కరాచీ: పాకిస్థాన్ కరాచీలో ఉన్న చైనా దౌత్యకార్యాలయంపై శుక్రవారం ముగ్గురు సాయుధ బాంబర్లు దాడిచేసి ఇద్దరు పోలీసులతో సహా నలుగురిని చంపేశారు. అత్యంత భద్రత జోన్లో దాడిచేసిన వారిని భద్రతా బలగాలు తర్వాత కాల్చి చంపాయని అధికారులు తెలిపారు. ఈ దాడిని తామే చేసినట్లు నిషిద్ధ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్ఎ) పేర్కొంది. ‘బెలూచ్ నేలపై చైనా మిలిటరీ విస్తరణను తామే మాత్రం సహించబోం’ అని కూడా ఆ నిషిద్ధ సంస్థ పేర్కొంది. విలాసవంతమైన ప్రాంతం క్లిఫ్ ఆ చైనా దౌత్యకార్యాలయం ఉంది. అనుమానిత ఆత్మాహుతి బాంబర్లు దౌత్యకార్యాలయంలోకి బలవంతంగా చొరబడడానికి ప్రయత్నించినప్పుడు వారిని కాల్చి చంపినట్లు కరాచీ పోలీస్ చీఫ్ ఆమిర్ షేఖ్ చెప్పారు. వారి నుంచి తొమ్మిది హ్యాండ్ గ్రనేడ్లు, కలష్నీకోవ్ బుల్లెట్లు,తుపాకీ మ్యాగజైన్స్, పేలుడు పదార్థాలను వారి నుంచి ఆహారపదార్థాలు, ఔషధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ‘ఇద్దరు పోలీసుల పార్థీవ శరీరాలను, గాయపడిన ఓ చైనా సెక్యూరిటీ గార్డును మేమందుకున్నాం. గాయపడిన ఆ చైనా సెక్యూరిటీ గార్డు ఇప్పుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు’ అనిజిన్నా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు, ఓ తండ్రీకొడుకు కూడా చనిపోయారని అధికారులు తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులను చంపేసినట్లు సింధ్ ప్రభుత్వం, పాకిస్థాన్ సైన్య ధ్రువీకరించాయి. దాడి జరిగిన ప్రాంతంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ బిలావల్ భుట్టో జర్దారీ ఇల్లు, పాఠశాలలు, తినుబండారాలున్నాయి. ఎదురుకాల్పులు ముగిసేంత వరకు అన్నింటిని మూసేశారు. ‘ఉదయం 9.30 గంటలకు పేలుళ్ల, కాల్పుల చప్పుళ్లు అక్కడి నివాసులకు వినిపించాయి. ఉగ్రవాదులు మొదట దౌత్యకార్యాలయం బయట ఉన్న చెక్ పోస్ట్ మీద దాడిచేశారు. చేతి గ్రనేడ్లను విసిరారు. వారు తమ వాహనాన్ని దౌత్యకార్యాలయానికి దూరంగా పార్క్ చేశారు’ అని కరాచీ పోలీస్ చీఫ్ ఆమిర్ షేఖ్ వివరించారు. ‘దాడిచేసిన వారు మొదట పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు, పౌరులు చనిపోయాక వారు దౌత్యకార్యాలయం వైపు కదిలారు. అయితే అక్కడి గార్డులు వెంటనే గేట్లు మూసేసి అక్కడి పౌరులకు దారి చూపారు’ అని డిఫెన్స్ అనాలిస్ట్ సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఇక్రం సెహగల్ చెప్పారు. తర్వాత పారామిలిటరీ రేంజర్లు ఆ ప్రదేశానికి చేరుకుని దాడికి పాల్పడినవారితో తలపడ్డారని తెలిపారు. చైనా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు వివరించారు. ‘కరాచీలోని చైనా దౌత్యకార్యాలయంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫిదాయీలు దాడి చేశారు’ అని బిఎల్ఎ గ్రూప్ ట్వీట్ చేసింది. ఈ ఘటనను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖండించారు.
భారత్ ఖండన
కరాచీలో శుక్రవారం చైనా దౌత్యకార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడులను ఎదుర్కొనడానికి అంతర్జాతీయ సమాజం మరింత బలపడతాయని పేర్కొంది. చనిపోయిన వారిపట్ల భారత్ సంతాపాన్ని ప్రకటిచింది. దాడి వెనుక ఉన్నవారిని వీలయినంత త్వరగా పట్టుకుని న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని కూడా భారత్ ఈ సందర్భంగా తెలిపింది.
చైనా ఖండన
పాకిస్థాన్ రేవుపట్నం అయిన కరాచీలో ఉన్న తమ దౌత్యకార్యాలయంపై జరిగిన దాడిని చైనా తీవ్రంగా ఖండించింది. దాడి తర్వాత చైనా దౌత్య కార్యాలయంకు చెందిన సిబ్బంది, వారి కుటుంబసభ్యులు సురక్షితం ఉన్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ తెలిపారు. ఉగ్రవాదులు దౌత్యకార్యాలయంలోకి ప్రవేశించకుండా బయటే వారిని మట్టుబెట్టిన తీరుకు పాకిస్థాన్‌ను ఆయన ప్రశంసించారు. ఈ దాడి కారణంగా చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవ(సిపిఇసి) విషయంలో చైనా నిబద్ధత ఏమాత్రం సడలదని కూడా చెప్పారు. తమ దేశంలోని చైనా జాతీయులు, సంస్థల రక్షణ విషయంలో పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని చైనా వ్యక్తం చేసింది.
కరాచీలో చైనా దౌత్యకార్యాలయంపై విఫలదాడి
RELATED ARTICLES