సిద్దిపేట, నాగర్‌కర్నూల్, జనగామ, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్
గత 14 రోజులుగా ఈ జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాని వైనం
త్వరలో మరో 8 జిల్లాలు కూడా..
జిహెచ్‌ఎంసి పరిధిలో, సూర్యాపేటలో కరోనా కలవరం
సూర్యాపేటకు ప్రత్యేకాధికారి వేణుగోపాల్‌రెడ్డి నియామకం
ప్రజాపక్షం/హైదరాబాద్ : ప్రతి రోజు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తున్న సమయంలో రాష్ట్ర వాసులకు ఇది కొంచం ఊరటను కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలోని 7 జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చినట్లు సమాచారం. అందులో సిద్దిపేట, నాగర్ కర్నూల్, జనగామ, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. గత 14 రోజులుగా ఈ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఈ ఏడు జిల్లాలు గ్రీన్ జోన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఈ జిల్లాలో కరోనా బారినపడిన బాధితులు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవడంతో గ్రీన్ జోన్‌లోకి వెళ్లాయి. ముందుగా జనగామ జిల్లాలో రెండు కేసులు నమోదు అయినప్పటికీ, వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఆ తరువాత ఆ జిల్లాలో రెండు వారాలుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కొత్తగూడెం జిల్లాలో కరోనా వైరస్ బారిన పడిన పోలీసు అధికారి, అతడి కుమారుడు పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ జిల్లాలోనూ ప్రస్తుతం ఎలాంటి కేసులు లేకపోవడం గమనార్హం. ఇక ఆరెంజ్ జోన్‌లోకి వచ్చేసరికి వరంగల్ అర్బన్, భూపాలపల్లి, సంగారెడ్డి, ఖమ్మం, నిర్మల్, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వారం రోజులుగా దాదాపుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మరోవారం ఇలాగే కొనసాగితే ఈ 8 జిల్లాలు కూడా గ్రీన్‌జోన్‌లోకి వచ్చే అవకాశం కనబడుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల ఆధారంగా తొమ్మిది జిల్లాలను రెడ్ జోన్లుగా, 19 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. వరుసగా 14 రోజులుగా కేసులు నమోదు కాకపోతే రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌లోకి, అదేవిధంగా ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌లోకి వస్తాయి. ఇక ఇప్పటవరకూ తెలంగాణలో ఒక్క కేసు లేకుండా జీరో కేసులు ఉన్న జిల్లాలుగా నాలుగు ఉన్నాయి. అందులో వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. వీటిని గతంలో స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 872కి చేరుకున్నాయి. సోమవారం రోజున 14 కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో 23కి మృతుల సంఖ్య చేరినట్లుంది. ఈ 14 కేసులలో 12 కేసులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కావడం విశేషం. రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్న కేసుల్లో జిహెచ్‌ఎంసి, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలో ఎక్కవగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇక కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించిన విషయం అందరికి తెలిసిందే.
జాగ్రత్త అవసరం…
జిహెచ్‌ఎంసి పరిధిలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. దీంతో ప్రభుత్వం, అధికారులు జాగ్రత్త వహించాలని, లాక్‌డౌన్ సమయంలో ప్రజలు బయటికి రావొద్దని సూచిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ లిమిట్స్‌లో ఇప్పటి వరకు సుమారు 399 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. సోమవారం ఒక్క రోజే జిహెచ్‌ఎంసి పరిధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ హైదరాబాద్ కమిషనర్ లిమిట్స్‌లో 51 మంది వరకు కోలుకున్నారు. పోలీస్ లిమిట్స్‌లో జోన్ల వారీగా కేసుల వివరాలు పరిశీలిస్తే సౌత్‌జోన్, వెస్ట్‌జోన్‌లలో కరోనా ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. వెస్ట్‌జోన్‌లో 138, సౌత్‌జోన్‌లో 170 వరకు కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ జోన్‌లో 45, ఈస్ట్ జోన్‌లో 33 కేసులు నమోదయ్యాయి. ఇక నార్త్‌జోన్‌లో కరోనా ఇప్పటి వరకు 13 కేసులతో తక్కువ తీవ్రతతో ఉండడం కాస్త సంతోషించదగ్గ విషయమే.
సూర్యాపేటకు ప్రత్యేకాధికారి నియామకం…
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా పేరు వినిపిస్తున్న జిల్లాలు హైదరాబాద్ (జిహెచ్‌ఎంసి), సూర్యాపేట, నిజామాబాద్‌లు ఉన్నాయి. మొదట సూర్యాపేటలో కరోనా తీవ్రత అంతగా లేదు. కానీ మర్కజ్ లింక్‌తో అక్కడ కేసుల తీవ్ర క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే గత రెండు రోజులు మాత్రం సూర్యాపేటలో దాదాపు ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ సూర్యాపేట ఎక్కువ కేసులు ఉన్న జిల్లాల్లో మొదటి మూడు స్థానాల్లో ఉండడంతో ప్రభుత్వం ఆ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం జి.వేణుగోపాల్ రెడ్డిని ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్‌గా మంగళవారం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు మున్పిసల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి… ప్రస్తుతం మున్సిపల్ పరిపాలన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.వేణుగోపాల్ రెడ్డిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డి)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఒఎస్‌డి హుటాహుటినా సూర్యాపేటకు బయలుదేరారు. గతంలో ఆయన కరీంనగర్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు.