తీవ్రమైన పేదరికంలో మూడోవంతు మంది పిల్లలు
యునిసెఫ్ గ్లోబల్ రిపోర్ట్ వెల్లడి
ఐక్యరాజ్య సమితి: ప్రపంచంలో ప్రతి ఆరుగురు బాలల్లో ఒకరు తీవ్రమైన పేదరికంలో బతుకుతున్నారని ప్రపంచ బ్యాంకు బృందం, ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యునిసెఫ్) తాజా నివేదిక బయటపెట్టింది. ఈ సంఖ్య 35.6 కోట్లు ఉం టుంది. ఇది కోవిడ్ 19కు ముందున్న పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారేలా ఉందన్నది నివేదిక సారాంశం. ఈ నివేదిక ‘గ్లోబల్ ఎస్టిమేట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ మానిటరీ పావర్టీ: ఎన్ అప్‌డేట్’ శీర్షికన వెలువడింది. దీని మేరకు సామాజిక భద్రతా పరిధి పరిమితంగా ఉండే సబ్ సహారా ప్రాంతానికి చెందిన ఆఫ్రికా దేశాలలో రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదించేందుకూ ఇబ్బందిపడుతున్న కుటుంబాలకు చెందిన మూడింట రెండు వంతుల మంది పిల్ల లు తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్నారు. అదే దక్షిణాసియా విషయానికి వస్తే అయిదో వంతు పిల్లలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. రోజుకు 1.90 డాలర్లు సంపాదించ లేకపోవడం అనేది తీవ్రమైన పేదరికాన్ని సూచించేందుకు తీసుకుంటున్న అంతర్జాతీయ కొలమానం. అయితే 2013 2017 మధ్యకాలంలో తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్న బాలల సంఖ్య కొంతవరకు (2.9కోట్లు) తగ్గిందని ఈ విశ్లేషణ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఏదైనా పురోగతిని సాధించినప్పటికీ, మహమ్మారి ఆర్థిక ప్రభావం కారణంగా అది ‘మందగతిలో, అసమాన పంపిణీతో, భారంగా’ సాగుతోందని నివేదిక హెచ్చరించింది. ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరు తీవ్రమైన పేదరికంలో బతుకు వెళ్లదీస్తున్నారంటే, ఆరుగురిలో ఒకరు జీవించేందుకు పోరాడుతున్నట్లే అని యునిసెఫ్ కార్యక్రమాల డైరెక్టర్ సంజయ్ విజెశేఖర పేర్కొన్నారు. ఈ గణాంకాలు ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతి పరుస్తాయి. ఇక మహమ్మారి తెచ్చిన ఆర్థిక భారం తీవ్రతను చూస్తే, పరిస్థితులు మరింత దిగజారేలా ఉన్నాయి. అందుకని మరింతమంది పిల్లలు, వారి కుటుంబాలు ఇంతకుముందు ఎప్పుడూ చూడని పేదరిక స్థాయులకు పడిపోవడాన్ని నివారించేందుకు, ప్రభుత్వాలు సత్వరమే బాలల కోసం ఒక రికవరీ ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రపంచ జనాభాలో పిల్లల వాటా సుమారు మూడోవంతు ఉంటుంది. అదే తీవ్రమైన పేదరికం విషయానికి వస్తే పిల్లల సంఖ్య మొత్తం ప్రపంచ జనాభాలో సగం ఉంటుంది. ఇది తీవ్రమైన పేదరికాన్ని అనుభవిస్తున్న పెద్దల సంఖ్యకు రెండు రెట్ల కంటే ఎక్కువ. పేదరికం అనుభవిస్తున్న పిల్లల్లో 20% శాతం మంది 5 ఏళ్ల లోపువాళ్లే. వీరంతా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన తీవ్రమైన పేద కుటుంబాల పిల్లలే అని నివేదిక ఎత్తిచూపింది. ‘ప్రతి ఆరుగురు బాలల్లో ఒకరు తీవ్రమైన పేదరికంలో గడుపుతున్నారు. అంటే ప్రపంచంలోని అత్యంత పేదల్లో 50% బాలలే ఉన్నారు. ఇది కోవిడ్ 19కు ముందు పరిస్థితి. