కరోనాపై పోరుకు గంభీర్‌ విరాళం

రూ. 50 లక్షలు ప్రకటించి మాజీ ఓపెనర్‌
న్యూ ఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహ్మమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)తో పోరాడుతోంది. చైనా, ఇటలీ, అమెరికాలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక భారత్‌లోనూ వైరస్‌ నెమ్మదిగా తన ప్రతాపం చూపుతోంది. దేశంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 468కు చేరుకోగా.. ఇప్పటి వరకు తొమ్మిది మంది ఈ మహ్మమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆదివారం దేశం మొత్తం ‘జనతా కర్ఫ్యూ’ పాటించింది. ఆపై చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దేశంలోని పలువురు ప్రముఖులు కరోనాపై పోరుకు మద్దతు ప్రకటించారు. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు విరాళాలు ప్రకటించారు. తాజాగా కరోనా వైరస్‌పై పోరుకు టీమిండియా మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ తనవంతు మద్దతు ప్రకటించాడు. ఎంపి ల్యాడ్‌ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు సోమవారం ప్రకటించాడు. దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అవసరమైన పరికరాల కోసం ఈ మొత్తాన్ని ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశాడు.

DO YOU LIKE THIS ARTICLE?