కన్నీటి సుడి

స్టాక్‌ మార్కెట్ల చారిత్రక పతనం
2008 తర్వాత భారీగా కుప్పకూలిన స్టాకులు
నిఫ్టీ 50, సెన్సెక్స్‌ 8 శాతానికిపైగా కుదేలు
దెబ్బతీసిన కరోనా
మరింత ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
ముంబయి: కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం మార్కెట్‌పై అనూహ్యమైన రీతిలో పడింది. స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మహా పతనాన్ని భారత్‌ చవిచూసింది. రూ.11 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ఈ పరిస్థితి అగ్రరాజ్యం అమెరికాను సైతం వదిలిపెట్టలేదు. ఒక్కరోజులోనే అమెరికా స్టాక్‌వ్యవస్థ ‘డౌజాన్‌’ 8.85 శాతం అంటే 2,083.44 పాయింట్లు పతనమైంది. కరోనా కబళించిన చైనా కట్టుదిట్టమైన చర్యలతో కోలుకునే దిశగా పయనిస్తుంటే, అమెరికా, ఇతర పశ్చిమదేశాలు, అలాగే వాటిని నమ్ముకున్న భారత్‌ మాత్రం ప్రమాదంలో పడ్డాయి. ఈ పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశాలే ఎక్కువగావుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదంలో పడనుందని ఆర్థిక విశ్లేషకులు చెపుతున్నారు. మదుపరులు భయపడుతున్నట్లుగానే, భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం భల్లూకం గుప్పిట్లోకి(బేర్‌ టెరిటరీలోకి) జారుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ వ్యాప్తి చెందుతుండడం, కరోనావైరస్‌ను అడ్డుకునేందుకు వచ్చే 30 రోజులపాటు యూకె సహా అన్ని యూరప్‌ దేశాలకు రాకపోకలు నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడం, తదితరాలు ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మాంద్యం భయాలను సృష్టిస్తోంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజికి చెందిన నిఫ్టీ 50 సూచీ 8.3 శాతం పతనమై 9,590.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. దాదాపు 2.5 సంవత్సరాల కనిష్ఠానికి జారుకుంది. ఇక బిఎస్‌ఇ సెన్సెక్స్‌ సూచీ 8 శాతం పతనమై 32, 778. 14 పాయింట్ల వద్ద స్థిరపడింది. భారత స్టాకు మార్కెట్లు 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంతలా పడిపోవడం అన్నది ఇప్పుడే. వైరస్‌ భయాలకు తోడు, చమురు ధరలు, భారత ఆర్థికవ్యవస్థ మందగమనం కూడా మార్కెట్‌ పడిపోవడానికి కారణమైంది.
దలాల్‌స్ట్రీట్‌లో మదుపరుల సంపద ఒక్క రోజునే రూ. 11,27,160.65 కోట్లు ఆవిరైపోయాయి. బిఎస్‌ఇ మొత్తం మార్కెట్‌ మూలధనం రూ. 1,25,86,398.07 కోట్లకు తగ్గిపోయింది. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ మూలధనం బుధవారం రూ. 1,37,13,558.72గా ఉంది. ‘మోడీనామిక్స్‌’లో దేశం బ్యాంకింగ్‌ సంక్షోభం, తక్కువ ఆర్థిక వృద్ధి, అత్యధిక ద్రవ్యోల్బణం, అత్యధిక నిరుద్యోగం వంటి వివిధ సమస్యలను ఎదుర్కొంటోంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ చెత్తగా ఉంది. టెలికామ్‌ సంస్థలు ఎజిఆర్‌ సమస్యను ఎదుర్కొంటున్నాయి. టెక్నికల్‌గా చెప్పాలంటే భారత స్టాక్‌ మార్కెట్లు మద్దతు స్థాయిన దాటి బేర్‌ టెరిటరీలోకి జారిపోయాయి. నిఫ్టీ పిఇ విలువయితే ఇప్పటికే బబుల్‌ జోన్‌కు చేరుకుంది. 28వద్ద తిరుగాడుతోంది. నిఫ్టీ త్వరలో 28 నుంచి 15 శాతం మధ్యకు చేరుకునే అవకాశం కనబడుతోంది. భారత విఐఎక్స్‌ సూచీ అయితే 30.45 శాతం లేక 9.6075 పాయింట్లు పెరిగి 41.1625వద్ద నిలిచింది. విఐఎక్స్‌ పెరిగితే మార్కెట్‌లో స్టాకులు పతనమవుతుంటాయి. ట్రంప్‌ ప్రకటన తర్వాత చమురు ధరలు 6 శాతం పతనమయ్యాయి. 2015 ఫిబ్రవరి తర్వాత భారీగా పతనం కావడం ఇప్పుడే. ట్రంప్‌ ప్రకటనతో ప్రపంచ మార్కెట్‌ ఈక్విటీలు కూడా భారీగా పతనమయ్యాయి. అమెరికాలో వాల్‌స్ట్రీట్‌లో 7 శాతం పతనమయ్యాక ట్రేడింగ్‌ను గురువారం 15 నిమిషాలపాటు ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ ట్రేడింగ్‌ను నిర్వహించారు. కానీ బేర్‌ మార్కెట్‌లోకి జారుకుంది. అమెరికా మార్కెట్లు బేరిష్‌గా మారడం ప్రపంచ మార్కెట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
‘మనం షేకీ ఎకనామీలో ఉన్నాం. 2019 డిసెంబర్‌లోనే బాటమ్‌కు చేరుకున్నాం అనుకున్నాం. కానీ నిఫ్టీ 8,800 అడుగుకు పోయే అవకాశం కనబడుతోంది’ అని మార్కెట్‌ నిపుణుడు అజయ్‌ బగ్గా చెప్పారు. ‘వచ్చే వారం బౌన్స్‌ బ్యాక్‌ జరగొచ్చన ఆశ కూడా అడుగంటింది, వచ్చే త్రైమాసికంలో కార్పొరేట్‌ ఫలితాలు మరింత దారుణంగా ఉండొచ్చు’ అని కూడా ఆయన తెలిపారు. అన్ని రంగాల షేర్లు అమ్మకానికి గురయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 8శాతానికి పడిపోగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 10 శాతానికి పడిపోయింది. నిఫ్టీలో యెస్‌ బ్యాంక్‌ 13 శాతం పతనమై టాప్‌ లూజర్‌గా నిలిచింది. యుపిఎల్‌, వేదాంత, హిందాల్కో, టాటామోటార్స్‌, గ్రాసిం ఇండస్ట్రీస్‌, అదని పోర్ట్‌, ఇండియన్‌ ఆయిల్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. అవి దాదాపు 10 శాతం నుంచి 12.95 శాతం వరకు పతనమయ్యాయి. ఇక సెన్సెక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, యాక్సిక్‌ బ్యాంక్‌, ఐటిసి బాగా నష్టపోయాయి. అవన్నీ కలిసి సెన్సెక్స్‌లో 1,800 పాయింట్లు పడగొట్టాయి. డాలరుతో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 49పైసలు పతనమై 74.17వద్ద ట్రేడయింది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ 5.50 శాతం పతనమై బ్యారల్‌ ధర 33.82 డాలర్లకు పడిపోయింది. ఆసియా మార్కెట్‌లో షాంఘై 1.52 శాతం, హాంకాంగ్‌ 3.66 శాతం, సియోల్‌ 3.87 శాతం, టోక్యో 4.41 శాతం మేరకు పతనమయ్యాయి. ఇక యూరొప్‌ మార్కెట్‌ అయితే 6 శాతం వరకు పతనమైంది.

DO YOU LIKE THIS ARTICLE?