ఒక ఔరంగజేబు వస్తే ఒక శివాజీ కూడా వస్తాడు!
కాశీవిశ్వేశ్వర ధామ్ ప్రారంభోత్సవ సభలో మోడీ
వారణాసి: హిందువులకు పవిత్రమైన వారణాసి పుణ్యక్షేత్రంలో రూ.800 కోట్లతో నిర్మించిన ‘కాశీ విశ్వనాథ్ ధామ్’ ప్రాజెక్టుక ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం మధ్యా హ్నం ప్రారంభోత్సవం చేసి జాతికి అం కితం చేశారు. కాశీ క్షేత్ర చరిత్రలో దీన్ని ఒక సరికొత్త అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. సుల్తానులు వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు,కానీ వారణాసి మాత్రం యథాతథంగా చెక్కుచెదరకుండా పలు పేర్లు తో మిగిలి ఉంది అన్నారు. చరిత్రలో వారణాసి సంస్కృతిని ధ్వంసం చేసిన దండయాత్రలను ఆయన ఉటంకిస్తూ, ఇక ఎవరు దండయాత్ర చేసినా వారణాసి ఆ దాడుల్ని తట్టుకుని నిలబడగలదన్నారు. “వారణాసి నగరానికి ఎన్నో విభిన్నమైన పేర్లు ఉన్నాయి, కాశీ కూడా అందులో ఒక పేరు, ప్రజాపీడకులు ఈ నగరంమీద దాడి చేశారు, ధ్వంసం చేయాలని ప్రయత్నించారు, చరిత్ర దీనికి సాక్ష్యం, ఔరంగజేబు చేసిన ఎన్నో అక్రమాలు అతడు సృష్టించిన ఉగ్రవాదం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం, తన కరవాలంతో వారణాసి నగర చరిత్రను, ఇక్కడి నాగరికతను మార్చివేయాలని అతడు ప్రయత్నించాడు, అక్కడి సంస్కృతిని, వారసతాన్ని తన మతమౌఢ్యంతో ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. కానీ ఈ మాతృభూమిలోని మట్టి మిగతా ప్రపంచం కంటే చాలా విభిన్నమైనది, ఇక్కడికి ఒక ఔరంగజేబు వస్తే, ఒక శివాజీ కూడా తలఎత్తి నిలబడతాడు” అని ప్రధానమంత్రి చెబుతూ, వేదికపై “హర హర మహాదేవ..” అని గొంతెత్తి నినదించారు. ఆయన ఆ విధంగా ‘హర హర మహాదేవ…’ అని అనేకసార్లు ఉచ్ఛరించారు. బౌద్ధ, సిక్కు, ఇతర మత పవిత్ర ప్రదేశాల్లో కూడా ఇలాంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాశీ విశ్వేశ్వర ధామ్ కారిడార్ కేవలం ఒక నూతన నిర్మాణం మాత్రమే కాదు, ఇది సనాతన సంస్కృతికి చిహ్నం అని ఆయన అన్నారు.
పురాతనకాలంనాటి వారణాసి ఆలయ సముదాయాన్ని కాశీ విశ్వనాథ్ ధామ్ పేరిట విస్తరించి, పాత ఆలయాలను పునరుద్ధరించి, నవీనీకరణ చేశారు. ఆధునిక రూపం ఇచ్చి సరికొత్త హంగులతో తీర్చి దిద్దారు. ఈ కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టులో మరో 24 నూతన భవనాలు నిర్మించారు. గంగా నది అవతల నుండి ఆలయంలోకి నేరుగా నడచి వెళ్ళేందుకు ఇక్కడ సరికొత్త ఏర్పాటు చేశారు. ఇందులో రెండు మ్యూజియంలు, గ్రీనరీ, షాపింగ్ కాంప్లెక్సులు, యాత్రికులకు సరికొత్త ఏర్పాట్లు ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. వారణాసి క్షేత్రంలో సరికొత్త చరిత్ర సృష్టించామని ఆయన అన్నారు. వారణాసి ప్రధానమంత్రి లోక్‌సభ నియోజకవర్గం కూడా కావడంతో ఆయన దీనికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019 మార్చి నెలలో ప్రధానమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును స్వీకరించి యుద్ధ ప్రాతిపదికపై ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందు ప్రారంభోత్సవం చేయాలని ఆదేశించడంతో ఆగమేఘాలపై ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్ళ ఎనిమిది నెలల కాలంలో పూర్తి చేశారు. 95 శాతం పనులు పూర్తి కావడంతో ఈ ప్రాజెక్టును కొత్త సంవత్సరంలోకి ప్రవేశించకముందుగానే ప్రారంభోత్సవం చేయాలని సంకల్పించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకోసం రూ.750 కోట్లకుపైగా కేటాయించారు. 300 భవనాలను కొనుగోలుచేసి, వాటిని ధ్వంసం చేసి, గ్రీనరీ సృష్టించారు. సరికొత్త భవనాలు నిర్మించారు. సుందరంగా తీర్చి దిద్దారు. ఈ సందర్భంగా వారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. వారికి పునరావాసం కల్పించారు. ఇక్కడ ఇంటి యజమానులతోపాటు మరో 1400 మంది దుకాణాల యజమానుల స్థలాలను కూడా తీసుకుని వారికి పునరావాసం కల్పించారు. గతంలో ఈ ఆలయ ప్రాంగణం 3000 చదరపు అడుగులు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు నవీనీకరణతో ఇది ఐదు లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. ఇప్పుడు ఒకేసారి ఈ ఆలయం ప్రాంగణంలోకి 75 వేలమంది భక్తులు రావడానికి వీలు కలుగుతుంది.
