HomeNewsBreaking Newsకమ్యూనిస్టులంటే మోడీకి భయం

కమ్యూనిస్టులంటే మోడీకి భయం

కమ్యూనిస్టులంటే మోడీకి భయం
దేశాన్ని అమ్ముకునేందుకు కేంద్రం అడుగులు
తెలంగాణ ద్రోహులను పక్కనే పెట్టుకున్న కెసిఆర్‌
మంచిర్యాల సిపిఐ జిల్లా మహాసభల్లో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ
ప్రజాపక్షం/మంచిర్యాల

ప్రధాని నరేంద్ర మోడీకి కమ్యూనిస్టులంటే భయం పట్టుకుందని, దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను దశల వారీగా ప్రైవేటుపరం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. మంచిర్యాల జిల్లా సిపిఐ మూడవ మహాసభలకు ముఖ్యఅతిథిగా నారాయణ హాజరయ్యారు. స్థానిక ఎఫ్‌సిఐ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించగా మాజీ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. మహాసభలను ఉద్దేశించి నారాయణ మాట్లాడారు. పార్టీని జిల్లా వ్యాపితంగా మరిన్ని శాఖలుగా విస్తరించి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కమ్యూనిస్టులు వెళ్ళి ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమస్య ఉన్న చోట తాము ఉంటామని ఇప్పటికే ఎన్నో సార్లు రుజువు చేసుకున్నామని ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింతగా ప్రజలకు దగ్గరకు వెళ్లి వారి వారి స్థాయిలలో పోరాటాలను ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. దేశంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ దమాషా పద్ధతిలో ఎన్నికలు జరగాలని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు ఇందుకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కమ్యూనిస్టులు బలంగా ఉంటే దేశాన్ని అమ్ముకోనివ్వరని వరవరరావు, సాయిబాబా వంటి వారిని జైలులో పెట్టారని ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిది సంవత్సరాల పాలనలో ఇప్పటికి 24 సంస్థలను మోడీ అమేశారని, ఇంకా వంద ప్రభుత్వ సంస్థలను అమ్మడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మన రాష్ట్రంలో సింగరేణి సంస్థను కూడా ప్రైవేటుపరం చేయడానికి యోచిస్తున్నారని చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించారని ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సిపిఐ పనిచేస్తుందని, అందుకే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణ కోసం సిపిఐ ఉద్యమంలో ముందువరుసలో నిలిచిందన్నారు. కెసిఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తన క్యాబినెట్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారినే పక్కన పెట్టుకుని, తెలంగాణ ద్రోహులను అక్కున చేర్చుకున్నారని విమర్శించారు. తన మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్‌.. తెలంగాణలో నియంతృత్వం విడనాడాలని హితవు పలికారు. గద్దర్‌ వంటి వారు తన స్థాయిని దిగజార్చుకుని బిజెపి సమావేశాలకు వెళ్తూ సిద్ధాంతాలను దిగార్చేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల గోదావరి నది వరదలకు అనేక మంది ప్రజలు సర్వం కోల్పోయితే పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి వరద బాధితులను ఆదుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కలవేన శంకర్‌, వాసిరెడ్డి సీతారామయ్య, రామడుగు లక్ష్మణ్‌, మేకల దాసు, బద్రి సత్యనారాయణ, మిట్టపల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments