బస్సుజాతాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మరో ఉద్యమానికి నాంది పలకాలని పిలుపు
ప్రజాపక్షం / తొర్రూరు రూరల్ / జనగామ బ్యూరో
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజారంజక పరిపాలన కోసం నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో మరో ఉద్యమానికి నాంది పలకాల్సిన అవసరం ఉందన్నారు. నాడు కమ్యూనిస్టులు ఏకమై సమాజాన్ని చైతన్యపరిచి రజాకార్లను తరిమికొట్టారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల బస్సుజాతాలో భాగం గా మంగళవారం తొర్రూరులోని స్థానిక లయన్స్ క్లబ్ భవనం నుండి జాతా బయలుదేరి కంటాయపాలెం రోడ్డు మీదుగా భారీ ర్యాలీ మన్నూరి వెంకటయ్య స్తూపం వరకు కొనసాగింది. అమరవీరుల స్థూపానికి నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తొర్రూరు స్థానిక బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, పాలకుర్తి ప్రాంతంలో చాకలి అయిలమ్మ దేశ్‌ముఖ్‌లను ఎదురించి పోరాడారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని నీళ్ళు, నిధులు, నియామకాలు కావాలనే లక్ష్యంతో తెలంగాణలోని సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ ఇక్కడి ప్రజల బతుకులు మారలేదన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలన నిజాం పాలనను గుర్తుకు తెస్తున్నదన్నారు. ఎన్నికల హామీలను విస్మరించి సొంత ఎజెండాను అనుసరిస్తున్నదన్నారు. ఎన్నికల హామీలైన డబుల్ బెడ్ రూం ఇళ్ళు, దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ పథకాల ఊసెత్తడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరించిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందన్నారు. చివరకు దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేసేందుకు వ్యవసాయ నల్ల చట్టాలను చేసిందని, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చట్టాలను కుదించిందని చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో కలసి ఉద్యమిస్తామన్నారు.
పోరాట యోధుల కుటుంబాలకు ఘన సన్మానం
సిపిఐ బస్సు జాతాకు తొర్రూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. అనంతరం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల స్తూపం వద్ద నేతలు నివాళులు అర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అమరులైన 15 కుటుంబాలను చాడ వెంకట్ఱెడ్డితో పాటు నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి.విజయసారధి, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు వోమ బిక్షపతి, మండల కార్యదర్శి గట్టు శ్రీమన్నారాయణ, ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బందు మహేందర్, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు పల్లె నర్సింహ, ఉప్పలయ్య, అమ్మాపురం సిపిఐ గ్రామకార్యదర్శి బూరుగు యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గణపురం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సిపిఐ బస్సు యాత్ర మంగళవారం జనగామ జిల్లాలో జరిగింది. తొలుత సిపిఐ నాయకులు జిల్లాలోని పాలకుర్తిలో చాకలి ఐలమ్మ విగ్రహానికి, అనంతరం దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో షేక్ బందగి స్థూపం వద్ద, జిల్లా కేంద్రంలోని నల్లా నర్సింహులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు సిపిఐ జనగామ జిల్లా కార్యదర్శి, మాజీ ఎంఎల్ఎ సిహెచ్.రాజారెడ్డి అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. చరిత్రలో పోరాటం చేసిన వారి పాత్ర మరువలేనిదని, వారి త్యాగాలు, రక్తతర్పణాలు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాయని ఆయన అన్నారు. చాకలి ఐలమ్మ, షేక్‌బందగి, నల్లా నర్సింహులు లాంటి వీరుల పోరాటం నేటి యువతకు ఆదర్శ ప్రాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్యమండలి నాయకులు పల్లె నర్సింహా బృందం ఆలాపించిన గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆది సాయన్న, మంగళపల్లి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్‌శక్తులకు దేశ సంపద ధారాదత్తం
RELATED ARTICLES