కరీంనగర్లో కరోనా కలకలం
చేగుర్తిలో కొంప ముంచిన అంత్యక్రియలు
33 మందికి పాజిటివ్
ప్రజాపక్షం/కరీంనగర్ రూరల్ కరీంనగర్ జిల్లాలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టించింది. జిల్లాలో తగ్గుముఖం పడుతుందన్న సమయంలో మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కరీంనగర్ రూరల్ మండలంలోని చేగుర్తిలో జరిగిన అంత్యక్రియలు కరోనా వ్యాప్తికి కారణమైంది. దీంతో చేగుర్తి కరోనాకు హాట్ స్పాట్‌గా మారింది. గ్రామంలో ఒక వ్యక్తి మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తరువాత అతడి కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కొత్తపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో గ్రామంలో గురువారం వైద్యశిబిరం నిర్వహించి 47 మందికి పరీక్షలు చేయగా 16 మంది కరోనా బారినపడినట్లు గుర్తించారు. శుక్రవారం కూడా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేయగా మరో 17 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది, రెండు రోజుల వ్యవధిలో 33 మందికి కరోనా రావడంతో గ్రామస్తులను ఉలిక్కి పడేలా చేసింది. అటు అధికారులు సైతం అప్రమత్తమై చేగుర్తితో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న దుర్షేడ గ్రామ ప్రజలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.