ప్రజాపక్షం/హైదరాబాద్ : హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పరిధిలోని వినాయకనగర్‌లో వలసకూలీల దైనందిన పరిస్థితిని సిపిఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇరువురు నేతలు మంగళవారంనాడు వినాయక్‌నగర్‌లో పర్యటించారు. వారి వెంట సిపిఐ నగర కార్యదర్శి ఈటి నర్శింహ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వలస కూలీలు గడిచిన పదేళ్లుగా ఇక్కడే దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అలాగే తెలంగాణకు చెందిన మహబూబ్‌నగర్ తదితర జిల్లాల కూలీలు ఈ ప్రాంతంలో తారసపడ్డారు. ఈ వలస కూలీల్లో కొంతమందికి తెల్ల రేషను కార్డులున్నాయి. చాలామంది ఏడేళ్లుగా ఇక్కడ వుంటున్నా వారికి ఎలాంటి రేషన్ కార్డు లేదు. ఫిలింనగర్లో జిహెచ్ఎంసి వాళ్లు 5 రూపాయల భోజనం పెడుతున్నారు. కానీ మురికివాడల్లో వుంటున్న వారికి ఎలాంటి భోజనం పెట్టడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల లాక్డౌన్ ప్రకటించడంతో గత 12 రోజులుగా వారికి ఎలాంటి పని దొరక్క అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, నగదు ఇంకా వారికి అందలేదు. మంచినీటి సరఫరా కూడా ఈ ప్రాంతాలకు చేయాలని, అలాగే కార్డుల్లేని వారికి కూడా రేషను, నగదు పంపిణీ చేయాలని చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. స్వస్థలాలకు పోదామని అనుకున్నా, లాక్డౌన్ కారణంగా వారు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండూ సానుకూలంగా స్పందించి, ఈ వలసకూలీలకు సాయం చేయాలని వారు కోరారు.
కార్డులతో పనిలేకుండా వలస కూలీలకు సాయమందించండి
RELATED ARTICLES