ముంబయి: భారత్‌లో కరోనా కేసులు అధికమైతే ఐపీఎల్-13వ సీజన్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 415 కేసులు నమోదు కాగా ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో రెండు, మూడు వారాలు ఎంతో కీలకమైన సమయం కాబట్టి ఈ సీజన్ మరింత ఆలస్యమైనా ఆశ్చర్యంలేదు. అయితే, ఈనెలాఖరు నాటికి బీసీసీఐ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఒకవేళ పరిస్థితి చేయిదాటిపోతే ఐపీఎల్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఆదివారం 82 అత్యయిక జిల్లాలను ప్రకటించిన కేంద్రం సోమవారం ఉదయం అన్ని రాష్ట్రాలను లాక్‌డౌన్ పాటించాలని ఆదేశించింది. ప్రజల ఆరోగ్య భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొంది. అలాగే ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించింది. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఐపీఎల్ నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో బోర్డు సమావేశం కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ కార్యాలయం మూసివేయగా ఈ సమావేశంపై సందేహం నెలకొంది. అయితే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఐపిఎల్ రద్దు తప్పదా!
RELATED ARTICLES