ఒక్కరోజే 853 మంది మృతి!

భారత్‌లో 17లక్షలు దాటిన కరోనా కేసులు, 37వేల మరణాలు
24 గంటల్లో 51వేల మంది రికవరీ, కొత్తగా 54వేల కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. వరుసగా 5వ రోజు కూడా 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం నాటికి 17 లక్షల మార్క్‌ ను దాటాయి. రెండు రోజుల క్రితమే 16 లక్షల మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. రికవరీ కేసుల సంఖ్య 11 లక్షల మార్క్‌ను దాటింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచిన 24గంటల్లో కొత్తగా 54,735 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఆదివారం నాటికి మొత్తం బాధితుల సంఖ్య 17,50,723 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కాగా, దేశంలో వైరస్‌ సోకి మరణిస్తున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా నిత్యం 700ల కు పైగా నమోదవుతున్న మరణాల సంఖ్య, తాజాగా 800 మా ర్కును దాటింది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 853 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్‌తో మరణించిన వారిసంఖ్య 37,364కు చేరింది. ప్రస్తుతం దేశంలో 5,67,370 యాక్టివ్‌ కేసులు ఉండగా, 11,45,629 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 51,225 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. అప్పటి వరకు ఇదే గరిష్టం. మొత్తం రికవరీ కేసుల్లో యాక్టివ్‌ కేసులకంటే 5,77,899 అధికంగా ఉన్నాయి. రికవరీ రేటు 65.44గా ఉండగా, మరణాల రేటు 2.13కు పడిపోయింది. ఇప్పటి వరకు మొత్తంగా 1,98,21,831 నమూనాలకు పరీక్షలు నివహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) స్పష్టం చేసింది. ఈనెల 1న ఒక్క రోజే రికార్డుస్థాయిలో 4,63,172 పరీక్షలు నిర్వహించినట్లు చెప్పింది. కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను భారత ప్రభుత్వం పెంచింది. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 4నుంచి 5లక్షల శాంపిళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య రెండు కోట్లకు చేరువలో ఉంది.
మహారాష్ట్రలో మృత్యుకేళి: దేశంలో సంభవిస్తో న్న కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడులోనేచోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో వరుసగా రెండోరోజూ రికార్డుస్థాయిలో మరణాలు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 322 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందురోజు కూడా 265 మంది మృతువాతపడ్డారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 15,316కు చేరింది. తమిళనాడులోనూ ఒక్కరోజే 99మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4,304 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే, ప్రపంచంలో కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది. కరోనా కేసుల్లో మాత్రం మూడో స్థానంలో ఉంది. జాన్స్‌హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. మరణాల సంఖ్య అధికంగా ఉన్న తొలి ఐదు దేశాలను పరిశీలిస్తే అమెరికా మరణాల సంఖ్య 1,54,361 కాగా, బ్రెజిల్‌లో 93,563, మెక్సికోలో 47,472, బ్రిటన్‌లో 46,278, భారత్‌లో 37,364గా ఉంది.
కోవిడ్‌ పేషెంట్లకు స్మార్ట్‌ ఫోన్లను అనుమతించండి
ఆసుపత్రి పాలయిన కొవిడ్‌ పేషెంట్లు స్మార్మ్‌ఫోన్లు, ట్యాబ్‌లు వాడేందుకు మానవతా దృక్పథంతో అనుమతించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదివారంనాడు కోరింది. ఇందువల్ల కొవిడ్‌ పేషెంట్లు తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో మాట్లాడేందుకు, మానసికంగా స్వాంతన పొందేందుకు వీలవుతుందని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాల హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ (డిజిహెచ్‌ఎస్‌) ఒక లేఖలో కోరింది. పేషెంట్లు, వారి కుటుంబ సభ్యుల మధ్య సమాచారం పంచుకునేందుకు వీలుగా ఆసుపత్రులలో సిబ్బంది ప్రోటోకాల్‌ ప్రకారం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను డిస్‌ఇన్‌ఫెక్టింగ్‌ చేసేలా చూడాలని డిజిహెచ్‌ఎస్‌ కోరింది. వివిధ ఆసుపత్రుల్లోని కొవిడ్‌ వార్డులు, ఐసియుల్లో చేరిన పేషెంట్ల సైకలాజికల్‌ అవసరాలను ప్రభుత్వం యంత్రాంగం, వైద్య బృందాలు బాధ్యతగా తీసుకోవాలని సూచించింది.

DO YOU LIKE THIS ARTICLE?