భారత్‌లో రికార్డుస్థాయిలో కొత్త కేసులు
24 గంటల్లో 78,761 మందికి పాజిటివ్
మరో 948 మంది మహమ్మారికి బలి
మృతుల సంఖ్యలో ప్రపంచంలోనే మూడవ స్థానానికి అతి చేరువలో ఇండియా
ఒక్కరోజులో 10,55,027 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఐసిఎంఆర్
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశంలో నిత్యం 70 వేలకుపైగా కొత్తకేసులు, వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇక రోజు వారీ కేసు ల్లో అయితే ఏకంగా భారత్ ప్రపంచంలోనే భారత్ తొలి స్థానానికి చేరుకుంది. కాగా, దేశంలో బాధితు ల సంఖ్య 35 లక్షలు దాటింది. 30 లక్షల మార్క్‌ను దాటిన కేవలం వారం రోజుల్లో మరో ఐదు లక్షలకు చేరుకోవడం తీవ్రంగా కలచివేస్తుంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచి న 24 గంటల్లో రికార్డు స్థాయిలో 78,761 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 35,42,733 చేరింది. ఒక్కరోజే భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి కాగా, ఒక్క రోజులో 75 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కావడం వరుసగా ఇది నాల్గొవరోజు. ఇక 24 గంట ల్లో 948 మందికి కరోనా కాటుకు బలయ్యారు. తాజా మృతులతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 63,498కి ఎగబాకింది. ఇప్పటి వరకు 26,48,998 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రికవరీ రేటు 76.61 శాతంగా ఉండగా, మరణాల రేటు మాత్రం 1.79 శాతానికి పడిపోయిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 7,65,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 21.60 శాతమని మంత్రిత్వశాఖ పేర్కొంది. భారత్‌లో
కొవిడ్ కేసులు 20 లక్షల నుంచి 30 లక్షలకు కేవలం 16 రోజుల్లోనే చేరుకోగా, 10 లక్షల నుంచి 20 లక్షల మార్క్‌ను దాటేందుకు 21 రోజులు పట్టింది. అయితే దేశంలో లక్ష కరోనా కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం తీసుకోగా, ఆ తరువాత కేవలం 59 రోజుల్లోనే పది లక్షలకు చేరాయి. ఆగస్టు 7న 20 లక్షలకు చేరుకోగా, 23వ తేదీ నాటికి 30 లక్షలు దాటాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా బ్రెజిల్, భారత్‌లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్యలో మూడవ స్థానంలో ఉన్న మెక్సికోను భారత్ అతి దగ్గరలో ఉంది. శనివారం దేశవ్యాప్తంగా 10,55,027 శాంపిళ్లకు కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) వెల్లడించింది. ఒక్క రోజులో పది లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించడం ఇది రెండవసారి. అయితే ఇప్పటివరకు దేశంలో 4,14,61,636 శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తిచేసినట్లు ఐసిఎంఆర్ పేర్కొంది. ఇదిలా ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. జాన్స్ హాప్కిక్స్ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం, ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఐదు దేశాల వివరాలను పరిశీలిస్తే… అమెరికా 59,60,652 కేసులు నమోదు కాగా, 1,82,760 మంది మృతి చెందారు.
బ్రెజిల్లో మొత్తం కేసులు 38,46,153 కాగా, 1,20,262 మంది, భారత్‌లో మొత్తం 35,42,733, మృతులు 63,498, మెక్సికోలో మొత్తం కేసులు 5,91,712, మృతులు 63,819, బ్రిటన్‌లో మొత్త కేసులు 3,34,916 నమోదు కాగా, 41,585 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో నిత్యం 300కుపైగా మరణాలు
మహారాష్ట్రలో నిత్యం కొత్తగా దాదాపు 15 వేల మందికి కరోనా పాజిటివ్ వస్తుండగా, 300కుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 328 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 24,103కు చేరింది. తమిళనాడులో కూడా నిత్యం వందకుపైగా మృతుల సంఖ్య నమోదవుతుంది. 24 గంటల్లో మరో 87 మందిని కరోనా బలితీసుకోగా, 7,137కు మృతుల సంఖ్య ఎగబాకింది. కర్నాటకలోనూ రోజుకు 100కుపైగా కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 115 మంది చనిపోగా, మృతుల సంఖ్య 5,483గా ఉంది. ఢిల్లీలో మృతుల సంఖ్య 4,404గా ఉండగా, కొత్తగా మరో 15 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 88 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతులు 3,884కు పెరిగారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం మృతులు 3,356 కాగా, కొత్తగా 62 మంది, పశ్చిమ బెంగాల్లో మొత్తం మృతులు 3,126 కాగా, తాజాగా 53 మంది, గుజరాత్లో మొత్తం మృతులు 2,989 కాగా, కొత్తగా 13 మంది, పంజాబ్‌లో మృతుల సంఖ్య 1.348 నమోదు కాగా, ఒక్క రోజులో 41 మంది, మధ్య ప్రదేశ్‌లో మృతుల సంఖ్య 1,345గా ఉండగా, కొత్తగా 22 మంది, రాజస్థాన్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,030 నమోదు కాగా, 24 గంటల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
24గంటల్లో 10.5లక్షల కొవిడ్ టెస్టులు..!
