ఐదో టి20లోనూ టీమిండియా గెలుపు
ఏడు పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు
సీఫెర్ట్, టేలర్ శ్రమ వృథా
5-0తో సిరీస్ భారత్ కైవసం
మౌంట్ మాంగనుయ్ : న్యూజిలాండ్ గడ్డపై 5 టీ20ల సిరీస్‌ను 5–0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ నయా చరిత్ర సృష్టించింది. మరో వైపు న్యూజిలాండ్ తొలిసారి క్లీన్ స్వీప్‌కు గురై చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆధ్యాంతం ఆసక్తిగా సాగిన ఆఖరి టీ20లో భారత్ సమష్టిగా రాణించడంతో 7 పరుగులతో గెలుపొందింది. ఇక ఎప్పటిలానే కివీస్ అలవోకగా గెలిచే మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేక ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (60 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెఎల్ రాహుల్ (45) తన ఫామ్‌ను కొనసాగించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో కుగ్లిన్ రెండు వికెట్లు తీయగా.. బెన్నెట్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓటమి పాలైంది టిమ్ సీఫెర్ట్(50), రాస్ టేలర్(52 ) అద్భుత ప్రదర్శన కనబర్చినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో బుమ్రా (3/12) మూడు వికెట్లు తీయగా.. సైనీ, ఠాకుర్ రెండేసి వికెట్ల పడగొట్టారు. ఇక సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్న కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వరించగా.. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
సీఫెర్ట్, టేలర్ విధ్వంసం..
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బుమ్రా తన తొలి ఓవర్‌లోనే గప్టిల్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు. ఆ మరుసటి ఓవర్లో మున్రోను సుందర్ బౌల్డ్ చేసి దెబ్బ కొట్టాడు. ఆ వెంటనే సైనీ వేసిన ఓవర్‌లో తొలి బంతికే టామ్ బ్రూస్.. కీపర్ రాహుల్ చాక చక్యంతో రనౌటయ్యాడు. దీంతో ఆ జట్టు 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్లిష్ట స్థితిలో ఉన్న జట్టును సీఫెర్ట్.. రాస్‌టేలర్ ఆదుకున్నారు. సీఫెర్ట్ వచ్చిరావడంతోనే ఎదురు దాడికి దిగగా.. టేలర్ కొంచెం నెమ్మదిగా ఆడాడు. ప్రతీ ఓవర్‌కు బౌండరీ సాధిస్తూ ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేసింది. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి న్యూజిలాండ్ 41/3 స్కోర్ చేసింది. అనంతరం చహల్ వీరి దాడిని అడ్డుకున్నాడు. పరుగులు చేయకుండా కట్టడి చేశాడు. అయినా శివమ్ దూబే వేసిన 10వ ఓవర్లో సీఫెర్ట్, రాస్ టేలర్ విధ్వంసం సృష్టించారు. తొలి రెండు బంతులను భారీ సిక్స్‌లుగా మలిచిన సీఫెర్ట్ అనంతరం సింగిల్ తీశాడు. ఇక శివమ్ దూబే నోబాల్ వేయగా టేలర్ బౌండరీ కొట్టాడు. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. ఆ మరుసటి బంతులను కూడా టేలర్ రెండు భారీ సిక్స్‌లు కొట్టడంతో న్యూజిలాండ్‌కు మొత్తం ఈ ఓవర్లోనే 34 పరుగులు వచ్చాయి. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న రెండో బౌలర్‌గా శివమ్ దూబే చెత్తరికార్డును మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్‌లో ఓ ఫోర్ కొట్టిన సీఫెర్ట్.. సైనీ వేసిన 13 ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ మరుసటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్సన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రాహుల్ ఫుల్ జోష్..
ఈ ఏడాది ఫుల్ స్వింగ్‌లో ఉన్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న రాహుల్(45).. ఒక ద్వైపాక్షిక అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలా్‌ండ ఓపెనర్ కొలిన్ మున్రో పేరిట ఉండగా రాహుల్ అధిగమించాడు. 2017-18 వెస్టిండీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కొలిన్ మున్రో 223 పరుగులు చేసి ఈ ఘనతనుందుకోగా.. తాజాగా రాహుల్ 224 పరుగులతో అధిగమించాడు. ఇక రాహుల్ ఈ సిరీస్‌లో 45, 39, 27, 57, 56తో రాణించాడు. ఇక భారత్ తరుఫున విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును కూడా రాహుల్ అధిగమించాడు. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో కోహ్లి 199 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పగా.. తాజాగా రాహుల్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో భారత్ తరఫున తొలి నాలుగు స్థానాల్లో రాహుల్, కోహ్లిలే ఉండటం విశేషం. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో కోహ్లీ 183 పరుగులు చేయగా.. అదే సిరీస్‌లో రాహుల్ 164 రన్స్ చేశాడు. ఇక 2017లో శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్ శర్మ 162 పరుగులు చేసి వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు.
