ఆర్‌టిసి కార్మికుల సమ్మెతో స్తంభించిన ప్రజారవాణా వ్యవస్థ
ప్రభుత్వ ముగిసిన సర్కార్ డెడ్‌లైన్ .. విధుల్లో చేరని ఆర్‌టిసి కార్మికులు
డిమాండ్లు అంగీకరించే వరకు సమ్మె నుంచి తగ్గే ప్రసక్తే లేదు: ఆర్‌టిసి యూనియన్ల జెఎసి
ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరించిన ప్రభుత్వం
ఎంతమంది ఉద్యోగులను తీసేస్తారో మేమూ చూస్తాం : కార్మికులు
సమ్మె విరమిస్తే కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ
శనివారం ఉదయం ఉన్నతాధికారులతో చర్చించిన కెసిఆర్
ఆర్‌టిసికి ప్రత్యామ్నాయ విధానాన్ని ఖరారు చేస్తామని రవాణాశాఖ మంత్రి వెల్లడి
హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్‌టిసి కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతున్నది. సమ్మె కారణంగా ఎక్కడి బస్సు లు అక్కడే ఆగిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆర్‌టిసి కార్మికుల సమ్మె కొనసాగుతుండడంతో అన్ని జిల్లాలో వేలాది బస్సు లు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయి ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్, సికింద్రాబాద్‌లోని జెబిఎస్‌లతో పాటు దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, పటాన్‌చెరువు తదితర బస్‌స్టేషన్లు, బస్టాండ్‌లు శనివా రం బస్సులు లేక బోసిపోయియాయి. హైదరాబాద్‌లో ఎంజిబిఎస్‌తో పాటు, పలు రాష్ట్రంలోని ప్రధాన నగరాల బస్‌స్టేషన్లలో విచారణ కౌంటర్లు మూతపడ్డాయి. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వేతన సవరణ, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో ఆర్‌టిసి కార్మిక సంఘాలు సమ్మె చేపట్టాయి. ఆర్‌టిసి ఉద్యోగులు, కార్మికులు శనివారం సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లో చేరాలని, విధుల్లో చేరని ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ఆర్‌టిసి కార్మికులు ఏమాత్రం తగ్గకుండా తమ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు డిపోలు, బస్‌స్టేషన్ల వద్ద, రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు చోట్ల ప్రైవేటు డ్రైవర్లతో నడుపుతున్న బస్సులను అడ్డుకునేందుకు ఆర్‌టిసి కార్మిక సంఘాలు ప్రయత్నించాయి. దీంతో కార్మిక సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల కార్మికుల సమ్మెకు సంఘీభావంగా విపక్షాలు కూడా ధర్నా చేశాయి. పోలీసుల భద్రత మధ్య ప్రైవేటు డ్రైవర్లతో పాక్షికంగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్‌టిసి బస్టాండ్లలో ప్రైవేటు వాహనాలకు పోలీసులు అనుమతినిస్తున్నారు.ఆర్‌టిసి జెఎసి నేతలు కె.రాజిరెడ్డి, ఇ.అశ్వద్ధామరెడ్డి, వి.ఎస్.రావుతో పాటు పలువురు నేతలు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ తదితర ప్రాంతాలను సందర్శించి సమ్మె జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెతో కార్మికులు నైతికంగా విజయం సాధించారని వారు ప్రకటించారు. అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి మాట్లాడుతూ సమ్మె విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని చెప్పారు. ఎంత మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తుందో తాము కూడా చూస్తామన్నారు. పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మరోవైపు, ప్రైవేట్ వాహనాలను నడిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వారు మండిపడ్డారు. ప్రైవేట్ వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్‌టిసి ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రైవేట్ వాహనాలను పెడుతున్నారని వారు ఆరోపించారు. శనివారం 6 గంటలల్లోగా విధులకు హాజరు కావాలని, లేనట్లయితే ఉద్యోగాలు ఊడుతాయని ప్రభుత్వం చేసిన హెచ్చరికను బేఖాతర్ చేసి, విధులకు హాజరు కాని కార్మికులు, ఉద్యోగులందరికీ నేతలు అభినందనలు తెలిపారు. ఇదే సమైక్య స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.
తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు
ఇదిలా ఉండగా, కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌టిసి అధికారులు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు బస్సు లు, ఇతర వాహనాలను నడుపుతున్నారు. ప్రైవేట్ బస్సులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపనున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రైవేటు డ్రైవర్లతో అద్దె బస్సులను నడిపిస్తున్నారు. పోలీసుల భద్రత మధ్య బస్సులను రోడ్డపైకి తీసుకొస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసుల పర్యవేక్షణలో బస్సులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ హకీంపేట డిపోలో 136 బస్సులు, హయత్‌నగర్ డిపోలో 139 బస్సులు నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులు 92బస్సులు నడుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
మూడు వేల బస్సులను నడిపిస్తున్నాం: ఆర్‌టిసి ఎండి
ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్‌టిసి ఇన్‌చార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ తెలిపారు. శనివారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 వేల బస్సులు తిరిగాయని, వాటిలో ఆర్‌టిసి బస్సులు 2129, అద్దె బస్సులు 1717, ప్రైవేట్ బస్సులు 1155 ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి 1195, మ్యాక్సీ క్యాబ్‌తో పాటు ఇతర వాహనాలు 2778 నడిచాయని ఆయన వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 850 బస్సులకు గాను 330, ఉమ్మడి వరంగల్‌లో 797 బస్సులకు గాను 345, ఉమ్మడి నల్లగొండలో 750 బస్సులకు గాను 164, ఉమ్మడి ఆదిలాబాద్‌లో 624 బస్సులకు గాను 250 బస్సులు రోడ్డెక్కినట్లు వివరించారు. ఉమ్మడి నిజామాబాద్‌లో 92, సంగారెడ్డి డిపోలనుంచి 50 శాతం బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమ్యస్థానాలు చేరేవేసేందుకు పాఠశాల బస్సులకు సైతం అధికారులు అనుమతినిచ్చారు.
ప్రైవేటీకరించే కుట్రతోనే ఆర్‌టిసిపై కక్ష సాధింపు: ఎంపి బండి సంజయ్
ఉద్దేశపూర్వకంగానే ఆర్‌టిసికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం, ప్రైవేటీకరించడం కుట్రలో భాగంగానే ఆర్‌టిసి కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఆర్‌టిసి నష్టాల్లోకి రావడానికి ప్రభుత్వమే కారణమని విమర్శించారు. సుదీర్ఘకాలం ఆర్‌టిసి కార్మికులు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, వారికి మద్దతుగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
కదలని చక్రం
RELATED ARTICLES