HomeNewsBreaking Newsకలిసికట్టుగా సమావేశాలు

కలిసికట్టుగా సమావేశాలు

కౌలు తగ్గించాల్సిందేనని మూకుమ్మడి తీర్మానాలు
ప్రజాపక్షం/ సూర్యాపే

ఎట్టకేలకు కౌలు రైతులు కళ్లు తెరిచారు. నష్టాటల ఊబి నుండి గట్టెక్కేందుకు కదం తొక్కుతున్నారు. గ్రామాల్లోని కౌలు రైతులందరూ మునుపు ఎన్నడూ లేని విధంగా కలిసి కట్టుగా పార్టీలకు అతీతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కమిటీలను ఎన్నుకుంటున్నారు. భూములు ఉన్న రైతులు కౌలు తగ్గించాల్సిందేనంటూ మూకుమ్మడిగా తీర్మానాలు చేస్తున్నా రు. వారికి వారే అగ్రిమెంట్లు రాసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిని ధిక్కరిస్తే రూ. 50వేలు జరిమానా అంటూ అగ్రిమెంట్‌లో పొందుపరుస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో గత 15 రోజులుగా ఈ తంతూ కొనసాగుతుంది. కౌలు రైతులు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలపై ప్రజాపక్షం ప్రత్యేక కథనం.
భూములను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్న కౌలు రైతులు సూర్యాపేట జిల్లాలో దాదాపు 15వేలకుపైగా ఉన్నారు. ప్రతి గ్రామంలో 50 నుండి 100 మంది వరకు ఉన్నారు. మెట్ట పంటలు కాకుండా తరి పంట(వరిపొలం) కౌలుకు తీసుకొని సాగు చేసే వారే ఇందులో అధికంగా ఉన్నారు. ఐదు ఎకరాల పైబడి భూమి కలిగి ఉన్న రైతులు ఎవరూ కూడా సేద్యం చేయడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు, కిసాన్‌ సమృద్ధియోజన పథకాల ద్వారా ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయంతో పాటు కౌలు రైతులు ఇచ్చే కౌలు డబ్బులతో దర్జగా జీవనం సాగిస్తున్నారు. వీరి భూములు కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్న రైతులు మాత్రం పంట దిగుబడి రాక, వచ్చినా గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతూ చివరకు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ మేల్కొన్నారు. కౌలు రైతులు తెలిపిన వివరాల ప్రకారం ఒక ఎకరం వరి పొలం సాగుఖర్చు, కౌలు డబ్బులతో కలిపి దాదాపు రూ. 40వేలకు పైగా పెట్టుబడి ఖర్చు అవుతుందని లెక్కలు చెబుతున్నారు. ఎకరా పొలంలో దిగుబడి 35 బస్తాల నుండి 40బస్తాల కన్నా ఎక్కువ రావడం లేరని పరిస్థితులు ఉన్నాయని…35 బస్తాలకు గాను 24 క్వింటాళ్ల 50 కిలోలు అవుతుందని, క్వింటాకు రూ. 1800 ధరకు అమ్మినా మొత్తం రూ. 44వేల 100 మాత్రమే తమకు రావడం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. తమ కష్టం వృథా అయినా పెట్టుబడిపోగా మిగిలే డబ్బులు ఏమి లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామ, గ్రామాన సభలు, సమావేశాలు నిర్వహించుకుంటున్న కౌలు రైతులు కమిటీలను ఏర్పాటు చేసుకొని మూకుమ్మడిగా తీర్మానాలు చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో గత సంవత్సరం వరకు ఖరీప్‌లో వరికి ఎకరాకు 12 నుండి 15 బస్తాల వరకు కౌలు ఇస్తుండగా ఈ ఖరీప్‌లో 9 బస్తాల నుండి 12 బస్తాలకు, రబీలో 10 నుండి 12బస్తాలు ఇవ్వగా, ఈ ఏడాది 7 నుండి 9 బస్తాల వరకు మాత్రమే ఇస్తామని చెబుతూ తీర్మానాలు చేస్తున్నారు. భూములు కౌలుకు తీసుకొని సేద్యం చేసే ఎవరు కూడా చేసిన తీర్మానాలకు కట్టుబడి ఉండకుండా థిక్కరిస్తే రూ. 50వేలు జరిమానా విధించడం జరుగుతుందని ఏకంగా అగ్రిమెంట్లు రాసుకుంటున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఈ కౌలు రైతుల సభలు, సమావేశాలు జిల్లాలో మరింత ఊపు అందుకోనున్నాయి. భూములు కౌలుకు ఇచ్చే రైతులు, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కార్యచరణ రూపొందించి ముందుకు సాగుతామని కౌలు రైతులు చెబుతున్నారు.
కౌలు రైతులు చెబుతున్న సాగు ఖర్చు వివరాలు…( ఎకర వరిసాగుకు)
ఎకరాకు కౌలు 12 బస్తాలకు రూ. 15,000 వరకు
భూము సదునుకు (దున్నకం) రూ. 7000
విత్తనాలకు రూ. 1000
అడుగు మందు(డిఎపి) రెండు కట్టలు రూ. 3000
వరాలు తీసేందుకు కూలీ రూ. 700
యూరియా రెండు బస్తాలు రూ. 600
పోటాష్‌ బస్తా రూ. 1800
వరి నాటు కూళ్లు రూ . 4000
పాయలు తీసేందుకు కూలీ రూ. 500
పిచికారి మందులు ఐదుసార్లకు కూళ్లతో రూ. 5000
కోతకు రూ. 6000
మొత్తం రూ. 44,600

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments