కరోనాతో మాజీమంత్రి మాణిక్యాలరావు మృతి

విజయవాడ: మాజీ మంత్రి, బిజెపి నేత పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. మాణిక్యాలరావు వయస్సు 59 ఏళ్లు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్‌లో ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు. మాణిక్యాలరావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. 1961, నవంబర్‌ 1న తాడేపల్లి గూడెంలో జన్మించిన మాణిక్యాలరావు… అక్కడే పాఠశాల విద్యనభ్యసించారు. ఆ తర్వాత కళాశాల విద్యను పెంటపాడులో పూర్తిచేశారు. 9 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరారు. బిజెపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఫొటోగ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. ఫొటోస్టూడియో మూసివేసి సింధు షూమార్ట్‌ను ప్రారంభించారు. దాన్ని సింధు ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చి ఆటోమొబైల్‌ విడిభాగాల విక్రయాలు చేసేవారు. 2011- వరకు మానవత సంస్థ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సంస్థ ద్వారా జిల్లాలోని పలు పట్టణాల్లో శీతల శవపేటికలు ఉచితంగా ఏర్పాటు చేసేవారు. రాష్ట్ర విభజన అనంతరం టిడిపి, బిజెపి కూటిమి అభ్యర్థిగా 2014లో తాడేపల్లిగూడెం నుంచి పోటీచేసిన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2018 వరకు టిడిపి ప్రభుత్వంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు: జగన్
మాణిక్యాల రావు మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాల రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహణకు అధికారులను సిఎం జగన్‌ ఆదేశించారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్ట్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?