ముంబయి : కరోనా వ్యాధి భయం ఉన్నా ఈ ఏడాది భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొనసాగుతుందని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌లో ఐపిఎల్ టి20 టోర్నమెంట్ కొనసాగుతుందా లేదా అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే బోర్డు అధ్యక్షుడు ఈ అనుమానాలను కొట్టి పారేశాడు. ఐపిఎల్ యథావిథిగా కొనసాగుతుందన్నాడు. వ్యాధి ప్రభావం ఐపిఎల్‌పై ఉండదన్నాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో గంగూలీ ఈ విషయం స్పష్టం చేశాడు. ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్‌ను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించాడు. టోర్నీలో పాల్గొనే క్రికెటర్లకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా పకడ్భంది ఏర్పాట్లు చేస్తున్నామన్నాడు. ప్రతి క్రికెటర్‌కు పూర్తి భద్రత ఉంటుందన్నాడు. వ్యాధి బారీన పడకుండా క్రికెటర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నాడు. ఇక, బిసిసిఐ, ఐపిఎల్ నిర్వహణ కమిటీ సమన్వయంతో ముందుకు సాగి టోర్నీని జయప్రదంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నాడు. ఇదిలావుండగా త్వరలో ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మమైన ఐపిఎల్ టోర్నీ కోసం ప్రభుత్వం ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు సూచించిందన్నాడు. దాన్ని ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలకు, హోటళ్ల నిర్వాహకులకు, మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు చేరవేస్తామన్నాడు. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఐపిఎల్‌ను సజావుగా నిర్వహించడం కష్టమేమి కాదన్నాడు. అయితే ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వ్యాధి నేపథ్యంలో క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గంగూలీ స్పష్టం చేశాడు. ఇదిలావుండగా టోర్నీలో పాల్గొనే క్రికెటర్లు సెల్ఫీలు, కరచాలనలకు దూరంగా ఉండాలన్నాడు. అంతేగాక మాస్క్‌లు ధరించి ఉండాలని సూచించాడు. కాగా, ఐపిఎల్‌పై కరోనా ప్రభావం ఉంటుందని తాను భావించడం లేదని, గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఇది విజయవంతం కావడం ఖాయమని గంగూలీ జోస్యం చెప్పాడు.
ఐపిఎల్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు: గంగూలీ
RELATED ARTICLES