సంజూ కళ్లుచెదిరే క్యాచ్..
ఈ మ్యాచ్‌లో భారత్ యువ క్రికెటర్ సంజూశాంసన్ అద్భుత ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనా.. మైమరపించే ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా శార్థుల్ ఠాకుర్ వేసిన 8వ ఓవర్ చివరి బంతిని రాస్ టేలర్ స్వీప్ చేస్తూ మి్‌డ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ షాట్ దాదాపు సిక్స్ అని అందరూ భావించారు. కానీ అక్కడే బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సంజూ.. సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతినందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన అతను బౌండరీ లైన్ బయట పడుతున్నానని గమనించి తన కాళ్ల సందులో నుంచి బంతి మైదానంలోకి విసిరేసాడు. దీంతో సిక్సర్ కాస్త రెండు పరుగులుగానే మారింది. ఇక శాంసన్ బంతి మైదానంలోకి విసిరినా ఫోరైనా కావచ్చని అందరూ భావించారు. కానీ రిప్లేలో చూసే సరికి శాంసన్ అద్భుత ఫీల్డింగ్ సంభ్రమాశ్చర్యానికి గురించేసింది. ఈ అద్భుత ఫీల్డింగ్‌కు మైదానమంతా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సహచర ఆటగాళ్ల అయితే శాంసన్ ఎఫర్ట్‌ను ప్రశంసిస్తూ చప్పట్లు కొట్టారు. ఇక కామెంటేటర్లు అయితే వాటే ఫీల్డింగ్ అంటూ.. స్టేడియం దద్దరిల్లేలా అరుస్తూ కేరళ బ్యాట్స్‌మన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. శాంసన్ ఫీల్డింగ్‌కు ముగ్దులైన అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అతని ఎఫర్ట్‌ను కొనియాడుతూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
శివం దూబే చెత్త రికార్డు
భారత యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబె తాను కోరుకోని ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా అవతరించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి పోరులో అతడు ఏకంగా 34 పరుగులు ఇచ్చాడు. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (36) తర్వాత స్థానంలో నిలిచాడు. టిమ్ సీఫెర్ట్, రాస్ టేలర్ కలిసి అతడి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. ఆఖరి టీ20లో శివమ్ దూబె పదో ఓవర్ విసిరాడు. తొలి బంతిని సీఫెర్ట్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. నెమ్మదిగా వేసిన రెండో బంతికీ అదే శిక్ష విధించాడు. ఇన్‌సైడ్ ఎడ్జ్ అయిన మూడో బంతి కీపర్ మీదుగా బౌండరీకి చేరింది. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. రాస్‌టేలర్ స్ట్రైక్ తీసుకున్నాడు. ఐదో బంతి నోబాల్. టేలర్ దానిని బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత వచ్చిన ఫ్రీహిట్‌ను బలంగా బాది సిక్సర్‌గా మలిచాడు. ఆఖరి బంతినీ డీప్ స్క్వేర్ మీదుగా స్టేడియం దాటించాడు. దీంతో ప్రత్యర్థికి జట్టుకు 34 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత శివమ్ చేతికి రాహుల్ బంతి ఇవ్వలేదు. ఒక ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్లు. 36 – స్టువర్ట్ బ్రాడ్ (2007 దర్బన్‌లో భారత్‌తో); 34 – శివమ్ దూబె (2020 మౌంట్ మాంగనూయ్‌లో న్యూజిలాండ్‌తో); 32 – వేన్ పర్నెల్ (2012 ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో); 32 – ఇజతుల్లా దౌలత్‌జాయ్ (2012 కొలంబోలో ఇంగ్లాండ్‌తో); 32 – స్టువర్ట్ బిన్నీ (2016 లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌తో); 32 – మాక్స్ ఓడౌడ్ (2019 డబ్లిన్‌లో స్కాట్లాండ్‌తో).
కివీస్ వైట్‌వాష్
RELATED ARTICLES