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను ఆయా ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా నిత్యం దాదాపు 8 నుంచి 10లక్షల శాంపిళ్లకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 10లక్షల 55వేల శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) వెల్లడించింది. దీంతో ఆగస్టు 29వరకు దేశంలో మొత్తం 4,14,61,636 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ పేర్కొంది. ప్రస్తుతం కరోనా కేసుల పాజిటివిటీ రేటు 8.5శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జనవరి 23వరకు దేశంలో ఒకేఒక్క టెస్టింగ్ కేంద్రం ఉండగా, మార్చి 23వరకు ఆ సంఖ్య 160కు పెంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు 1583 కేంద్రాలకు ఐసిఎంఆర్ అనుమతినిచ్చింది. వీటిలో 1003 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉండగా, 580 ప్రైవేటు ల్యాబ్‌ల ఆధ్వర్యంలో కొవిడ్ టెస్టులు చేపడుతున్నారు.
పల్లెల్లోనూ తిష్ట
రాష్ట్రంలో కొత్తగా 2,924 మందికి కరోనా పాజిటివ్
మరో పది మంది మృత్యువాత
818కి చేరిన మరణాలు
కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ అర్బన్‌లో భారీగా కొత్త కేసులు
ప్రజాపక్షం/ హైదరాబాద్ రాష్ట్రంలో కొత్తగా 2924 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,23,090 మందికి కరోనా సోకింది. మరో 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 818కి చేరింది. 24 గంటల్లో 1638 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు శనివారం నాటి కరోనా హెల్త్ బులెటిన్‌ను వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల రేటు 0.66 శాతం ఉండగా, జాతీయ స్థాయిలో 1.79 శాతం నమోదైంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి రేటు రాష్ట్రంలో 73.9 శాతం కాగా, జాతీయ స్థాయిలో 76.63 శాతం నమోదైంది. శనివారం నాడు 61,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 1801 రిపోర్టులు రావాల్సి ఉన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,284 యాక్టివ్ కేసులు ఉండగా, 24,176 మంది గృహాలు, ఇతర సంస్థలలో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 90,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసులు
శనివారం నాడు ఆదిలాబాద్‌లో 36, భద్రాద్రి-కొత్తగూడెంలో 88, జిహెచ్ఎంసిలో 461, జగిత్యాలలో 92, జనగామలో 46, జయశంకర్ భూపాల్‌పల్లిలో 24, జోగులాంబ గద్వాల్లో 35, కామారెడ్డిలో 56, కరీంనగర్లో 172, ఖమ్మంలో 181, కొమురంబీమ్ ఆసిఫాబాద్‌లో 10, మహబూబ్‌నగర్‌లో 58, మహబూబాబాద్‌లో 80, మంచిర్యాలలో 91, మెదక్‌లో 45, మేడ్చల్- మల్కాజిగిరిలో 153, ములుగులో 34, నాగర్‌కర్నూల్‌లో 51, నల్లగొండలో 171, నారాయణపేట్‌లో 13, నిర్మల్‌లో 33, నిజామాబాద్‌లో 140, పెద్దపల్లిలో 83, రాజన్న సిరిసిల్లాలో 55, రంగారెడ్డిలో 213, సంగారెడ్డిలో 44, సిద్దిపేటలో 97, సూర్యాపేటలో 118, వికారాబాద్‌లో 15, వనపర్తిలో 46, వరంగల్ రూరల్‌లో 17, వరంగల్ అర్బన్‌లో 102, యాదాద్రి-భువనగిరిలో 64 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా మహాఉగ్రరూపం
RELATED ARTICLES