కర్ఫ్యూ, లాక్‌డౌన్‌కు ఆస్కారం లేదు

ప్రజలు భయాందోళనకు గురి కావొద్దు : మంత్రి ఈటల
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగానే ఉన్నదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ విధించే ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. ప్రజ లు భయాందోళనకు గురికావ్వాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో ఉన్న టర్శరే కేర్‌ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో ఉన్న ఏర్పాట్ల మంత్రి రాజేందర్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కరోనా కిట్లు అందుబాటులో ఉన్నాయని, ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తున్నామని తెలిపారు. ర్యాపిడ్‌ టెస్టులతో వెంటనే ఫలితాలు వస్తున్నాయని, పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే కరోనా కిట్‌ను అందజేస్తున్నామన్నా రు. కరోనా రిపోర్ట్‌ వెంటనే రావడంతో ఆ వ్యక్తి కాంటాక్టు ట్రేసింగ్‌ సులభమవుతోందని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రు లు, పిహెచ్‌సిల్లో టెస్టులు, వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని, అవకాశం లేనివారికి ప్రభుత్వ ఐసోలేషన్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సెకెండ్‌వేవ్‌ కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనాకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఇవ్వబోతున్నామన్నారు.అవసరమైతే పరీక్షలు లక్షకు పెంచుతాం: కరోనా నిర్ధారణ పరీక్షలను అవసరమైతే ఒక లక్ష వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.హైదరాబాద్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తప్పకుండా ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని, భూతిక దూరాన్ని,కరోనా నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాపిడ్‌ టెస్ట్స్‌ అందుబాటులోనికి వచ్చిన తరువాత ట్రేసింగ్‌ వేగవంతమైందని, తద్వారా మరణాల శాతం తగ్గిందన్నారు. కరోనా వైరస్‌ సోకిన వారిలో కరోనా లక్షణాలు లేవన్నారు. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో సాధారణ సేవలు కొనసాగిస్తూనే కరోనా సేవలు కూడా అందిస్తామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సెలవులు పెట్టవద్దని, సెల్‌ఫోన్లను ఆన్‌లో పెట్టుకోవాలని సూచించారు. 33 జిల్లాల్లో ఐసోలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని, అన్ని జిల్లా కేంద్రాల్లో కొవిడ్‌ చికిత్స అందుబాటులో ఉన్నదని, సరిహద్దు జిల్లాల వారందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాపారం కోణంలో చూడకండి : ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు వ్యాపార కోణంలో చూడకుండా ప్రజలకు సేవలను అందించాలని, లక్షల రూపాయాలు వసూలు చేయవద్దని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. సామాజిక బాధ్యతగా ప్రైవేటు ఆస్పత్రులూ వైద్యం అందించాలని,ప్రైవేటు ఆస్పత్రులు కరోనా వైద్య ఖర్చులు సాధ్యమైనంత వరకు తగ్గించి తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలని, ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయన్నారు. కరోనా వైరస్‌ ఒక ఒక మామూలు రోగమన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?