భవిష్యత్ కార్యాచరణపై
ప్రజాఫ్రంట్ నేతల సమావేశం
ప్రజాపక్షం/హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు ప్రజాకూటమికి సానుకూలంగానే ఉంటాయని, ప్రభుత్వాన్ని ఏ ర్పాటు చేస్తామని ప్రజాఫ్రంట్ నేతలు ధీమా లో ఉన్నారు. ఒకవేళ ఎవ్వరికీ పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే ఏం చేయాలనే అంశంపై కూడా కూటమి నేతలు చర్చించినట్లు తెలిసింది. ఓటర్లను తొలగిస్తున్నారని మొదటి నుంచీ ఆరోపిస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహారించిందని, అప్పుడు ప్రస్తావించిన అంశాలే ఇప్పుడు నిజమయ్యాయని అభిప్రాయపడిన కూటమి నేత లు, ఓటర్ల తొలగింపు అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఇదివరకే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో మరోసారి ఆ కేసుకు కొనసాగింపుగా ఏం చేస్తే బాగుంటుందనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఆదివారం ప్రజాఫ్రంట్ నేతలు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్.సి.కుంటియా, పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సిపిఐ రాష్ట్ర ఇన్ఛార్జ్ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరా మ్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రా జనర్సింహ, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ శాతం, ప్రజాఫ్రంట్ మధ్య ఓట్ల బదిలీల అంశంతో పాటు ఎన్నికల ఫలితాలపై వివిధ ఎగ్జిట్ పోల్స్, సర్వేలు చెబుతున్న లెక్కలు , వాస్తవ పరిస్థితులు తదితర అంశాలపై సమీక్షించుకున్నట్లు తెలిసింది. ఒక వేళ అటు టిఆర్ఎస్కు, ఇటు ప్రజాఫ్రంట్‌కి పూర్తి మెజార్టీ రాకపోతే వ్యవహారించాల్సిన వ్యూహం, న్యాయ పరమైన అంశాలపై కూడా చర్చ జరిగింది. టిఆర్ఎస్ కంటే ప్రజాకూటమికి ఎక్కువ సీట్లు వస్తే గవర్నర్ ఏ పార్టీని ఆహ్వానిస్తారు..? న్యాయపరంగా ఎవ్వరిని ఆహ్వానించాలి, ఇలాంటి అనేక అంశాలపై ఇప్పటికే కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలు చర్చించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాలలో జరిగిన సంఘటనలపై కూడా కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆరా తీసినట్లు సమాచారం. ఇదే అంశాన్నికొందరు కూటమి నేతల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.