ప్రజాపక్షం/కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని గుర్తుతెలియని దుండగుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. ముత్త రాధిక (16) అనే అనే విద్యార్థిని దుండగుడు గొంతుకోసి హతమార్చాడు. ఈ హృదయ విదారక ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా, ఈ ఘటన కలకలం రేపింది. అయితే, ప్రేమ వ్యవహరమే ఈ ఘాతుకానికి కారణంగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని విద్యానగర్ ప్రాంతంలో నివసిస్తున్న కొమురయ్య-ఓదమ్మ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు అనిల్ హైదరాబాద్‌లో చదువుతుండగా, కూతురు రాధిక నగరంలోని సహస్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రాధిక తల్లితండ్రులు ప్రతి రోజు కూలి పనులకు వెళ్తారు. ఎప్పటిలాగే తల్లిదండ్రులు ఉదయం పనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి రక్తపు మడుగులో కూతురు పడి ఉండటాన్ని చూసి బోరున విలపించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అదనపు డీసీపీలు చంద్రమోహన్, శ్రీనివాస్‌లు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసు జాగిలాలతో ఘటన ప్రాంతంలో తనిఖీ చేశారు. ప్రేమ వ్యవహారం.. లేక ఇతరత్రా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్థానికులు మాత్రం ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు మృతురాలి ఇంటికి చేరుకుని తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. రాధిక కుటుంబాన్ని ఆదుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి కమలాకర్ స్పష్టం చేశారు. 24 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకుంటారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
కరీంనగర్‌లో ఇంటర్ విద్యార్థిని హత్య
RELATED ARTICLES