రద్దు చేయాలని రైతు కుటుంబాలు భారీ ర్యాలీ : కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
రైతు రాములు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే: ప్రతిపక్షాల విమర్శ
మాస్టర్ ప్లాన్‌కు నిరసనగా ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా
ప్రజాపక్షం/కామారెడ్డి ప్రతినిధి కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు గురువారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్‌లో భూమి పోతుందని ఆవేదనతో బుధవారం యువ రైతు రాములు ఆత్మహత్య చేసుకోగా, ప్రభుత్వ వైఖరికి నిరసనగా కామారెడ్డి మున్సిపాలిటీ తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్‌తో భూములు నష్టపోయిన రైతుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భూములు కోల్పోతున్న లింగాపూర్, ఇల్చిపూర్, అడ్లూర్, టేకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామాల నుండి రైతు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతులు ట్రాక్టర్లలో జిల్లాకేంద్రానికి రావడంతో కామారెడ్డి పట్టణం రైతుల నినాదాలతో మార్మోగింది. కామారెడ్డి మున్సిపల్ కొత్తగా మాస్టర్‌ప్లాన్‌లో రైతుల వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్‌గా 100 అడుగుల రోడ్డు ప్రకటించడం పట్ల వారు తీవ్రంగా నిరసన తెలిపారు. తొలుత చర్చి గ్రౌండ్ నుంచి భూ బాధితుల ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చిన రైతులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా వారిని నివారించేందుకు పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులు బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ ర్యాలీకి దుబ్బాక ఎంఎల్ఎ రఘునందన్‌రావు, ఎల్లారెడ్డి మాజీ ఎంఎల్ఎ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సుభాష్‌రెడ్డి, వివిధ రైతు సంఘాల నాయకులు మద్దతు పలికి రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసనలో పాల్గొన్నారు.
పోలీసులపై రైతుల ఆగ్రహం
కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించిన రైతులకు నచ్చజెప్పేందుకు వచ్చిన డిఎస్పి సోమనాథంపై రైతులు ఒక్కసారిగా మండిపడ్డారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రైతులకు తెలియకుండా మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేసిన డిఎస్పితో మాట్లాడడానికి వీల్లేదని రైతులు వాగ్వివాదానికి దిగారు. డిఎస్పి గోబ్యాక్ అంటూ రైతులు నినాదాలు చేశారు. అనంతరం అడిషనల్ ఎస్పి అన్యోన్య వచ్చి నలుగురు మాత్రమే లోపలికి వచ్చి వినతిపత్రం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు తమ ఇష్టారీతిన మాస్టర్‌ప్లాన్ రూపొందించి రైతుల జీవితాలను పొట్టనపెట్టుకుంటున్నారని, ఆత్మహత్య చేసుకున్న రాములుది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అన్నారు. పేద ప్రజల భూములను లాక్కొని ధనవంతులు, రాజకీయ పార్టీల నాయకులు తమ భూములకు ధరలు ఎక్కువ పొందడం కోసమే మాస్టర్‌ప్లాన్ రూపొందించారని, దీనిని తక్షణమే రద్దు చేయాలన్నారు.
గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా
యువ రైతు రాములు మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. ఉపసర్పంచు లక్ష్మీపతి, వార్డు సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, నర్సింలు, అనూష, స్వప్న, సుశీల, రోజాతో పాటు సొసైటీ డైరెక్టర్ భాస్కర్, గ్రామాభివృద్ది కమిటీకి చెందిన 6 గురు సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఉప సర్పంచ్ లక్ష్మీపతి మాట్లాడుతూ రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్ నుండి తొలగించి మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేయకుంటే ఉద్యమం ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై ముదురుతున్న వివాదం
RELATED ARTICLES