రెండింట మూడు వంతులు ఎలాంటి లక్షణాలు లేని వారే
వీరితోనే ప్రమాదకరమని వైద్యారోగ్యశాఖ వెల్లడి
సెకండరీ కాంటాక్ట్‌లోకి నస్పూర్ మున్సిపాలిటీ
ప్రైమరీ కాంటాక్ట్ వారిని క్వారంటైన్‌కు తరలింపు
ఇంటి వద్దనే రక్తనమూనాల సేకరణ
పాజిటివ్ తేలితేనా ఐసోలేషన్‌కు తరలించాలని నిర్ణయం
ఖమ్మంలో తాజాగా మరొకరికి కరోనా పాజిటివ్
ప్రభుత్వ ఉద్యోగులకు రోజుకో రంగు పాస్
కర్ణాటక సరిహద్దులో భద్రత పెంచిన తెలంగాణ
ప్రజాపక్షం / హైదరాబాద్ : కరోనా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. వైరస్ వెలుగుచూసిన తొలి నాళ్లలో ఈ విధంగా వ్యాప్తి చెందుతుందని భావించిన రూపాలన్నీ నానాటికీ మారిపోతున్నాయి. తాజాగా కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకడంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. దేశ వ్యాప్తంగా ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికే 80శాతం కరోనా పాజిటివ్ తేలుతున్నట్లు భారత ఆరోగ్యశాఖ వెల్లండించింది. తెలంగాణలోనూ తాజాగా వెలుగుచూస్తున్న కేసుల్లో 80శాతానికి పైగా ఎలాంటి లక్షణాలు లేని వారికే కరోనా పాజిటివ్ వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత విచిత్రంగా తయారైంది. తాజాగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 50శాతం ఎలా వచ్చాయో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాదు ఎలాంటి లక్షణాలు భయటపడని వారే దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి పెరగడానికి కారణమవుతున్నారని వైద్యవర్గాలు తెలిపాయి. ఇలాంటి వారిలో 5 నుంచి 14 రోజుల లోపు లక్షణాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. అయితే లక్షణాలు బయటపడని ఈ మధ్య రోజుల్లో వారు వారికి ఎలాంటి కరోనా లేదని భావించి చాలా మందితో కలవడం వల్ల కరోనా వ్యాధి వేగంగా వృద్ధి చెందుతోందని వైద్యవర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ఇలా కరోనా తన రూపాన్ని మార్చుకుంటుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇప్పటి వరకు అవలంబిస్తున్న విధానాల్లో మార్పులు తెస్తున్నాయి. ఇప్పటి వరకు అనుమానితులను క్వారంటైన్‌కు తరలించి పరీక్షల కోసం రక్తనమూనాలు సేకరించేవారు. ఇప్పటి నుంచి ఇంటి వద్దనే రక్తనమూనాలు సేకరించి పాజిటివ్ తేలితే ఐసోలేషన్‌కు తరలించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ సెకండరీ కాంటాక్ట్‌లోకి వెల్లిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఇక్కడ ముత్తరావుపేటలో ఒక మహిళ కరోనా పాజిటివ్‌తో చనిపోగా ఆమె అంత్యక్రియలకు వెల్లి వచ్చిన వారికి కరోనా వ్యాపించింది. అంతే కాదు ఆమెకు చికిత్స చేసిన ఆర్ఎంపి డాక్టర్‌తో పాటు చెన్నూరు ఆసుపత్రిలోని వైద్యసిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ముత్తారావుపేటను దిగ్బంధనం చేయడంతో పాటు మొత్తం నస్పూర్ మున్సిపాల్టీ సెకండరీ కాంటాక్ట్‌లోకి వెళ్లినట్లు గుర్తించి తగు చర్యలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో వివిధ పనులు నిర్వహించే వారికి ఇచ్చిన పాస్‌లు దుర్వినియోగమవుతున్నాయని భావించి మంగళవారం నుంచి కొత్త పాస్‌ల విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొత్తం మూడు రకాల పాస్‌లను పోలీసుశాఖ జారీ చేయనుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు రోజుకో రంగు పాస్ ఇస్తారు. సోమవారం రెడ్, మంగళవారం గ్రీన్, బుధవారం ఎల్లో, గురువారం వైట్, శుక్రవారం పింక్, శనివారం బ్లూ రంగు పాస్‌లు ఇవ్వనున్నారు. అలాగే కూరగాయలు,నిత్యావసరాలకు వెళ్లేవారికి సిటిజన్ పాస్‌లు ఇవ్వనున్నారు. వీరి వారి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వెళ్లాలి. ఈ నిబంధన పాటించకపోవడంతో వీరికి పాస్‌లు ఇస్తూ వాటిలో వారి చిరునామా, వారు నిత్యావసరాలకు వెళ్లే మార్గం, సమయం వంటివి పాస్‌లపై నమోదు చేస్తారు. అంతే కాదు అత్యవసర విధులు నిర్వహించే ప్రైవేటు ఉద్యోగులకు కూడా వారి పాస్‌లపై వారు ఉద్యోగాలకు వెళ్లి, వచ్చే సమయం, వారు ప్రయాణించే మార్గాన్ని నమోదు చేస్తారు. దీంతో పాస్‌ల దుర్వినియోగాన్ని నివారించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల తనిఖీ ప్రతి చోట చేపట్టారు. మంగళవారం ఈ విధంగా ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేయడం వల్ల కూకట్‌పల్లిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తాజాగా ఖమ్మంలో మరో పాజిటివ్ కేసు నమోదయింది. ఇప్పటికి జిహెచ్‌ఎంసిలోనే అత్యధిక కేసులు నమోదవుతున్పప్పటికీ సూర్యాపేట, నారాయణపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. జిల్లాల్లోనూ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. బాన్స్వాడలో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న 20 మందిపై కేసులు నమోదు చేశారు. కరీంనగర్లో ప్రస్తుతం రెండే ఆక్టివ్ కేసులు, పెద్దపల్లిలో ఒక ఆక్టివ్ కేసుతో నిన్నమొన్నటి వరకు గుబులు పుట్టించిన ఈ జిల్లాలు కాస్తా ఊరట కలిగించాయి.
అయిదు నగరాల్లో పరిస్థితి తీవ్రం
దేశ వ్యాప్తంగా ఐదు నగరాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని భారత ప్రభుత్వ ఆరోగ్యశాఖ వెల్లండించింది. వీటిలో ముంబయి, పుణె, కోల్‌కతా, జైపూర్, ఇండోర్లు ఉన్నాయి. వారం రోజుల క్రితం ఈ జాబితాలో హైదరాబాద్ కూడా ఉన్నప్పటికీ కాస్తా పరిస్థితి మెరుగుపర్చుకుని అతి తీవ్రత లేని నగరంగా మారడం రాష్ట్రానికి ఉపశమనం కలిగించింది. తాజాగా రాష్ట్రపతి భవన్‌కు కరోనా వ్యాపించింది. ఇక్కడ పనిచేసే హౌజ్‌కీపింగ్ సిబ్బందిలో ఒకరి కోడలు చనిపోగా ఆమె అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన వారిలో ఒకరి అమ్మకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో రాష్ట్రపతి భవన్ గేట్ నెంబర్ 70 వద్ద నివసిస్తున్న హౌజ్‌కీపింగ్ సిబ్బంది 115 కుటుంబాలను క్వారంటైన్ చేశారు. కార్యదర్శి స్థాయి అధికారులను స్వీయ క్వారంటైన్లో ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితులు రోజురోజుకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. దీంతో కర్నూల్ ప్రభుత్వాసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు. ఈ ఆసుపత్రిలో ఉన్న 600 ఇన్‌పేషంట్లను నగరంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాలని ఎపి సిఎం ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో సోమవారం ఒక్క రోజే 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి రాష్ట్రంలో అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 184, గుంటూరు జిల్లాలో 158, కృష్ణా జిల్లాలో 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.