ముంబయి : ఐపిఎల్ 2018 సీజన్ క్రికెట్ టోర్నమెంటులో పాల్గొనే ఆటగాళ్ల అమ్మకాలు విపరీతమైన రేట్లలో సాగుతోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏకంగా రూ. 8.4 కోట్లకు అమ్ముడుపోయాడు. కేవలం 20 లక్షల రూపాయల బేస్‌ప్రైస్ మాత్రమే కలిగివున్న వరుణ్ ను కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. జయదేవ్ ఉనాద్కట్ కూడా ఇంతే మొత్తానికి అమ్ముడుపోయాడు. ఉనాద్కట్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అతని బేస్‌ప్రైస్ రూ. 1.5 కోట్లు మాత్రమే. ఈ సీజన్లో ఇప్పటివరకు వరుణ్, ఉనాద్కట్లదే ఐపిఎల్ రికార్డు. విదేశీ ఆటగాళ్లకు కూడా మంచి ధర పలికింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ శామ్ కుర్రన్‌ను రూ. 7.2 కోట్లకు కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్టు, అలాగే, దక్షిణాఫ్రికా ఆటగాడు కొలిన్ ఇన్ గ్రామ్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.4 కోట్లకు కొనుగోలు చేసింది. కేవలం 20 లక్షల రూపాయల బేస్‌ప్రైస్ మాత్రమే కలిగివున్నమరో ఆటగాడు శివమ్ దూబేను 5 కోట్ల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సిబి) కొనుగోలు చేసింది. మొహిత్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు, వరుణ్ ఆరాన్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 2.4 కోట్లకు, పేసర్ మహమ్మద్ షమీని పంజాబ్ ఎలెవన్ కింగ్స్ రూ. 4.8 కోట్లకు, లంక బౌలర్ లసిత్ మలింగను ముంబయి ఇండియన్స్ రూ. 2 కోట్లకు, ఇషాంత్ శర్మను 1.1 కోట్ల రూపాయలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.