అంతుచిక్కని వారు 2వేలకు పైనే…
అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం
గాలింపు చర్యల్లో యంత్రాంగం
పరీక్షల సమయంలోనే తప్పుడు చిరునామా, ఫోన్ నంబర్లు
వారి నుంచి ఎంత మందికి వ్యాపిస్తోందోననే భయం
ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలిన కొందరి చిరునామాలు గల్లంతయ్యాయి. ఇప్పుడు ఆ పాజిటివ్ వ్యక్తులు ఎక్కడ? ఎలా ఉన్నారో అంతుపట్టడం లేదు. వారి కోసం అధికార యంత్రాంగం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. సుమారు రెండు వేలకు పైగా కరోనా పేషంట్లు గల్లంతైనట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, క్యాంపుల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించుకున్న వారిలో కొందరికి పాజిటివ్ అని తేలింది. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిని హోమ్ ఐసోలేషన్, లేదా ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉంటుంది. పైగా వారి కుటుంబం, సన్నిహితంగా ఉన్న వారిని కూడా అప్రమత్తం చేసి, హోం క్వారంటైన్లో పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడివరకు ప్రక్రియ సాఫీగానే ఉన్నది. కానీ ఇంతకు కరోనా పరీక్షలు నిర్వహించుకున్న వారిలో కొందరు ప్రస్తుతం ఎక్కడున్నారో అంతుచిక్కడం లేదు. కనీసం వారు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. వారి ఫోన్ నంబర్లు పని చేయడం లేదు. కరోనావైరస్ పరీక్షలకు వచ్చే వారిలో కొందరు తప్పుడు చిరునామాలు, తప్పుడు ఫోన్‌నంబర్లు చెబుతున్నట్టు సాక్షాత్తు అధికార యంత్రాంగమే చెబుతోంది. తీరా వారికి పాజిటివ్ అని తేలితే వారిని పట్టుకోవడం తలకు మించిన భారమేనని, అయినప్పటికీ వారి చిరునామాను దొరకపడుతున్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్- అని తేలితే తమను సమాజంలో చిన్నచూపు చూస్తారని, పైగా తెలిసినవారు కూడా దూరంగా పెడతారని, చికిత్స విషయంలో తాజా పరిణామాల నేపథ్యంలో తప్పుడు చిరునామాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం రెండు వేలమందికి పైగా కరోనా పాజిటివ్ వ్యక్తుల చెందిన వారు, వారి సన్నిహితుల ద్వారా సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైనట్టు తెలిసింది. కాగా కరోనా పాజిటివ్ భయంతోనే కొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు చిరునామా, ఫోన్ నంబర్లు చెబుతుంటారని, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని, వారు తప్పుడు చిరునామాలు చెప్పడం, తాము వారిని ట్రేస్ చేయడం జరుగుతూనే ఉన్నదని ఒక అధికారి తెలిపారు. పాజిటివ్ అని తేలిన తర్వాత వారిని పట్టుకోవడం కోసం సర్వ శక్తులు ఒడ్డాల్సి వస్తోందని పేర్కొన్నారు.
భయం గుప్పిట్లో ప్రజలు: కరోనా విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతుంద ని ప్రజలు భయందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన కొంద రు పట్టణాలను వదిలి సొంత ఊరుబాట పట్టారు. మరి కొందరు ఉద్యోగులు ‘వర్క్‌ఫ్రమ్ హోమ్’కు పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో పాజిటివ్ అని తేలిన వారు ఎవరికి కనిపించకుండా పోవడం ప్రజలలో మరింత భయందోళనకు గురి చేస్తోంది. వీరు ఇంకెంత మందికి కరోనాను అంటిస్తారో అని భయపడుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా పేషెంట్లు మిస్సింగ్ అంటూ జాతీయ మీడియాలో కూడా ప్రసారం కావడంతో మరింత భయందోళన చెందుతున్నా రు.
మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలె: రేవంత్ రెడ్డి
కరోనా పాజిటివ్ వ్యక్తుల గల్లంతు విషయమై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజలకు ప్రాణసంకటంగా మారిందని, కెసిఆర్ పాలన పామ్‌హౌస్‌లో మత్తుగా జోగుతోందని ట్వీట్ చేశారు. ‘ప్రజల్లారా మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి తస్మాత్ జాగ్రత్త’ అని రేవంత్ పోస్ట్ చేశారు.