కరోనా వైరస్‌ను గుర్తించిన ‘హీరో’ మృతి

బీజింగ్‌: ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న కరోనావైరస్‌ను తొలుత గుర్తించిన చైనా వైద్యుడు లీ వెన్‌లియాంగ్‌ గురువారం మృతిచెందారు. ఈ నెల 1న ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసియూ)లో చేరిన లీ గురువారం ఉదయం మరణించినట్లు వైద్యులు వెల్లడించా రు. ఆయన మృతిపట్ల చైనా ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) సైతం లీ మృతి పట్ల సంతాపం ప్రకటించింది. నేత్రవైద్యుడైన లీ వెన్‌లియాంగ్‌ తన వద్దకు వచ్చిన ఓ రోగిలో తొలిసారి కరోనా వైరస్‌ ఆనవాళ్లను డిసెంబరు 30న గుర్తించారు. సార్స్‌ తరహా వైరస్‌ ఆనవాళ్లు ఆ రోగిలో గుర్తించానంటూ తన మిత్రులకు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఆ సందేశం కాస్తా వైరల్‌ కావడంతో వైరస్‌ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తొలుత అసత్య ప్రచారాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న నేరం కింద లీ వెన్‌లియాంగ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం తన మిత్రులకు మాత్రమే చెప్పాలనుకున్నానని, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం తన ఉద్దేశం కాదని చెప్పినా వారు వినిపించుకోలేదు. అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఎట్టకేలకు రెండు వారాల తర్వాత వదిలిపెట్టారు. తిరిగి ఆయన విధుల్లో చేరి వైరస్‌ బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు కృషి చేశారు. జనవరి రెండో వారంలో ఆయనకీ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 1న ఐసియూలో చేరి వైరస్‌తో పోరాడుతూనే ప్రాణాలు కోల్పోయారు. లీ అరెస్టుని సుప్రీం పీపుల్స్‌ కోర్టు సైతం తప్పుబట్టింది. అతను చెప్పిన విషయాన్ని వెంటనే విశ్వసించి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదని వ్యాఖ్యానించింది. లీ మృతిపట్ల చైనావ్యాప్తంగా తీవ్ర విచారం వ్యక్తం అవుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. వైరస్‌ నుంచి ప్రజల్ని కాపాడడం కోసం పనిచేసిన హీరోగా కీర్తిస్తున్నారు. అదే సమయంలో లీపై పోలీసులు వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?