HomeNewsBreaking Newsకబుర్లేనా.. నిధుల్లేవా?

కబుర్లేనా.. నిధుల్లేవా?

సిఎంలతో తాజా వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని పాతపాటే
కరోనాను ఎదుర్కోవడంలో ‘మీరు సూపర్‌’ అంటూ మోడీ ప్రశంసలు
రుణాల రీషెడ్యూల్‌, రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై మౌనం
సమతుల వ్యూహం అమలుకు కృషి చేయాలని సూచన
లాక్‌డౌన్‌ పొడిగించాలని, ఇప్పుడే రైళ్లు వద్దని పలువురు సిఎంల వినతి

న్యూఢిల్లీ : కరోనా తాజా పరిస్థితులు, లాక్‌డౌన్‌ పరిణామా లు, ఆర్థిక వ్యవస్థ వంటి అం శాలపై మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వైఖరిలో ఏ మాత్రం మార్పు కనబర్చలేదు. కరోనా కట్టడి చర్యలు అద్భుతమంటూ సిఎంలను ప్రశంసించారే తప్ప వారికి న్యాయబద్ధంగా అం దాల్సిన నిధులు, వారి డిమాండ్ల పట్ల ఏ మాత్రం స్పందించలేదు. ఈ కాన్ఫరెన్స్‌ పట్ల దాదాపు సిఎంలంతా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమకు మెడికల్‌ కిట్లు సైతం కావాలంటూ కొన్ని రాష్ట్రాలు కోరడం గమనార్హం. రాష్ట్రాలకు ఇదివరకు ఇచ్చిన అప్పులను రీషెడ్యూల్‌ చేయాలని, కష్టకాలంలో రాష్ట్రాలను ఆదుకునేందదుకు నిధులు కావాలని కొందరు ముఖ్యమంత్రులు కోరారు. ఇవన్నీ మౌనంగా విన్న మోడీ పెద్దగా స్పందించకపోగా, చితికిన ఆర్థిక వ్యవస్థపై కన్నీరు కార్చారు. కాకపోతే, కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్‌డౌన్‌ను క్రమేపీ సడలించాల్సిన అవసరం వుందని ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను సూచించారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడడంలో యావత్‌ ప్రపంచం నేడు మనల్ని ప్రశంసిస్తోందని, ఈ పోరాటంలో ప్రధాన పాత్రను రాష్ట్ర ప్రభుత్వాలే పోషించాయని పొడిగారు. రాష్ట్రాలు తమ బాధ్యతలేమిటో గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరించాయని అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కరోనాను అదుపు చేసేందుకు తులనాత్మక వ్యూహాన్ని అనుసరించడానికి ముఖ్యమంత్రులు కృషి చేయాలని కోరారు. వలస కార్మికులు సురక్షితంగా ఇంటికి చేరేలా సాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుడి సహజ లక్షణం అని పేర్కొన్నారు. వలస కార్మికుల తరలింపు ప్రక్రియలో రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ సహకరించుకోవాలని కోరారు. అదే సమయంలో కరోనా వైరస్‌ గ్రామాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. ఏ ప్రాంతంలోనైనా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని మనం పదే పదే అప్రమత్తం చేస్తూ వచ్చామని, అయితే ఇంటికి వెళ్లాలని కోరుకుకోవడం మానవుని సహజ లక్షణమని, అందుకే మన నిర్ణయాలను కొంతమేర మార్చుకున్నామని గుర్తు చేశారు. ఆరోగ్య సేతు యాప్‌ ఆవశ్యకతను వివరిస్తూ.. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రజలను కార్యోన్ముఖుల్ని చేయాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుమారు ఎనిమిది గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఏప్రిల్‌ 27న జరిగిన సమావేశంలో అనేక అంశాలను ప్రధాని ముందు ప్రస్తావించే అవకాశం లభించలేదని కొందరు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పొడిగించాలని పలు రాష్ట్రాలు ప్రధాని నరేంద్రమోడీని కోరాయి. లాక్‌డౌన్‌ పొడిగించాలని కోరిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించ వద్దని, రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్‌ చేయడం సాధ్యం కాదని, దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నందున ఇప్పుడిప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేలా లేదని, దానితో కలిసి బతకడం తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోరారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కంటైన్మెంట్‌ వ్యూహాలపై పూర్తిగా పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కోరారు. కంటైన్‌మెంట్‌ కారణంగా ఆర్థికలావాదేవీలకు ఇబ్బంది నెలకొందని, దీనిలో మార్పులు చేయాలని, ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించుకొనేలా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో క్లినిక్‌లను బలోపేతం చేసుకోవాలని జగన్‌ చెప్పారు. బీహార్‌లో లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు పొడిగిస్తామని, ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున బీహార్‌కు వస్తారని, అదేజరిగితే, కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రానికి అత్యవసరంగా ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్స్‌ అవసరం ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి చెప్పారు. అదే విధంగా రాష్ట్రానికి రూ.3వేల కోట్ల విలువైన మెడికల్‌ పరికరాలు కావాలని, అదే విధంగా వలస కూలీలను తరలించేందుకు మరో రూ.2,500కోట్లు అవసరమన్నారు. మే 31 వరకూ చెన్నైకు రైళ్లు, విమాన రాకపోకలు అనుమతించవద్దని కోరారు. దేశంలో సమాఖ్య వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిందిగా పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ కోరారు. అమిత్‌ షా, ఇతర అధికారులు రాసిన లేఖలు బెంగాల్‌ ప్రభుత్వానికి అందకముందే మీడియా చేరుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. బెంగాల్‌ పట్ల రాజకీయాలు చేయడం ఆపాలని, కరోనాపై రాష్ట్రం పోరాడుతున్న ఈ సమయంలో కేంద్రం రాజకీయాలు చేయడం తగదని ఆమె హితవు పలికారు

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments