హాజరైన పలువురు ప్రముఖులు
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పదవీ ప్రమాణం చేశారు. గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రిగా కర్నాటక పిసిసి నాయకుడు డికె శివకుమార్‌తోపాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. 2013లో మొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు, శివకుమార్ మంత్రిగా కొనసాగారు. ఈసారి
ముఖ్యమంత్రి రేసులో సిద్దరామయ్య, శివకుమార్‌తోపాటు తాను కూడా ఉన్నట్టు ప్రకటించిన పరమేశ్వర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కెహెచ్ మునియప్ప, కెజి జార్జి, ఎంబి పాటిల్, సతీష్ జార్కిహొఓలి, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, రామలింగా రెడ్డి, బిజెడ్ జమీర్ అహమ్మద్ ఖాన్ కూడా మంత్రులుగా ప్రమాణాలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకుడు రాహల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, జార్ఖండ్ సిఎం హేమంత్ సోరేన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సిఎం తేజస్వీ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, పిడిపి చీఫ్ మహబూబా ముఫ్తీ, రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు కమల్ హసన్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి, సిద్దరామయ్యకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బగెల్ (చత్తీస్‌గఢ్), సుఖ్వీందర్ సింగ్ సుక్కూ (హిమాచల్ ప్రదేశ్)తోపాటు పువురు సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కర్నాటక ముఖ్యమంత్రిగాసిద్దరామయ్య ప్రమాణం
RELATED ARTICLES