ఈ ధామ్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, భారతదేశ నాగరికతా వారసత్వ సంపదతో పరిఢవిల్లుతున్న వారణాసి ప్రశస్తిని ఆయన గుర్తు చేసుకున్నారు. చరిత్రలో ఔరంగజేబు వంటి ప్రజాపీడకులు కాశీక్షేక్ష వైభవాన్ని ధ్వంసం చేసినప్పటికీ, వారు చరిత్ర పుటల్లో చీకటిగర్భంలో కలిసిపోయారని, కానీ కాశీక్షేత్ర కీర్తి ప్రతిష్టలు, యశస్సు ఈ పురాతన నగరంలో సరికొత్త అధ్యాయంతో పునర్లిఖించుకుందని ఆయన ప్రశంసించారు. కాశీక్షేత్రంలో మరణం కూడా పుణ్యకార్యమేనని, ఇక్కడ మరణం అత్యంత మంగళప్రదమని, స్వర్గప్రాప్తికి, వైకుంఠప్రాప్తికి మార్గమన్నారు. భారతదేశం ఇప్పుడు శతాబ్దాల కాలంనాటి బానిసత్వం నుండి, ఆత్మన్యూనతాభావం నుండి బయటపడిందని, ఆ ప్రభావంలోంచి బయటపడి ముందుకు అడుగులు వేసిందని అన్నారు. ఒక గొప్ప ప్రాజెక్టుగా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్టు భారతదేశానికి ఒక నిర్ణయాత్మకమైన సరికొత్త కారిడార్‌గా భాసిల్లుతుందన్నారు. వారణాసిలో ఇప్పుడు సరికొత్త చరిత్రను లిఖించాం, ఒకవేళ ఇప్పుడు ఒక ఔరంగజేబు వస్తే, మరో శివాజీ కూడా ఇక్కడ శిరమెత్తి నిలబడతాడు, ఒకవేళ ఇక్కడ ఒక సలార్ మసూద్ వచ్చినాగానీ, ముస్లిము దండయాత్ర చేసినాగానీ, కవాతులు చేసినాగానీ, ఆనాటి మహనీయుడు రాజీ సుహేల్‌దేవ్ మళ్ళీ ఇక్కడ తన బాధ్యతలు తీసుకుంటాడు అని మోడీ అన్నారు.వారణాసి చరిత్రను ఆయన సుదీర్ఘంగా తన ప్రసంగంలో ఉటంకించారు. కాశీపుర వారసత్వ ఔన్నత్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. మొఘలు వంశీకుడైన ఔరంగజేబు చక్రవర్తి, ముస్లిము దండయాత్రికుడు సలార్ మసూద్, బ్రిటిష్ గవర్నర్ ంవ్ల వారన్ హేస్టింగ్స్ వంటివారు వచ్చి దాడులు చేసినాగానీ వారణాసీ క్షేత్రం వాటిని తట్టుకుని నిలబడుతుందని ఆయన అన్నారు.
ప్రధాని రెండు రోజుల వారణాసి పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్మికులు, ఇంజనీర్లును వరుసగా కూర్చోబెట్టి ప్రధానమంత్రి వారికి సోమవారం పుష్పాభిషేకం చేశారు. వారిమధ్యలో కూర్చుని గ్రూప్ ఫొటో తీయించుకున్నారు. ఇలా ఒక పెద్ద ప్రాజెక్టును నిర్మించిన కార్మికులు, ముఖ్యులను కూర్చోబెట్టి వారిపై పుష్పాభిషేకం చేయడం అక్కడి స్థానికులను ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ప్రభృతులు పాల్గొన్నారు. తొలుత ప్రధానమంత్రి వారణాసిలో దిగగానే కాళభైరవ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. లలితాఘాట్‌లో సూరుఓ్యడికి పుష్పార్చన చేశారు. సాయంత్రం ప్రతిష్టాత్మకమైన గంగాహారతిని ఆయన తిలకించారు. గంగానదికి పూజలు చేశారు.
కాశీ క్షేత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం
RELATED ARTICLES