భూదాన భూములను రక్షించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ భూమిలేని నిరుపేదలకు చెందవలసిన భూదాన భూముల కబ్జాదారులపై ఉక్కుపాదం మోపి భూ ములను రక్షించి పేదలకు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘భూదాన భూ ములను రక్షించాలి భూమి లేని పేదలకు కేటాయించాలి‘ అనే అంశంపై సదస్సు సర్వోదయ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్ నాయక్ అధ్యక్షతన హైదరాబాద్, బాలాపూర్ చౌరస్తాలోని ఆనంద్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా చాడ వెంకట్‌రెడ్డి, విశిష్ట అతిథులుగా అఖిల భారత సర్వ సేవ సంఘ్ జాతీయ అధ్యక్షులు చందన్ పాల్, ప్రధాన కార్యదర్శి గోరంక్ చంద్ర, కార్యదర్శి షేక్ హుస్సేన్, గౌరవ అతిథులుగా సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇటి. నరసిం హ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రవీంద్రచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్రంలో నేటి ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్లే కోట్లాది రూపాయల విలువైన భూదాన భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. 2012 సంవత్సరం నుండి నేటి వరకు భూదాన భూములను కాపాడాల్సిన భూదాన యజ్ఞబోర్డు ‘కంచె చేను మేసిన’ చందంగా కొల్లగొట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో దాతలు దానం చేసిన విలువైన భూదాన భూములు వక్రమార్గంలో రియల్టర్ల గుప్పిట్లోకి వెళ్లాయని అయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి గతంలో బోర్డు ప్రతినిధులు చేసిన అక్రమాలను లోతుగా విచారించి కఠిన చర్యలు తీసుకొని, భూదాన్ భూముల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి తిరిగి స్వాధీనం చేసుకొని భూమిలేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించక పోతే తామే స్వయంగా భూదాన భూముల కబ్జాదారులతో పోరాడి రక్షించుకుని పేదలకు పంచుతామని చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. చందన్ పాల్ మాట్లాడుతూ సర్వ సేవా సంఘ్ సూచించిన వ్యక్తులను భూదాన బోర్డుకు కమిటీ ప్రతినిధులుగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నియమించాలని ఆచార్య వినోభాబావే లిఖిత పూర్వకంగా సూచించారని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఆనవాయితీకి భిన్నంగా సర్వ సేవా సంఘ్‌తో సంబంధంలేని వ్యక్తులను, చైర్మన్, బోర్డు సభ్యులుగా నియమించారని, వారు వేలకోట్ల రూపాయల విలువైన భూదాన భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించి అమ్ముకున్నారని విమర్శించారు. గోరంక్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో భూదాన భూములను పరిరక్షించాల్సిన భూదాన బోర్డు ప్రతినిధులే రియల్టర్ల అవతారమెత్తడం శోచనీయమన్నారు. విలువైన భూదాన్ భూములను రక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఈ భూముల్లో జరిగిన అక్రమాల చిట్టాపై ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, తిరిగి స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచాలని గోరంక్ చంద్ర కోరారు. షేక్ హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన వందల ఎకరాల భూదాన భూములను ప్రభుత్వం వెంటనే రక్షించి ఆచార్య వినోబా బావే ఆశయాల ప్రకారం భూమిలేని నిరుపేదలకు కేటాయించాలని కోరారు. ఇటి. నరసింహ మాట్లాడుతూ వినోబా భావే ఆశయాలకు ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూదాన భూములు తెలంగాణ సమాజానికి, ప్రజలకు చెందినవని, ఈ భూములను పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేసి స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచుతామని నరసింహ తెలిపారు. రవీంద్రచారి మాట్లాడుతూ భూదాన భూములను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని, రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోనే భారీగా భూదాన భూఅక్రమాలు జరిగాయని తెలిపారు. అధ్యక్షత వహించిన ఆర్.శంకర్ నాయక్ మాట్లాడుతూ భూదాన భూముల రక్షణ కోసం గత ముప్పు ఏళ్ళుగా పోరాటాలు చేస్తున్నానని, ఈ భూములు పేద ప్రజలకు దక్కేవరకు పోరాటాలు, కొనసాగిస్తామన్నారు. భూదాన్ ఉద్యమంలో భాగంగా ఆచార్య వినోబా భావే తెలంగాణలో సేకరించిన లక్ష ఎకరాలకు పైగా భూముల్లో సింహభాగం అన్యాక్రాంతమయ్యాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సర్వ సేవ సంఘ్ సిఫారసు మేరకు తెలంగాణ భూదాన యజ్ఞ బోర్డుకు నూతన పాలకవర్గాన్ని నియమించాలని శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సదస్సులో సర్వోదయ మండలి తెలంగాణ నేతలు బి.యాదయ్య, ఎస్.యాదయ్య, అమీనా, శక్రి బాయి, షేక్ మహమూద్, గౌస్, సిపిఐ నగర నేతలు కమతం యాదగిరి, ఆర్.బాల కృష్ణ, ఇన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
కబ్జాదారులపై ఉక్కుపాదం
RELATED ARTICLES