ఒక్కరోజే 28,637

భారత్‌లో నమోదైన కేసుల సంఖ్య
24 గంటల్లో 551 మరణాలు
మహారాష్ట్రలో 10వేలు దాటిన కొవిడ్‌ మరణాలు
న్యూఢిల్ల్లీ: కరోనా కోరల్లో భారత్‌ చిక్కుకుంది. దేశంలో ఈ మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. గత కొన్నిరోజులుగా నిత్యం 25వేలకుపైగా రికార్డుస్థాయి కేసులతో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 28,637 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 8,49,553కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. 24 గంటల్లో 551మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదివారం ఉదయానికి కొవిడ్‌తో మరణించిన వారిసంఖ్య 22,674గా నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 5,34,621 మంది కోలుకోగా మరో 2,92,258 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 19,235 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.78శాతంగా ఉండటం ఉపశమనం కలిగించే విషయం. కరోనా వైరస్‌ను కట్టడిచేయడంలో భాగంగా దేశంలో పలుచోట్ల మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నారు.
మహారాష్ట్రలో 10వేల మరణాలు..
కరోనా వైరస్‌ ఉద్ధృతి మహారాష్ట్రలో కొనసాగుతూనే ఉంది. అత్యధిక కేసులు, మరణాలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. నిత్యం రాష్ట్రంలో కొత్తగా 7వేలకుపైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 8139 పాజిటివ్‌ కేసులు, 223 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,46,600కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 10,116 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో సంభవిస్తోన్న కొవి్‌డ మరణాల్లో దాదాపు 44శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
తమిళనాడు, ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్ధృతి
మహారాష్ట్ర అనంతరం అత్యధిక కేసులు తమిళనాడులో నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజాగా 3965 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,34,226కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1898 మంది మృత్యువాతపడ్డారు. ఇక దేశ రాజధానిలోనూ 1781కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,921గా నమోదైంది. ఢిల్లీలో ఇప్పటివరకు 3334 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కర్నాటకలో ఒకేరోజు 70 మంది మృతి
కర్నాటకలో కొవిడ్‌ విధ్వంసానికి అంతులేకుండా పోతోంది. శనివారం ఒకేరోజులో 70 మంది కరోనా కోరలకు బలి అయ్యారు. మరో 2,798 మంది కరోనా బారిన పడ్డారు. అన్ని జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు తేలాయి. పర్యాటక మంత్రి సిటి రవికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 36,216కు ఎగబాకాయి. మరణాలు 613ను చేరాయి. 880 మంది డిశ్చార్జ్‌ కోవిడ్‌ నుంచి కోలుకుని 880 మంది రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జ్‌లు మొత్తం 14,716కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 20,883 యాక్టివ్‌ కేసులు ఉండగా అందులో 504 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మరోమారు లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం రెండు వేలకు పైగా, బెంగళూరులో సగటున వెయ్యి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోమారు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. జులై 14 నుంచి వారం రోజుల పాటు బెంగళూరు నగరం, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలుచేస్తారు. అత్యవసర సేవలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 2,798 కేసులు నమోదయ్యాయి. 70మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,216కు చేరగా, మృతుల సంఖ్య 613కు పెరిగింది.
యుపిలో వారాంతాల్లో కార్యాలయాలు, మార్కెట్ల మూసివేత
కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి శనివారం, ఆదివారం రాష్ట్రంలోని కార్యాలయాలు, మార్కెట్లను మూసివేయాలని నిర్ణయించింది. అయితే బ్యాంకులు, ఇతర పారిశ్రామిక విభాగాలకు ఈ నిబంధన వర్తించదు. ఉత్తర ప్రదేశ్‌ హోం శాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ అవనీశ్‌ అవస్థి మాట్లాడుతూ, కొవిడ్‌ మహమ్మారిని నిరోధించేందుకు ప్రతి శనివారం, ఆదివారం రాష్ట్రంలోని కార్యాలయాలు, మార్కెట్లను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కర్మాగారాలు కార్యకలాపాలు నిర్వహించవచ్చునని, నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలను కూడా అనుమతిస్తామని తెలిపారు. ఆరోగ్య శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు పారిశుద్ధ్య కార్యక్రమాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, శానిటైజేషన్‌ నిర్వహిస్తాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వారంలో 5 రోజులు మాత్రమే పని చేస్తాయన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించినట్లు చెప్పారు.ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం సోమవారం వరకు 55 గంటల అష్ట దిగ్బంధనం అమల్లో ఉంది. నిత్యావసరాలు, కొన్ని ఇతర సేవలు మినహా మిగిలినవాటిని మూసివేశారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఈ ఆంక్షలను తొలగిస్తారు.

DO YOU LIKE THIS ARTICLE?