వందలాది ఎకరాల్లో పంటనష్టం
అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు
ప్రతీ కుటుంబాన్ని, రైతులనూ ఆదుకుంటాం
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ముంపు బాధితులకు పరామర్శ
ప్రజాపక్షం/భద్రాచలం
కిన్నెరసాని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహించడంతోనే వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయని,అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కూడా అధికారులతో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని హమాలీ కాలనీ, ఇందిరానగర్, తదితర లోతట్టు ప్రాంతాలు, మండల పరిధిలోని బసవతారక కాలనీ, సోములగూడెం, రంగాపురం, నాగారం కాలనీ, నాగారం గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అధికార యంత్రాంగం అంతా తక్షణమే నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందించాలని ఆదేశించారు. రోడ్లు, విద్యుత్ లైన్సు తక్షణమే పునరుద్దరించాలని అన్నారు. ముందస్తు సమాచారం అందించినప్పటికీ సందర్శనకు గైర్హాజరైన వివిధ శాఖల అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముంపు ప రిస్థితులను గుణపాఠంగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇలాంటి నష్టం వాటిల్లకుండా, ప్రజలు ఇబ్బందుల పాలు కాకుండా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ఆదుకుంటామని, ఇళ్లు దెబ్బతిన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు కృషి చేస్తామని, ఇసుక మేటలు వేసిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఈ పర్యటనలో ఆయన వెంట వివిధ శాఖల అధికారులతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా,రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాధం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణ చంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు, ఉప్పుశెట్టి రాహుల్, నాగరాజు, సుధాకర్, గంగాధర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, వెంకన్న, గిరి, రహిమాన్, శ్రీను, విజయ్, హరి, మోహన్ రావు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.