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది’ అని ప్రపంచ బ్యాంకు పావర్టీ అండ్ ఈక్విటీ గ్లోబల్ డైరెక్టర్ కరోలినా శాంచెజ్ పారమో అన్నారు. తీవ్రమైన పేదరికం కోట్లాది మంది పిల్లలు భౌతిక, ఆలోచనాత్మక అభివృద్ధికి సంబంధించి వారి సామర్థ్యం మేరకు ఎదగకుండా అడ్డుకుంటుంది. వారు పెద్దయ్యాక మంచి ఉద్యోగాలు పొందే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా భారీ ఆర్థిక విధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పేద కుటుంబాలకు అండగా నిలిచి, కోలుకునే సమయంలో వారి మానవ సామర్థ్యాన్ని పునర్నిర్మించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఆమె అన్నారు. పెద్దల్లో తగ్గిన స్థాయిలో తీవ్రమైన పేదరికం పిల్లల్లో తగ్గలేదు. 2013తో పోల్చితే 2017లో ప్రపంచ పేదల్లో పిల్లల వాటా ఎక్కువగా ఉంది. ఒక్క సబ్ సహారన్ ఆఫ్రికా మినహా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలూ తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్న పిల్లల సంఖ్యలో వివిధ స్థాయుల్లో తగ్గుదలను చూస్తున్నాయి. సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలో 2013 తో పోల్చితే 2017లో తీవ్రమైన పేదరికంలో ఉన్న పిల్లల సంఖ్య 17 కోట్ల నుంచి 23.4 కోట్లకు 6.4 కోట్లు పెరిగింది. ఈ పిల్లలు అందరూ రోజుకు 1.90 డాలర్లతోనే జీవితం సరిపెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నారు. బలహీనమైన, యుద్ధ ప్రభావిత దేశాలకు చెందిన పిల్లల్లో పేదరికం మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ ప్రాంతాల్లో 40% మంది పిల్లలు తీవ్రమైన పేద కుటుంబాల్లో జీవిస్తున్నారు. అదే వేరే దేశాల్లో ఈ సంఖ్య 15% అని విశ్లేషణ పేర్కొంది. తీవ్రమైన పేదరికంలో ఉన్న పిల్లల్లో 70% కంటే ఎక్కువ మంది కుటుంబ పెద్దలు పొలాల్లోనో లేదా పశువుల పాలనలో ఉన్నవాళ్లేనని అది వెల్లడించింది. పిల్లలు, మహిళలు, బాలికల మీద దుష్ప్రభావాన్ని చూపేలా ప్రస్తుత కోవిడ్ 19 సంక్షోభం కొనసాగుతోంది. దీంతో లైంగిక సమానత్వం దిశగా ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రయోజనాలను తిరగబెట్టే ముప్పు పొంచి ఉంది. అందుకని కోవిడ్ సమయంలోనూ, ఆ తర్వాతా కూడా కోలుకునేందుకు చేపట్టే చర్యల్లో పేదలు, ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వారి స్థితిగతులను మెరుగుపరచడంలో భారీ సామాజిక రక్షణ కీలక పాత్ర పోషించనుందని నివేదిక స్పష్టం చేసింది.
సామాజిక భద్రతా కార్యక్రమాలు, ప్రత్యేకించి మానవ వనరులకు దీర్ఘకాలంలో పెట్టుబడులకు వేదికగా నిలిచే నగదు బదిలీ లాంటివాటిని విస్తరించడం ద్వారా చాలా దేశాలు కోవిడ్ సంక్షోభానికి స్పందించాయని ప్రపంచ బ్యాంకు, యునిసెఫ్ విడుదల చేసిన సమాచారం వెల్లడించింది. అయితే ఇవి స్వల్ప కాలికమైనవే తప్ప దీర్ఘ కాలికమైనవి కాదని నివేదిక పేర్కొంది.
భవిష్యత్ ప్రమాదాలను ఎదుర్కోవడంతో పాటు, ఆర్థిక సుస్థిరతకు కొత్త ఆవిష్కరణలు, న్యాయ, సంస్థాగత కార్యకలాపాలు, మానవ వనరుల సంరక్షణ, దీర్ఘకాలికంగా నిలిచిపోయేలా బాలలు, కుటుంబాలకు ప్రయోజనాలు కల్పించడం, కుటుంబ సభ్యులకు వేతనంతో కూడిన సెలవులు, పిల్లలందరికీ నాణ్యమైన సంరక్షణకు హామీ ఇవ్వడం లాంటి సామాజిక భద్రతా వ్యవస్థలు, కార్యక్రమాలను రూపొందించుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండటం ఎంతో ప్రధానమైన అంశమని నివేదిక గుర్తుచేసింది.
కటిక దారిద్య్రం.. బతుకు బాల్యం!
RELATED ARTICLES