కాంగ్రెస్‌ పీపుల్స్‌ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్ : సబ్బండ వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను తయారు చేసింది. పేద, మధ్య తరగతి, రైతులు, సంక్షేమం, అభివృద్ధి సమతూకంతో రూపొందించింది. టిపిసిసి రూపొందించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక – పీపుల్స్‌ మేనిఫెస్టోను మంగళవారం నాడు టిపిసిసి అధ్యక్షులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఆర్‌.సి. కుం టియా, కేంద్ర మాజీమంత్రి జైరామ్‌ రమేశ్‌, మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌, తదితరులు విడుదల చేశారు. ఇందు లో 112 పేజీల్లో 35 అంశాల కింద ఎన్నికల హామీలను వివరించారు. వ్యవసాయశాఖను “రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి” శాఖగా మారుస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పేర్కొం ది. పేద మధ్యతరగతిని ఆకర్షించేలా సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఎస్‌సి, ఎస్‌టిలకు రూ. 1 లక్ష అదనం, సబ్సి డీ ధరకు ఇందిరమ్మ సిమెంట్‌ సప్లు స్కీమ్‌ను ప్రకటించారు. ఇక ఎస్‌సి, ఎస్‌టిలో కులాల మధ్య ఘర్షణల నేపథ్యంలో, అందరికీ నిధు లు సమపాళ్లలో అందేలా రెండు కార్పొరేషన్‌లను మూడు, మూడుగా విభజించారు. ఎస్‌సిల్లో మాదిగలకు, మాలలకు, ఇతర ఉపకూలాలకు ప్రత్యేక కార్పొరేషన్‌లు, ఎస్‌టిల్లో లంబాడా, కోయగోండ్లు, ఇతర కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. బిసి విభాగాన్ని కూడా బిసి, ఎం బిసి, సంచార బిపి వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లను విడివిడిగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
మేనిఫెస్టో అమలుపై ఏటా వార్షిక నివేదిక : ఉత్తమ్‌
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తమ మేనిఫెస్టో అమలుపై ప్రతి ఏటా ప్రజలకు వార్షిక నివేదిక ఇస్తామని టిపిసిసి అధ్యక్షులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. జిల్లా స్థాయిలో పౌర కమిటీని ఏర్పాటు చేసి సోషల్‌ ఆడిట్‌ చేయిస్తామన్నారు. మేనిఫెస్టో విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహా, కో-చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కన్వీనర్‌లు మహేశ్‌కుమార్‌గౌడ్‌, దాసోజు శ్రవణ్‌, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక రాజకీయ పార్టీ ఇంత సమగ్రంగా, బాగా మేనిఫెస్టోను రూపొందించడం అరుదు అని పేర్కొన్నారు. మరికొన్ని హామీలకు సంబంధించి త్వరలోనే సప్లిమెంటరీ మేనిఫెస్టోను తీసుకువస్తామని చెప్పారు. అందులో డబుల్‌ బెడ్‌రూమ్‌ దరఖాస్తుదారులందరికీ ఒకేసారి రూ.50 వేలు చెల్లించి, ఏడాదిలో ఇళ్ళు కట్టించే ‘ఇంటి వెలుగు’ పథకం, ఇతర హామీలు ఉంటాయన్నారు. మేనిఫెస్టో అమలుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. కెసిఆర్‌ లాగా తాము ఉత్తిగనే తెలంగాణ ప్రజలతో పరాచకాలు ఆడమని, మేము పెన్షన్‌ రూ.2000 అంటే ఆయన రూ.2016 అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. స్వంత స్థలం ఉన్న అర్హులకు ఇళ్ళ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని, ఎస్‌సి , ఎస్‌టిలకు అదనంగా రూలక్ష. ఇస్తామన్నారు. ఇంటి స్థలం లేనివారికి ప్రభుత్వమే స్థలం కొనిచ్చి ఇళ్లు కట్టిస్తుందన్నారు. ఇది యావత్తు భారతదేశంలోనే అద్భుతమైన మేనిఫెస్టో అని కుంటియా అన్నారు. విద్యా రంగానికి బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయిస్తామన్నారని, అలాగే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమావేతనం ఇస్తామని ప్రకటించడం అద్భుతమని కొనియాడారు. కాంగ్రెస్‌ గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్‌ పెంపును ప్రకటిస్తే, సిఎం కెసిఆర్‌ వేలం పాటలాగా రూ.16 కలిపి ఇస్తామనడం పెద్ద జోక్‌ అని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ళ పదవీ కాలంలో ఆయన కనీసం మొత్తం 1200 మంది అమరుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేయని వ్యక్తి తాము ప్రకటించిన తరువాత నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించడం అసమర్ధతకు నిదర్శనమన్నారు. అంతముందుకు దాసోజు శ్రవణ్‌ మేనిఫెస్టోలని ముఖ్యాంశాలను వివరించారు. మేనిఫెస్టోను టిఆర్‌ఎస్‌లా కాకుండా బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలా భావించి అమలు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న కారణంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహా మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి రాలేకపోయారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఉత్తమ్‌ తెలిపారు.

* సిఎంఒలో పీపుల్స్‌ గ్రీవెన్స్‌ సెల్‌
* లోకాయుక్త పరిధిలోకి సిఎం, మంత్రులు
*రాష్ట్ర గీతంగా అందెశ్రీ ‘జయ జయహే తెలంగాణ’
* వాహనాలకు టిఎస్‌ బదులు టిజి
* కాంట్రాక్టుల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యం, నిరుద్యోగులకు రూ.3వేల భృతి
* ఆడపిల్ల పెళ్ళికి రూ.1,50,116
* 58 ఏళ్ళకే రూ.2వేల వృద్ధాప్యపు పెన్షన్‌, 70 ఏళ్ళు దాటితే రూ.3వేలు
* వికలాంగులు, ట్రాన్స్‌జెండర్‌లు రూ.3వేల పెన్షన్‌
* కౌలు రైతులు, రైతు కూలీలకు కూడా రైతుబంధు
* కార్పొరేట్‌ విద్యాసంస్థలపై విజిలెన్స్‌ కమిటీలు
* ఆరోగ్యశ్రీ కింద అన్ని వ్యాధులకు రూ.5లక్షలు
* లంబాడ, గోండ్లు, మాదిగ, మాలలకు ప్రత్యేక కార్పొరేషన్‌లు
* మైనారిటీ, బిసిలకు సబ్‌ప్లాన్‌
* నిరుపేద రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, వెలమలకు ప్రత్యేక కార్పొరేషన్‌లు
* సిపిఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ
* మహిళాసంఘాలకు రూ.50వేలరుణం రద్దు, రూ.వెయ్యితో అభయహస్తం పెన్షన్‌
* మండలానికి 30 పడకలు, నియోజకవర్గానికి వందపడకల దవాఖానాలు
* న్యాయవాదులకు రూ.300 కోట్లు, జర్నలిస్టులకు రూ.200 కోట్ల నిధి
* గల్ఫ్‌ బాధితులకు ఏటా రూ. 500 కోట్ల నిధి
* అంబేడ్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టుకు తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ
* సింగరేణిలో కొత్త మైన్‌లు
* స్థానికసంస్థలకు అధికారాల బదలాయింపు
* అన్ని మతాల చిన్న ప్రార్థనా మందిరాలకు ఉచిత విద్యుత్‌
* పోలీసులకు వారాంతపుసెలవులు,గ్రామాల వరకు షీ-టీమ్స్‌
* ఇందిరమ్మ సిమెంట్‌ స్కీమ్‌ కింద సబ్సిడీ సిమెంటు

DO YOU LIKE THIS ARTICLE?