కరోనా విజృంభణ

రాష్ట్రంలో 24 గంటల్లో 1,879 కొత్త కొవిడ్‌ కేసులు
జిహెచ్‌ఎంసి పరిధిలోనే 1,422 పాజిటివ్‌లు
మరో ఏడుగురు మృతి, 313కు చేరిన మృతుల సంఖ్య

ప్రజాపక్షం/హైదరాబాద్‌  తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో మరోసారి భారీగా కొత్త కేసులు వెలుగు చూశాయి. గత వారం రోజుల నుంచి నిత్యం 1500లకు పైగా కొత్త కేసులు రావడం తీవ్ర కలవర పెడుతుంది. మంగళవారం ఒక్కరోజే మరో 1,879 కేసులు నమోదయ్యాయి. జిహెచ్‌ఎంసితో పాటు శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చేల్‌లో కూడా నిత్యం భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,879 కొవిడ్‌ 19 కేసులు నమోదుకాగా, అందులో జిహెచ్‌ఎంసి పరిధిలోనే 1,422 కేసులు నమోదయ్యా యి. కొత్తగా మరో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 27,612 మందికి పాజిటివ్‌ రాగా, 313 మందిని మహమ్మారి బలి తీసుకుంది. మరో 1,506 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 6,220 నమూనాలను పరీక్షించగా 4,341 మందికి నెగెటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. మొత్తంగా 1,28,438 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు తెలిపింది. రాష్ట్రంలో 11,012 యాక్టివ్‌ కేసులు ఉండగా, 16,287 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి తమ ఇళ్లలోకి వెళ్లారు. ఇదిలావుండగా, రంగారెడ్డి జిల్లాలో మంగళవారం 176 మందికి కొత్తగా కరోనా సోకగా, మేడ్చల్‌ జిల్లాలో 94 మందికి పాజిటివ్‌గా తేలింది. కరీంనగర్‌లో 32, నల్లగొండలో 31, నిజామాబాద్‌లో 19, వరంగల్‌ అర్బన్‌లో 13, మెదక్‌, ములుగులో 12 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. అదే విధంగా మహబూబ్‌నగర్‌లో 11, సంగారెడ్డి, సూర్యాపేటలో 9 చొప్పున, కామారెడ్డిలో 7, గద్వాల్‌లో 4, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లిలో 3 చొప్పున, జగిత్యాల్‌, మహబూబాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నాగర్‌కర్నూల్‌లో రెండేసి చొప్పున, వికారాబాద్‌, ఆదిలాబాద్‌, జనగాం, వనపర్తి, సిద్దిపేటలో ఒక్కొక్క కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 17,081 కొవిడ్‌ బెడ్లు ఉండగా, అందులో 11,928, ఐసోలేషన్‌ బెడ్లు, 3,537 ఆక్సిజన్‌ బెడ్లు, 1,145 ఐసియు బెడ్లు, 471 వెంటిలేటర్‌ బెడ్లు ఉన్నాయి. మంగళవారం నాటికి 7.8 మాత్రమే బెడ్లు ఆక్యుపై కాగా, 92,9 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?