకు దారి తీసి కొద్ది రోజులుగా ’కుడా’కాంప్లెక్స్ లీజుపై పలు రాజకీయ పక్షాలు ఆందోళనలు జరుపుతున్నాయి.గత ఆగస్టులో హనుమకొండలోని ’కుడా’కార్యాలయంలో రాత్రి 7 గంటల సమయంలో కమర్షియల్ కాంప్లెక్స్ వేలం నిర్వహణ జరిగింది. హనుమకొండ జిల్లా కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్మన్గా ఉన్న రాజీవ్గాంధీ హన్మంతు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, అధికారుల ఆధ్వర్యంలో కమర్షియల్ కాంప్లెక్స్ వేలం నిర్వహణ పదేళ్ల లీజుకు ఇచ్చేలా జరిగింది. కాంప్లెక్స్ వేలంలో పాల్గొన్నది కేవలం ముగ్గురంటే ముగ్గురే. వీరిలో జి.వీరస్వామి, ఎ.రవీందర్ కాగా, మరొకరు 7వ డివిజన్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ఉన్నారు. దీంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేవలం ముగ్గురే వేలానికి ముందుకు రావడం.. అందులో ఇద్దరు నామమాత్రంగానే వ్యవహరించడం.. చివరికి అధికార పక్ష కార్పొరేటరే కాంప్లెక్స్ను దక్కించుకోవడంతో ఇందులో ఏదో మతలబు ఉందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారనే ఆరోపణలు మరింత బలపడ్డాయి.
కారు’చౌకగా అప్పగించిన కుడా
హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నడిబొడ్డున కమర్షియల్ కాంప్లెక్స్ ఉండడంతో బిజినెస్ సెంటర్గా మారింది. ఈ నేపథ్యంలో కాంప్లెక్స్ వేలం కారు చౌకగా ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందులోనూ అధికార పార్టీ కార్పొరేటర్ కే ఎందుకు దక్కిందని ప్రశ్నిస్తున్నారు.కాంప్లెక్స్ వైశాల్యం సుమారు 50వేల ఎస్‌ఎఫ్ టీలు. ఒక్కో ఎస్‌ఎఫ్ టీకి రూ.15 చొప్పున వేలం ముగియడంతో కార్పొరేటర్ వేముల శ్రీనివ్సాకు లీజుకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. లీజు కేటాయింపు ప్రక్రియ ముగించి త్వరలో కాంప్లెక్స్ను ఆయనకు కట్టబెట్టే చర్యలు ఆరోపణలు, ఆగ్రహాలు పెల్లుబికుతున్న నేపథ్యంలోనే చక చకా సాగుతున్నాయి. హన్మకొండ నడిబొడ్డున జి ప్లస్ 3 అంతస్తుల్లో ఉన్న ఈ కాంప్లెక్స్ను షట్టర్లుగా విభిజించి అద్దెకు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
అధికార, విపక్షాల రచ్చ.. ఆందోళనలు
అధికార పక్షానికి చెందిన ‘కుడా’పాలకవర్గం.. అధికార కార్పొరేటర్కు లీజుకు ఇవ్వడంతో విపక్షాలు రంగంలోకి దిగాయి. వేలం, లీజు వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్, వామపక్షాలు, బహుజన సమాజ్ తదితర విపక్షాలు నిరసనలు, ధర్నాలు చేపట్టాయి. కొద్ది రోజులుగా ఆందోళనలు నగరంలో విరివిరిగా జరుగుతూనే ఉన్నాయి. ‘కుడా’అధికారగణంపై కూడా ఆరోపణలు పెల్లుబికుతున్నాయి.ఈ క్రమంలో ఆరోపణలు చేసి ఆందోళన నిర్వహించిన కాంగ్రెస్ యువజన నాయకుడు తోట పవన్ ను పోలీసులు అరెస్టు చేయడం పట్ల విమర్శలు వినిపించాయి. దీనిపై కాంప్లెక్స్ ను దక్కించుకున్న టిఆర్‌ఎస్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అంతా పద్ధతి ప్రకారమే జరిగిందని, ఇందులో అక్రమాలు జరుగలేదని మీడియా సమావేశంలో వివరించారు.
‘కుడా’ కాంప్లెక్స్ వివాదంపై రచ్చ
RELATED ARTICLES