కరోనా వైరస్‌ కలకలం

సౌదీలో కేరళ నర్సుకు సోకిన వైరస్‌

ఆసుపత్రిలో 30కిపైగా తోటి నర్సుల నిర్బంధం

తిరువనంతపురం: భారత్‌కు చెందిన ఓ నర్సు కు ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకింది. సౌదీ అరేబియాలోని అభా నగరంలోని ‘అల్‌ హయత్‌ హాస్పిటల్‌’లో పనిచేస్తున్న కేరళ నర్సుకు కరోనా వైరస్‌ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. సౌదీ అరేబియా నైరుతి ప్రాంతంలో ఉన్న అసీర్‌ రాజధాని నగరం అభా. ఈ విషయాన్ని భారత విదేశాంగ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ ధ్రువీకరించారు. దీనిపై ఆయన ట్విటర్లో ఓ పోస్ట్‌ చేశారు. సౌదీలో పనిచేస్తున్న 100 మంది భారత నర్సులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో చాలా మంది కేరళకు చెందినవారే. అయితే కేరళ చెందిన ఓ నర్సుకు మాత్రమే ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వైరస్‌ సోకిన నర్సుకు ‘అసీర్‌ నేషనల్‌ హాస్పిటల్‌’లో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అలాగే మిగతా నర్సులకు కరోనా వైరస్‌ సోకకుండా జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అయితే అక్కడి కేరళ నర్సులు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి అక్కడి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. ‘మాకు ఆసుపత్రిలో రెండు గదులే కేటాయించారు. సరైన పరీక్షలు చేయడంలేదు. సరిగా చికిత్స కూడా అందించడంలేదు. భారత ఎంబసీ అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేశాం’ వారి లో ఓ నర్సు మలయాళం న్యూస్‌ ఛానల్‌కు ఫోన్‌ ద్వారా తెలిపారు. అందిన సమాచారం ప్రకా రం వైరస్‌ సోకిన ఆ కేరళ నర్సు కొట్టాయంలోని ఎట్టుమానూర్‌కు చెందిన 38ఏళ్ల వయస్కురా లు. ఓ ఫిలిప్పీనో వ్యాధిగ్రస్తుడికి చికిత్స అందిస్తున్నప్పుడు ఆమెకు ఆ వైరస్‌ సంక్రమించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ నర్సు నుంచి మిగతా కేరళ నర్సులను వేరు చేశారు. ఆసుపత్రిలో నిర్బంధంలో(క్వారన్‌టైన్‌లో) ఉన్న నర్సులు తమ పరిస్థితి ఘోరంగా ఉందని మొరబెట్టుకుంటున్నారు. ‘30 మంది నర్సులకు స్వాబ్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో 20 మందికి పాజిటివ్‌ అని తెలిసింది. వారందరిని క్వారన్‌టైన్‌లో ఉంచారు. వారి వైరస్‌ ఇన్‌క్యూబేషన్‌ కాలం ఎంతో కూడా తెలియడంలేదు. వారి పరిస్థితి నిజంగా ఘోరంగా ఉంది’ అని ఆ నర్సుల్లో ఒకరి బంధువు పేరు తెలుప నిరాకరిస్తూనే వివరించారు. జెడ్డాలోని భారత కాన్సులేట్‌ అధికారులతో ఈ అంశంపై మాట్లాడినట్టు తెలిపారు. కాన్సులేట్‌ అధికారులు సౌదీ విదేశాంగ శాఖతోపాటు హాస్పిటల్‌ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ , విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు లేఖ రాశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా సౌదీ ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, మిగిలిన నర్సులకు కరోనా వైరస్‌ సోకకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజయన్‌ కేంద్రాన్ని కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?